యూరోపియన్ యూనియన్ , భారత్ మధ్య కుదిరిన చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందం ప్రపంచ ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చేలా కనిపిస్తోంది. దీనిని మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ గా ఈయూ అభివర్ణిస్తుండటం చూస్తుంటే, గ్లోబల్ మార్కెట్లో భారత్ ప్రాధాన్యత ఎంతలా పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. ఈ ఒప్పందం వల్ల భారత ఎగుమతులు భారీగా పెరగనున్నాయి. ముఖ్యంగా టెక్స్టైల్స్, ఫార్మా, వ్యవసాయ ఉత్పత్తులకు యూరప్ మార్కెట్లలో భారీ డిమాండ్ ఏర్పడనుంది. అదే సమయంలో, యూరప్ నుంచి వచ్చే లగ్జరీ కార్ల వంటి కొన్ని వస్తువుల ధరలు తగ్గడం మినహా, మిగతా అన్ని రకాలుగా ఈ డీల్ భారత్‌కు అమితమైన మేలు చేకూర్చనుంది.
యూరప్‌తో సున్నం పెట్టుకున్న ట్రంప్
ఈ భారీ ఒప్పందం వెనుక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న తుగ్లక్ నిర్ణయాలే కారణం. ట్రంప్ తన రెండో విడత పదవీకాలంలో తీసుకుంటున్న కఠినమైన వాణిజ్య నిర్ణయాలు, సుంకాల విధింపు హెచ్చరికల కారణంగానే.. యూరోపియన్ యూనియన్ ప్రత్యామ్నాయం కోసం భారత్ వైపు వేగంగా అడుగులు వేసిందనే వాదన వినిపిస్తోంది. ట్రంప్ తనదైన శైలిలో ప్రతి యుద్ధాన్ని నేనే ఆపాను అని చెప్పుకున్నట్లే, ఇప్పుడు ఈ డీల్ కుదరడానికి కూడా తన అమెరికా ఫస్ట్ విధానాలే కారణమని క్రెడిట్ తీసుకోవచ్చు . తన కఠిన నిర్ణయాల వల్లే యూరప్ దారిలోకి వచ్చి భారత్‌తో చేతులు కలిపిందని ఆయన చెప్పుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు.
తగ్గిపోతున్న అమెరికా ప్రాధాన్యం
అమెరికా కూడా ఈ ఒప్పందాన్ని మౌనంగానే అంగీకరిస్తోంది. చైనాపై ఆధారపడటాన్ని తగ్గించాలనే వ్యూహంలో భాగంగా, ప్రజాస్వామ్య దేశమైన భారత్‌తో యూరప్ ఆర్థిక బంధం బలపడటాన్ని వాషింగ్టన్ పెద్దగా వ్యతిరేకించడంలేదని అంటున్నారు. కానీ ట్రంప్ వ్యవహారం మొత్తం తేడాగా ఉంటుంది. చైనా కన్నా ఆయన భారత్ పైనే ఎక్కువగా ఫోకస్ చేస్తారు. సుంకాలు వేస్తారు. రష్యా ఆయిల్ ను చైనా దిగుమతి చేసుకుంటున్నా…. ఆ దేశంపై ఆంక్షలు వేయడానికి భయపడ్డారు. భారత్ పై మాత్రం ప్రతి ఒక్క విషయంలోనూ బెదిరింపులకు దిగారు.
గ్లోబల్ సప్లయ్ చైన్‌లో భారత్ కీలకం
ఈ ట్రేడ్ డీల్ భారత్‌ను గ్లోబల్ సప్లై చైన్‌లో అగ్రగామిగా నిలబెట్టబోతోంది. అగ్రరాజ్యాల మధ్య సాగుతున్న వాణిజ్య యుద్ధాల మధ్య భారత్ తన ప్రయోజనాలను కాపాడుకుంటూనే, అటు అమెరికాతోనూ, ఇటు యూరోపియన్ యూనియన్‌తోనూ సమాన దూరాన్ని పాటిస్తూ ఆర్థికంగా లాభపడుతోంది. రాబోయే రోజుల్లో ఈ ఒప్పందం అమలులోకి వస్తే, భారత పారిశ్రామిక రంగం సరికొత్త పుంతలు తొక్కడం ఖాయంగా కనిపిస్తోంది.
