బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ భరించలేకపోతున్నారు. బండి సంజయ్‌తో పోటీలో ఇక తాను పూర్తిగా వెనుకబడిపోయానని అనుకుంటున్నారు. అందుకే డైరక్ట్ ఎటాక్ కు దిగుతున్నారు. బీజేపీలో ఎలాంటి క్రమశిక్షణా రాహిత్యాన్ని భరించరో అలాంటి ప్రకటనలే చేస్తున్నారు.
హుజూరాబాద్ నుంచి ఈటల అనుచరుల్ని ఇంటికి పిలిపించుకున్నారు. వారిని ఉద్దేశించి మాట్లాడారు. హుజూరాబాద్ లో తాను బీజేపీలో చేరక ముందు కనీసం క్యాడర్ లేదని గుర్తు చేశారు. అక్కడ బీజేపీలో ఉన్న వారంతా తన మనుషులేనని స్పష్టం చేశారు. లోక్ సభ ఎన్నికల్లో హుజూరాబాద్ లో యాభై వేల మెజార్టీ ..లోక్ సభ అభ్యర్థికి వచ్చిందన్నారు. నా కొడకా… కడుపులో కత్తులు పెట్టుకొని కౌగిలించుకోవటం నీ సంస్కృతి… అన్నీ పైకి పంపుతున్నా అని ఈ సందర్భంగా హెచ్చరించారు.
ఈటల రాజేందర్ ఆవేశంగా మాట్లాడిన మాటలన్నీ బండి సంజయ్ ను ఉద్దేశించినవే. ఆయన రెండు రోజుల కిందట ఈటలను పరోక్షంగా టార్గెట్ చేశారు. లోక్ సభ ఎన్నికల్లో తనకు హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి తక్కువ ఓట్లు వచ్చేందుకు కొందరు కుట్ర చేశారన్నారు. బీజేపీలో వ్యక్తి పూజ ఉండదని.. అలాంటివి నడవవన్నారు. ఒకే వర్గం ఉంటుందని అది మోదీ వర్గమని స్పష్టం చేశారు. ఇవన్నీ ఈటల రాజేందర్ ను ఉద్దేశించి అన్నవేనని చెప్పుకున్నారు. ఇప్పుడు ఈటల రాజేందర్ హుజూరాబాద్ నుంచి కార్యకర్తల్ని పిలిపించుకుని అంత కంటే ఘోరంగా మాట్లాడారు. ఈటల.. బండి సంజయ్ పేరు ఎక్కడా చెప్పలేదు కానీ ఆయననే అన్నారని సులువుగా అర్థం చేసుకోవచ్చు.
ఈ వ్యవహారంపై ఎవరూ స్పందించవద్దని బండి సంజయ్ తన అనుచరులకు స్పష్టమైన సందేశం ఇచ్చారు. ఈటల చేసిన తప్పు చాలని ఆయనను హైకమాండ్ వద్ద మరింత చులకన చేయడానికి సరిపోతుందని బండి సంజయ్ అనుకుంటున్నారు. బీజేపీలో చేరినా .. తనకు సరైన గుర్తింపు లేదని ఈటల భావిస్తున్నారు. కేంద్ర మంత్రి పదవి రాలేదు.. అప్పుడు బీజేపీ అధ్యక్ష పదవి ఇస్తామన్నారు. అది కూడా రాలేదు. రామచంద్రరావుకు ఇచ్చినా.. అది బండి సంజయ్ ఖాతాలో అని ప్రచారం జరుగుతూండటం..ఈటలను అసంతృప్తికి గురి చేస్తోంది. అయితే ఇలా తిరుగుబాటు ధోరణిలో వ్యాఖ్యలు చేయడం వల్ల బీజేపీలో ఆయన పలుకుబడి తగ్గుతుందన్న అభిప్రాయం వినిపిస్తోంది.