ఈనాడు అంటే సెపరేట్ బ్రాండ్. ఏ రంగంలో అడుగు పెట్టినా సక్సెస్ కొట్టాల్సిందే. అందుకు ఎలాంటి ప్రణాళికలు వేయాలో, ఎలాంటి వ్యూహాలు అమలు చేయాలో వాళ్లకు బాగా తెలుసు. ఈటీవీ విన్ కూడా అలానే పకడ్బందీగా రంగంలోకి దించారు. ఈ సంస్థకు ఇప్పుడు మూడేళ్లు. మూడేళ్లంటే స్వల్ప కాల ప్రయాణమే. కానీ.. ఈ గ్యాప్‌లో ఈటీవీ విన్ చూసిన ఒడిదుడుకులెన్నో. ముందుగా ఆహా నుంచి గట్టి పోటీ ఎదురయ్యింది. సినిమాలు కొనడంలో, ఒరిజినల్స్ రూపొందించడంలో అలసత్వం కనిపించేది. కానీ క్రమంగా పట్టు సాధించింది ఈటీవీ విన్.
’90’ వెబ్ సిరీస్ తో.. ఈటీవీ విన్ విజయవంతమైన ప్రయాణం ప్రారంభమైంది. ఆ సిరిస్ నిజంగానే ఈటీవీ విన్ కి గట్టి బూస్టప్ ఇచ్చింది. కంటెంట్ ని నమ్ముకొని రూపొందించిన కొన్ని సిరీస్‌లు బాగా పే ఆఫ్ ఇచ్చాయి. ఆ తరవాత ‘లిటిల్ హార్ట్స్’ తో వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. పరిమిత బడ్జెట్ లో సినిమాని రూపొందించడం, పక్కా ప్లానింగ్ తో పబ్లిసిటీ చేసుకోవడం విన్కి ప్లస్ పాయింట్స్. థియేట్రికల్ నుంచి ఎంతో కొంత రావాల్సిందే అనే ఒత్తిడి లేదు. దాంతో ఇంకాస్త స్వేచ్ఛగా పని చేయగలుగుతోంది.
మూడో వార్షికోత్సవం సందర్భంగా ఈటీవీ విన్ కొత్త ప్రాజెక్టుల్ని ప్రకటించింది. తిరువీర్ తో `పాపం ప్రతాప్` సినిమాని ప్రకటించింది ఈటీవీ. ‘పాక శాల పంతం’, గుర్తుకొస్తున్నాయి, జిల్లేడు చెట్టు ప్రస్తుతం ఈటీవీ విన్ రూపొందిస్తున్న ప్రాజెక్టులు. ఇప్పటి వరకూ ఈటీవీ విన్ రూ.3 నుంచి 5 కోట్లలోపు సినిమాల్నే రూపొందిస్తోంది. భవిష్యత్తులో బడ్జెట్ లు పెంచుకొంటూ, క్రేజీ కథల్ని సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈటీవీ విన్ రూపొందించిన ‘సంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ మార్చి 6న థియేటర్లలో విడుదల అవుతోంది.