ప్రొ.నాగేశ్వర్: జాతీయ రాజకీయాల్లో చంద్రబాబు లెక్కలపై ఏడు ప్రశ్నలు..!

జాతీయ రాజకీయాల్లో మళ్లీ తెలుగుదేశం పార్టీ కీలక పాత్ర పోషించబోతోందని మహానాడు వేదికగా ఆ పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. వచ్చే ఎన్నికల తర్వాత తామే ప్రధానమంత్రిని నిర్ణయిస్తామంటున్నారు. గతంలో తాము జాతీయ రాజకీయాలను.. ఎంతగా ప్రభావితం చేశామో.. వచ్చే ఎన్నికల తర్వాత కూడా.. అంతే ప్రభావం చూపిస్తామంటున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితి అలా లేదనడానికి ఏడు కారణాలున్నాయి.

1. నాటి రాజకీయ పరిస్థితుతులు ఇప్పుడు లేవు..!
గతంలో తెలుగుదేశం పార్టీ జాతీయ రాజకీయాల్లో కీలకమైన పాత్ర పోషించింది. ఎన్టీఆర్ హయాంలో నేషనల్ ఫ్రంట్ తర్వాత చంద్రబాబు హయాంలో యునైటెడ్ ఫ్రంట్, ఎన్డీఏ వన్ ప్రభుత్వాలకు ప్రాణవాయువుగా టీడీపీ ఉంది. దీనికి కారణం.. అప్పుడు కాంగ్రెస్ పార్టీకి బలమైన ప్రత్యామ్నాయాలు లేవు. ఉన్న ప్రాంతీయ పార్టీల్లో అత్యంత బలమైనది..తెలుగుదేశం పార్టీనే. అందుకే అప్పట్లో టీడీపీ హవా నడిచింది. జాతీయ రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసింది. ఇప్పుడా పరిస్థితి లేదు. ఎందుకంటే.. కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదిగింది. రెండు పార్టీలు పరస్పరం పోటీ పడుతున్నాయి. పైగా దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలు పెద్ద సంఖ్యలో పుట్టుకొచ్చాయి. వాటి బలం కూడా పెంచుకుంటూ వెళ్తున్నాయి.

2. టీడీపీని మంచిన ప్రాంతీయ పార్టీలొచ్చాయి..!
తెలుగుదేశం పార్టీ జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించినప్పుడు ప్రాంతీయ పార్టీలు పెద్దగా లేవు. కానీ ఇప్పుడు దాదాపుగా ప్రతి రాష్ట్రానికో ప్రాంతీయ పార్టీ పుట్టుకొచ్చింది. అదీ కూడా.. చాలా రాష్ట్రాల్లో అధికారం పొందే స్థాయిలోనో… అధికారాన్ని ప్రభావితం చేసే స్థాయిలోనే ఆ పార్టీలు బలం పుంజుకుంటున్నాయి. బెంగాల్‌లో తృణమూల్, యూపీలో ఎస్పీ, బీఎస్పీ, ఒడిషాలో బీజేడీ, కర్ణాటకలో జేడీఎస్..ఇలా ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయి.

3. పార్లమెంట్ సీట్ల పోటీలో బలం తగ్గిపోవడం…!
ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జాతీయ స్థాయిలో ప్రభావం చూపించిందంటే కారణం.. అప్పుడు ఏపీలో 42 పార్లమెంటు సీట్లు ఉండటం. వాటిలో 30 నుంచి 35 వరకూ టీడీపీ గెలుచుకుంటూడటంతో… సంఖ్యా బలం బాగా కనిపించింది. కానీ రాష్ట్ర విభజన తర్వాత ఇప్పుడు టీడీపీ బలంగా పోటీ పడగలిగిన స్థానాలు ఇరవై ఐదుకు పడిపోయాయి.

4. ఏపీలో ప్రాంతీయ పార్టీల మధ్యే పోటీ..!
తెలుగుదేశం పార్టీ అప్పట్లో.. కాంగ్రెస్ పార్టీ..అంటే జాతీయ పార్టీతోనే పోటీ పడేది. అందుకే .. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ప్రజలు.. ప్రాంతీయ పార్టీకే పట్టం కట్టేవారు. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ లేదు. మరో ప్రాంతీయ పార్టీతోనే… టీడీపీ పోరాడాల్సి వస్తోంది. టీడీపీ కూటమి నుంచి బయటకు వెళ్లిపోతే..బీజేపీ ఎందుకు లైట్ తీసుకుంది..?. టీడీపీ వెళ్తే వైసీపీ వస్తుందనే కదా..!

5. టీడీపీ ఎన్ని సీట్లు గెలుస్తుందన్నదే ప్రశ్న..!
2019 ఎన్నికల్లో ఎన్నికల్లో ఇప్పుడున్నన్ని సీట్లు వస్తాయా అన్నది సందేహం. గత ఎన్నికల్లో బీజేపీ, జనసేనతో కలిసి పోటీ చేశారు. ఇప్పుడు వారు విడిపోయారు. ఎంతో కొంత అధికార వ్యతిరేకత ఉంటుంది. కాబట్టి.. గతంలో వచ్చినన్ని పార్లమెంట్ సీట్లు వస్తాయా అన్నది కూడా ప్రశ్నే.

6. యాంటీ కాంగ్రెస్, యాంటీ బీజేపీ ఫ్రంట్‌లకు చాన్స్ లేదు..!
జాతీయ రాజకీయాల్లో .. జాతీయ పార్టీల ప్రమేయం లేకుండా… ఫ్రంట్‌ ఉండే అవకాశం లేదు. ప్రాంతీయ పార్టీలన్నీ..ఏదో ఓ జాతీయ పార్టీ అండ కోసం రాజీ పడుతున్నాయి తప్ప… సొంత సిద్ధాంతాల కోసం.. ఫెడరలిజం కోసం ప్రయత్నించడం లేదు. అలా ఉంటాము అని చెబుతున్నారంటే.. అది కచ్చితంగా ప్రజలను మభ్యపెట్టడమే.

7. టీడీపీ ఓ స్టాండ్‌పై నిలబడుతుందన్న నమ్మకం లేదు..!
తెలుగుదేశం పార్టీ జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలంటే.. అదీ కూడా.. బీజేపీకి వ్యతిరేకంగా రాజకీయాలు చేయాలంటే.. క్రెడిబులిటి క్రైసిస్ వస్తుంది. ఎందుకంటే.. టీడీపీ ఇంతకు ముందు బీజేపీతో రెండు సార్లు పొత్తులు పెట్టుకుంది. రెండు సార్లు విడిపోయింది. టీడీపీ మళ్లీ బీజేపీతో జత కట్టదన్న గ్యారంటీ లేదు. ఇది కూడా… తెలుగుదేశం పార్టీకి ఓ ప్రధాన సమస్య.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.