ఎన్.టి.ఆర్ : కరిగిపోయే కాలంలో చెదరని జ్ఞాపకం!

  • రాజకీయ శూన్యం నుంచి మహా శక్తి ఆవిర్భావం
  • నాయకుడికోసం రోజులకొద్దీ పడిగాపులు
  • భావావేశాల నుంచే సంక్షేమరాజ్యం
  • యోధుడికి ఆయుధాలు అందించిన ఈనాడు
  • మందీ మార్బలం లేని ప్రజల వద్దకు పాలన

హృదయపూర్వకమైన పరిపాలన సాగించిన ఏకైక ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారు!

ఏ నాయకుడైనా బుద్ధి పూర్వకంగా నిర్ణయాలు తీసుకుంటారు. ప్రత్యర్ధుల ఎత్తుగడలను చిత్తుచేయడం, సొంత ఇమేజ్ పెంచుకోవడం, వంటి రాజకీయాలు ఆ నిర్ణయాల వెనుక వుంటాయి. అందుకు భిన్నంగా, హృదయ స్పందనలకు అనుగుణంగా, ప్రజలను ఓట్లుగా కాక ప్రజలుగానే చూడగల నాయకులు ఎన్ టి ఆర్ తరువాత లేరు…ఇకపై వస్తారన్న ఆశకూడా లేదు. ఆయన తనువు చాలించి ఇవాల్టికి ఇరవై ఏళ్ళయింది. కరిగిపోయే కాలంలో చెదరని జ్ఞాపకం లాంటి ఎన్ టి ఆర్ రాజకీయ జీవితంలో కొన్ని కీలకమైన పరిణామాలను అతి సమీపంగా చూసిన అవకాశాలు జర్నలిస్టుగా పెద్దాడ నవీన్ అనే నాకు దొరికాయి. ఉత్తేజభరితమైన కొన్ని ఎన్ టి ఆర్ స్మృతులు గతానికీ, వర్తమానానికీ బేరీజు వేసే ప్రతీసారీ అలలు అలలుగా గుర్తుకొస్తూనే వుంటాయి.

సమర్ధవంతమైన ప్రతిపక్షం లేక, అధికార కాంగ్రెస్ ముఠాతగాదాలతో కుళ్ళిపోయి ప్రజల గోడూఘోషా పట్టించుకునే నాధుడు లేని రాజకీయశూన్యం రాష్ట్రాన్ని ఆవరించినపుడు ఎన్ టి ఆర్ అపూర్వమైన ప్రజాబలంతో ముఖ్యమంత్రి అయ్యారు. చైతన్యరధం మీద (ఎం జి రామచంద్రన్ వాడిన చవర్లెట్ వేన్) కేవలం తొమ్మిదినెలల్లో ఆయన రాష్ట్రమంతటా తిరిగారు రధం పై నిలబడి వేలకొద్దీ సభలో మాట్లాడారు. ప్రజలు గుమిగూడిన ప్రతిచోటా చిన్నదో పెద్దదో ఆయన ఉపన్యాసం ఇవ్వవలసిందే. ఇందువల్ల షెడ్యూలు కంటే రెండుమూడురోజులు కూడా టూర్ ఆలస్యమయ్యేది. ఇప్పటిలా టివిలు, మొబైల్ ఫోన్లు లేని 34 ఏళ్ళ క్రితం ఎన్ టి ఆర్ ప్రయాణించే మార్గంలో పరిసర గ్రామాల వారు ట్రాక్టర్ల మీదా, ఎడ్ల బళ్ళ మీదా సద్దిమూటలతో వచ్చి రెండేసి రోజులు ఆయన్ని చూడటానికి, ఆయన మాటలు విడానికి రెండేసి రోజులు వేచివున్న సంఘటనలు రాష్ట్రమంతటా వున్నాయి.

ఎన్ టి ఆర్ ఎక్కడ ఏమి మాట్లాడాలో ఈనాడు ఇన్ పుట్స్ ఇచ్చింది. అందులో ఫైనల్ కాపీ రాసిన అవకాశం నాకు దక్కింది. అపుడు నేను ఈనాడు అగ్రికల్చరల్ బ్యూరోలో సబ్ ఎడిటర్ అండ్ సబ్ రిపోర్టర్ని. ప్రాంతాల వారీగా సమస్యలని క్రోడీకరించి అంకెల వివరాలతో క్లుప్తంగా నోట్ రాసే పని మా చీఫ్ కీర్తిశేషులు వాసిరెడ్డి సత్యనారాయణగారు నాకు అప్పగించారు. బ్యాక్ గ్రౌండర్లు రాసుకుని సిద్ధం చేసుకోవడమే ఈ పని ప్రయోజనమని చెప్పారు. విలేకరుల నుంచి సమాచారం తెప్పించుకుని కాపీరాసి చూపించే వాడిని. ప్రతీసారీ సైజ్ ఎక్కువైపోయిందని చీఫ్ అనేవారు. A4 సైజు పేపర్ ని సగం చేసి. అందులో 10 లైన్లకు మించని సైజు బాగుంటుందని అనుకున్నాను. తెలుగు తెలిసిన టైపిస్ట్ కీర్తిశేషురాలు ఉమాదేవితో ఆప్రకారం టైప్ చేయించి చూపించాను. ఆఫార్మేట్ చీఫ్ కి నచ్చింది. ఉమాదేవి సీటు మా సెక్షన్ లోకి వచ్చేసింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలు మినహా కోస్తాజిల్లాల, రాయలసీమ జిల్లాల నోట్సులు రెడీ అయ్యాయి.

ఎన్ టి ఆర్ టూర్ మొదలయ్యింది. న్యూస్ ఎడిటర్ మోటూరి వెంకటేశ్వరరావు నన్ను కూడా బయలు దేరమన్నారు. మనం రిపోర్టు చేయనవసరం లేదు. రెగ్యులర్ టీమ్ రిపోర్టు చేస్తుంది. మనపని అబ్జర్వు చేసి నోట్సు రాసుకోవడమే అని చెప్పారు. తిరువూరు వద్ద ఎన్ టి ఆర్ కాన్వాయ్ లో కలిశాము. ఫాలో అవుతున్నాము. ఆయన ఉపన్యాసాలన్నీ నేను రాసిన నోట్సు లో లాగే వుంది. ఆశ్చర్యం అనిపించింది. మరుసటి రోజు మైలవరం ప్రాంతంలో ఎన్ టి ఆర్ మాట్లాడుతున్నపుడు ఇది ష్యూర్ గా నా కాపీనే అనిపించింది. మోటూరిగారితో ఆమాటే అంటే నీకు తెలియకపోవడమేంటి ఇదంతా మన వర్కే..ఇదంతా నీకాపీనే. తెలంగాణాలో జెవిఆర్ కాపీ రాశాడు అని చెప్పారు. నేను ఆశ్చర్యం నుంచి తేరుకోడానికి అరగంటపట్టింది. ఎగ్జయిట్ మెంటయితే రెండురోజులు దిగనే లేదు.

ఎన్ టి ఆర్ యోగా, స్నానమూ, జపమూ, భోజనమూ ముగిసేటప్పడికి అంటే తెల్లవారు జాము నాలుగూ, ఐదు గంటల మధ్య మోటూరిగారూ, నేనూ రెడీఅయి ఆయన ముందుకి వెళ్ళేవాళ్ళం. ఆరోజు రూట్ లో ప్రదేశాలను వాటి సమస్యలను మోటూరి గారు వివరించి నోట్సు ఇచ్చేవారు. ఎన్ టి ఆర్ కొన్ని వివరాలు అడిగేవారు. మా సార్ వివరించేవారు. ఇందకాలమూ ప్రభుత్వాలు ఏంచేస్తున్నాయి అని ఎన్ టి ఆర్ ఆవేశపడేవారు. ప్రజలకు ఇన్ని కష్టాలా అని బాధపడే వారు. ఒకేసారి అంకెలు తప్పు చెప్పేవారు. కరెక్టు చేసినా తప్పులే చెప్పేవారు. అలాంటి సందర్భాల్లో ” అన్నగారూ అంకెలు వదిలెయ్యండి అని మోటూరిగారు అనడమూ, రైటో బ్రదర్ అని ఆయన బదులివ్వడమూ జరిగేది. ఆరోజంతా ”కుక్కమూతి పిందెల కాంగ్రెస్” మీద ఎన్ టి ఆర్ తిట్ల దండకం బాగాసాగేది.

చైతన్య రధాన్ని ఎన్ టి ఆర్ కుమారుడు హరికృష్ణ నడిపేవారు. వ్యాన్ పై ఎన్ టి ఆర్ ఉపన్యాసం మొదలు కాగానే గాలి ఎటు వేస్తూందో గమనించి ఎన్ టి ఆర్ కు వాలు గాలివైపు వాన్ కి ఆనుకుని హరికృష్ణ సిగరెట్ వెలిగించేవారు. ఆయనతో పాటు కొన్ని సార్లు నేను కూడా…

ఎన్ టి ఆర్ టూర్ కవర్ చేయడానికి ఢిల్లీ నుంచి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే జర్నలిస్టులకు సిట్యుయేషన్ ఎక్స్ప్లెయిన్ చేసే పని కూడా నాకు అప్పగించారు. ఒకే విషయాన్ని ఎన్ని యాంగిల్స్ లో చూడవచ్చో ఈ పనిలో నేను నేర్చకున్నాను.

రధం వెనుకే తెల్ల అంబాసిడర్ కారు, ఎన్ టి ఆర్ కు వంటచేసే వ్యక్తి, ఒళ్ళు మసాజ్ చేసే జైల్ సింగ్, మరో సహాయకుడు ఆకారులో వుండే వారు. ఆతరువాత కారులో మోటూరిగారు, నేను వుండే వాళ్ళం. పర్వత నేని ఉపేంద్రగారు చాలా సార్లు మా కారు ఎక్కేవారు. కాంగ్రెస్ విమర్శలు, ఇతర పార్టీల స్పందనలను రోజూ సాయంత్రం 4/5 మధ్య ఉపేంద్రగారూ, మోటూరిగారూ ఎన్ టి ఆర్ గారికి బ్రీఫ్ చేసి ఖండన రెస్పాన్స్ కూడా చెప్పేవారు. ఆతరువాత మీటింగ్ లో ఎన్ టి ఆర్ ఉపన్యాసంలో అదంతా బయటకు వచ్చేది.అలా ఖమ్మం, కృష్ణ్, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి జిల్లాలలో దాదాపు మూడునెలలు ఎన్ టి ఆర్ వెంట నేనూ తిరిగాను.

న్యూన్ డెవలప్ మెంటు ఆధారంగా ఎన్ టి ఆర్ దృష్టిలో వుంచవలసిన పాయింట్లను నోట్స్ గా అప్పటి కప్పుడు రాసి ఇవ్వడమే ఈ టూర్ లో నా పని. ”మీ దస్తూరి బాగుంది” అని రెండు సార్లు నన్ను మెచ్చకున్నారు. మోటూరిగారు లేనపుడు మూడు సార్లు నేనే సబ్జెక్టు బ్రీఫ్ చేయవలసి వచ్చింది. నా కంగారు గమనించి ఉపేంద్రగారే కవర్ చేసే వారు.

……

రెండోదశలో ప్రతీ అసెంబ్లీ సెగ్మెంటునుంచీ కులసమీకరణలను దృష్టిలో వుంచుకుని ప్రాధాన్యతా క్రమంలో నలుగురేసి అభ్యర్ధులను ఎంపిక చేసే పని అప్పగించారు. జాబితాలు తయారు చేసి పంపాము. అంతటితో మా పని ముగిసింది. మా జాబితాల్లో 62 శాతం మందికి టికెట్స్ ఇచ్చారు.

…….

మూడోదశలో ఎన్ టి ఆర్ రెండోసారి ముఖ్యమంత్రి అయి ప్రజలవద్దకు పాలన కార్యక్రమాన్ని విశాఖ జిల్లాలో ప్రారంభించడానికి లక్ష్మీ పార్వతితో సహా ట్రెయిన్ లో రాజమండ్రి వచ్చి రాత్రి వుండిపోయారు. ఉదయం ప్రెస్ కాన్ఫరెన్స్ లో ప్రజలవద్దకు పాలన గురించి వివరించారు. ఆయన్ని పదవి నుంచి దించి వేయడానికి చంద్రబాబు బృందం అప్పటికే విశాఖలో మంతనాలు జరుపుతోంది. ఎన్ టి ఆర్ సతీ సమేతంగా హెలికాప్టర్ లో విశాఖ బయలు దేరారు. సాంకేతిక సమస్య వల్ల అది పత్తిపాడు సమీపంలో హైవే పక్కన ఫోర్స్ బుల్ లాండింగ్ అయ్యింది. ఇది తెలిసి కలెక్టర్ సమీర్ శర్మ ఒఎన్ జిసి హెలికాప్టర్ లో స్పాట్ కి బయలు దేరారు. సమిర్ నా వ్యక్తిగత స్నేహితుడు కూడా అయివుండటం వల్ల నన్ను కూడా చోపర్ లో తీసుకు వెళ్ళారు.

మేము వెళ్ళేసరికి ఎన్ టి ఆర్ – పొలాల్లో ఒక టవల్ మీద బాసింబట్టు పోశ్చర్ లో కూర్చొని ప్రజల సమస్యలు వింటున్నారు. ఒక టీచర్ వాటిని నోట్ చేస్తున్నారు. ప్రమాదం నుంచి తప్పించకుని, అధికారులు సిబ్బంది లేని స్ధితిలో ప్రశాంతంగా ప్రజల మధ్య, ప్రజల సమస్యలు తెలుసుకుంటున్న ఎన్ టి ఆర్ ను చూసినపుడు రాజర్షి అంటే ఈయనే అనిపించింది. తరువాత శ్రీకాకుళం జిల్లాలో రెండు మూడు ప్రజలవద్దకు పాలన కార్యక్రమాలు నిర్వహించారు. రాజకీయ సంక్షోభం సూచనలతో హైదరాబాద్ చేరుకున్నారు. పదవినుంచి దించి వేయ బడ్డారు.

కాకతాళీయమో యాధృచ్చికమో కాని ఈనాడు నాకు ఇచ్చిన ఎసైన్ మెంట్ వల్ల ఎన్ టి ఆర్ రాజకీయ ప్రవేశం చేసిన తొలిరోజుల్లో ఆయన్ని అతి సమీపం నుంచి చూశాను. ఆయన స్వయంగా రూపొందించిన ”ప్రజలవద్దకు పాలన” ను మందీమార్బలం లేని స్వచ్ఛమైన స్ధితిలో చూడగలిగాను.

రాజ్యాంగంలో పొందు పరచిన శ్రేయోరాజ్యం / వెల్ఫేర్ స్టేట్ భావనను ను నిజం చేసింది ”పేదవాడికి పట్టెడన్నం పెట్టలేని” అధికారం ఎందుకన్న ఎన్ టి ఆర్ భావావేశమే. ఆడపడుచుల పట్ల ఇంత చిన్నచూపా అన్న ఎన్ టి ఆర్ ఆవేదనే స్త్రీకి ఆస్తి హక్కు చట్టబద్దమైంది. అధికారం దోచుకోడానికేనా అన్న ఎన్ టి ఆర్ ధర్మాగ్రహమే కాంగ్రెస్ కు జాతీయ ప్రత్యామ్నాయంగా నేషనల్ ఫ్రంట్ ను పుట్టించింది. అధికారం ఎవడబ్బ సొస్తు అన్న ఎన్ టి ఆర్ గర్జనే కాంగ్రెస్ కాళ్ళ కంద నలిగిపోతున్న ఫెడరల్ స్ఫూర్తిని సగౌరవంగా సిహాసనం ఎక్కించింది.

తెలుగుదేశం పిలుస్తోంది కదలిరా! అన్న, అన్న పిలుపు పై ఆంధ్రదేశమే అన్న వెంట పరుగులు తీసింది. తల్లులు చంకనవున్న పిల్లల్ని నేల మీద విడిచి ఆయాసమొచ్చే వరకూ చైతన్య రధం వెంట పరుగులు తీసిన సమ్మోహనం ఎన్ టి ఆర్ ది.

అంతటి భావావేశం, చిత్తశుద్ధి, లక్ష్యశుద్ధి వున్న నాయకుడు మళ్ళీ ప్రజల్లోకి వస్తారన్న నమ్మకంలేదు. అందుకే ఎన్ టి ఆర్ ని కారణజన్ముడు అనడం అతిశయోక్తి కాదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మీడియా వాచ్ : యూటర్న్‌లో కల్ట్ చూపిస్తున్న ఎన్టీవీ

ఎన్టీవీలోని అపరిచితుడు బయటకు వచ్చేశాడు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నంత కాలం కాంగ్రెస్ పై.. రేవంత్ రెడ్డిపై.. బీఆర్ఎస్ కు ఇష్టం లేని నేతలపై.. వాళ్ల టార్గెట్ ను రీచ్ ...

బీఆర్ఎస్‌లో ఉండను : మల్లారెడ్డి

బీఆర్ఎస్‌లో ఉండేది లేదని మల్లారెడ్డి ప్రకటించారు. తాను పూర్తి స్థాయి రాజకీయ నాయకుడ్ని కాదని.. పార్ట్ టైమ్ రాజకీయ నేతను.. పూర్తి స్థాయి వ్యాపారవేత్తనని చెప్పుకొచ్చారు. తన వ్యాపారాలకు రక్షణ కోసమైనా...

లేటుగా వ‌చ్చినా ప్ర‌తాపం చూపిస్తున్న‌ ‘హ‌నుమాన్’

ఈ యేడాది సంక్రాంతికి విడుద‌లైన `హ‌నుమాన్` బాక్సాఫీసు ద‌గ్గ‌ర కొత్త రికార్డులు సృష్టించింది. చిన్న సినిమాగా వ‌చ్చి ఏకంగా రూ.300 కోట్ల మైలు రాయిని అందుకొంది. ఇప్పుడు ఓటీటీలో ప్ర‌త్య‌క్ష‌మైంది. ఇక్క‌డా.. 'హ‌నుమాన్‌'...

స‌మంత భ‌య‌పెట్టేస్తోంది

క‌థానాయిక‌ల పారితోషికంపై ఎప్పుడూ ఎడ‌తెగ‌ని చ‌ర్చ జ‌రుగుతూనే ఉంటుంది. స్టార్ హోదా వ‌చ్చిన క‌థానాయిక‌లు ఎప్ప‌టి క‌ప్పుడు త‌మ రేట్ల‌ని పెంచుకొంటూ పోతుంటారు. డిమాండ్ - అండ్ స‌ప్లై సూత్రం ప్ర‌కారం నిర్మాత‌లూ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close