ఎన్ కౌంటర్ పై సర్వత్రా హర్షం, కానీ…

దిశ అత్యాచారం నిందితుల ఎన్ కౌంటర్ పై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. అయితే ఈ ఎన్ కౌంటర్, దేశవ్యాప్తంగా ఇటు వంటి సంఘటనల విషయంలో ఎలా స్పందించాలో ప్రభుత్వాలకు, పోలీసులకు “దిశ “చూపుతోందా అన్న చర్చ జరుగుతోంది. అదేవిధంగా ఈ ఎన్ కౌంటర్ కొన్ని కొత్త ప్రశ్నలను కూడా లేవనెత్తింది కాదు నిజం.

దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై సర్వత్రా హర్షం:

నిర్భయ ఘటన తర్వాత అంతగా దేశం మొత్తాన్ని కదిలించిన ఘటన దిశ అత్యాచారం, హత్య. మధ్య రాత్రి కూడా కాదు కేవలం రాత్రి 9 గంటల సమయంలో, ప్రజలు డబ్బు చెల్లించి మరీ ప్రయాణించే అవుటర్ రింగ్ రోడ్డు కు అత్యంత సమీపంలో లో నలుగురు కిరాతకులు మద్యం మత్తు లో వెటర్నరీ డాక్టర్ ‘ దిశ’ ని అమానుషంగా అత్యాచారం చేసి, చంపేసి, మృతదేహం పై కూడా అఘాయిత్యం చేశారు అన్న వార్తలు దేశవ్యాప్తంగా ప్రజలను కలచివేశాయి. ప్రత్యేకంగా హైదరాబాద్లో నివసించే వారి లో భద్రత మీద భయాందోళనలు కలిగాయి. అయితే ఈ తెల్లవారుజామున సీన్ రీ కన్స్ట్రక్షన్ చేస్తుండగా నిందితులు పారిపోవడానికి ప్రయత్నించారని, పోలీసుల మీద రాళ్లు పోవడానికి ప్రయత్నించారని, తుపాకులు కూడా లాక్కోవడానికి ప్రయత్నించారని, ఆ సందర్భంగా ఆత్మరక్షణ కోసం వారి మీద కాల్పులు జరపాల్సి వచ్చిందని, ఆ కాల్పుల్లో నలుగురు చనిపోయారు అని పోలీసులు చెబుతున్నారు. అక్కడ జరిగింది ఏమైనప్పటికీ, దిశ కుటుంబానికి న్యాయం జరిగిందని ఆమె ఆత్మకు శాంతి చేకూరిందని ప్రజల నుండి స్పందన వస్తోంది.

ఎన్కౌంటర్ సమర్థించిన పలువురు ప్రముఖులు:

హీరో మంచు మనోజ్ ట్విట్ చేస్తూ, “ఆ బుల్లెట్టు దాచుకోవాలని వుంది ఆ తుపాకులకు దండం పెట్టాలని వుంది. ఆ పోలీసుల కాళ్ళు మొక్కాలని వుంది. నలుగురు చచ్చారు అనే వార్త లో ఇంత కిక్కు వుందా..?? ఈ రోజే నే ఆత్మ దేవుడ్ని చేరింది చెల్లెమ్మా..!” అని రాసుకొచ్చారు.

జూనియర్ ఎన్టీఆర్ కూడా ఎన్కౌంటర్ పై స్పందించారు. ఇప్పుడు న్యాయం జరిగిందని ఆయన ఆత్మకు శాంతి చేకూరుతుందని అన్నారు. అదేవిధంగా హీరో నిఖిల్ కూడా మనం దిశ ని తీసుకురా లేకపోవచ్చు కానీ ఈ ఎన్కౌంటర్ వల్ల ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చేయవచ్చు అని స్పందించారు.

ప్రముఖుల నుండే కాకుండా, సామాన్యుల నుంచి కూడా పోలీసుల మీద ప్రభుత్వం మీద సానుకూల స్పందన వస్తోంది.

ఎన్ కౌంటర్ పై ప్రజల హర్షం, కానీ చర్చించాల్సిన రెండు విషయాలు:

దిశ అత్యాచారం ఈ విషయంలో నిందితులు ఏ రాజకీయ పలుకుబడి లేనటువంటి సామాన్య కుటుంబాల నుండి వచ్చిన వాళ్ళు. ఒకవేళ ఇదే నిందితులు గనక ధనవంతుల కుటుంబాల నుండో, లేక రాజకీయ పలుకుబడి ఉన్న కుటుంబాల నుండి వచ్చిన వారైతే పోలీసులు ఎన్కౌంటర్ చేసే వారా అనే చర్చ కొనసాగుతోంది. వరంగల్ యాసిడ్ దాడుల విషయంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రోద్బలంతోనే అప్పుడు ఎన్కౌంటర్ జరిగింది అని వాదించేవారు కూడా ఆయేషా మీరా హత్యకేసులో రాజశేఖర్రెడ్డి హయాంలో న్యాయం జరగలేదని గుర్తు చేస్తున్నారు.

ఇదే సమయంలో చర్చకు వచ్చిన రెండవ అంశం ఏమిటంటే, దిశ అత్యాచార నిందితులకు ఇదే తరహా శిక్ష కోర్టుల ద్వారా పడి ఉంటే, ప్రజల్లో న్యాయవ్యవస్థ మీద మరింత నమ్మకం, భరోసా కలిగి ఉండేది. కానీ చట్టాలకు అతీతంగా జరిగిన ఈ న్యాయంపై తాత్కాలికంగా ప్రజల లో హర్షం వ్యక్తం అయినప్పటికీ, ప్రజలలో కోర్టుల ద్వారా ఇటువంటి నిందితులకు శిక్ష పడేలా చేయడం అసాధ్యమన్న విషయాన్ని వారి మస్తిష్కంలో మరింత బలంగా చొప్పిస్తోంది.

న్యాయ వ్యవస్థను మరింతగా బలోపేతం చేయడం, ఇటువంటి కిరాతకులకు భవిష్యత్తులో న్యాయ వ్యవస్థ ద్వారానే బలమైన శిక్షలు పడేలా చట్టాలను సవరించడం – ఈ రెండు పనులు చేయడానికి ప్రభుత్వాలు నడుం బిగించాల్సి ఉంది

– జురాన్ ( @CriticZuran)

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com