స్టాలిన్ : శభాష్ పోలీస్..! ఈ శిక్ష హైప్రోఫైల్ నిందితులకూ వేయగలరా..?

(This article is part of Telugu360 Contributor Network and hasn't been edited by our team. If you have any questions or want to contribute, reach out to krishna@telugu360.com)

“దిశ” హత్యాచారం నిందితులకు పోలీసులకు.. ఇన్‌స్టంట్ శిక్ష విధించారు. అందులో సందేహం లేదు. ఈ సమయంలో హక్కుల సంఘాల పేరుతో.. కొంతమంది తెరపైకి వస్తారు. వారిని చట్టానికి విరుద్ధంగా..అలా కాల్చి చంపడం.. కరెక్ట్ కాదనే వాదన తెరపైకి తీసుకు వస్తారు. పోలీసుల తీరును తప్పు పడతారు. చర్చలు కూడా ప్రారంభమవుతాయి. కానీ.. ఈ విషయంలో పోలీసులకు వంద శాతం మద్దతుగా నిలబడాల్సిన సమయం ఇది. వారి చర్యలను హర్షించాల్సిన సందర్భం. హక్కుల సంఘాల మాటున.. మానవ మృగాలకు మద్దతుగా మాట్లాడేవారిని లైట్ తీసుకోవాల్సిన అవసరం…!

వారు మనుషులు కాదు మానవ మృగాలు..!

ప్రపంచంలో ప్రతి ఒక్కరికి జీవించే హక్కు ఉంది. ఒకరి జీవించే హక్కును.. కాలరాసిన వాళ్లకి.. జీవించే హక్కు లేనట్లే. “దిశ” ఓ సాధారణ యువతి. ఈ లోకంలో ఉన్న తోడేళ్ల గురించి తెలియదు. ఇంత దారుణాలు జరుగుతాయని ఆలోచించలేని మధ్యతరగతి అమ్మాయి. మూగజీవాలకు బాధతో విలవిల్లాడితే తట్టుకోలేనంత సున్నిత మనస్థత్వం ఉన్న అమ్మాయి. ఎంతో భవిష్యత్ ఉన్న ఆ అమ్మాయి జీవితాన్ని చిదిమేసి.. దారుణంగా…హత్య చేసి.. సజీవదహనం చేసేంత క్రూరత్వం ఉన్న వాళ్లను మనిషులు అని.. ఎలా అనగలం..? అలాంటి వారిని వధిస్తే.. తప్పు చేశారని.. ఎలా అనగలం..? ఆ నిందితుల ప్రవర్తన, మానసిక స్థితి మృగాల కన్నా దారుణంగా ఉందని.. ఆ ఘటన జరిగిన వైనం… ఆ తర్వాత వారిలో ఏ మాత్రం పశ్చాత్తాపం లేని వ్యవహారం.. స్పష్టం చేసింది. అందుకే వారిని మానవ మృగాలుగా నిర్ధారించడం వంద శాతం కరెక్ట్.

చట్టాల లక్ష్యం.. శిక్షించడం కాదు..! భద్రత కల్పించడం…!

సీఆర్పీ, పీనల్ కోడ్ చట్టాల లక్ష్యం… నేరం జరిగిపోయిన తర్వాత నేరస్తుల్ని శిక్షించడం కాదు. నేరం జరగకుండా భయ పెట్టడం. కానీ.. ఇప్పుడు జరుగుతుంది వేరు. చట్టాలపై భయం పోయింది. అలాంటి భయం కల్పించాల్సిన బాధ్యత పోలీసులపై పడింది. ఇప్పుడు సైబరాబాద్ పోలీసులు ఆ భయాన్ని కల్పించే ప్రయత్నం చేశారు. నిందితులు చేసిన.. తెలివి తక్కువ పనితో.. వారు తమ విధిని సక్రమంగా నిర్వర్తించారు. అనుకున్నది సాధించారు. ఇప్పుడు.. చట్టాలను చూసి.. నేరస్తులు భయపడతారు. ఓ అమ్మాయి గురించి.. చెడుగా మాట్లాడాలన్నా.. చెడు ప్రవర్తనకు దిగాలన్నా… “దిశ” గుర్తుకు వస్తుంది. భయం కలిగిస్తుంది. అదే.. చట్టం లక్ష్యం. ఆ కోణంలో.. పోలీసులు అనుకున్నది సాధించినట్లే..!

చట్టంపై గౌరవం పెంచిన ఎన్‌కౌంటర్..!

న్యాయం ఆలస్యం కావడం కూడా అన్యాయం చేయడమే. దేశంలో చాలా చట్టాలున్నాయి. అందర్నీ కాపాడేందుకు… నేరస్తుల బారి నుంచి.. రక్షించేందుకు చట్టాలున్నాయి. కానీ.. వాటి అమలులో లొసుగుల వల్ల.. న్యాయం అందడం ఆలస్యం అవుతోంది. అంటే.. అన్యాయం జరుగుతోంది. ఇలాంటి సమయంలో చట్ట విరుద్ధంగా ఎన్ కౌంటర్ చేస్తారా..? అంటూ.. కొంత మంది మేధావులు ఈ సమయంలో తెరపైకి వస్తారు. కానీ.. ఈ ఎన్ కౌంటర్ చట్టబద్ధంగానే జరిగింది. చట్టంపై గౌరవం పెంచేలా జరిగింది. న్యాయం.. సమర్థంగా.. ఎనిమిది రోజుల్లోనే అందేలా పోలీసులు చేయగలిగారు.

నిందితులు “హైప్రోఫైల్” అయితే ఈ న్యాయం జరిగేదా..?

నిజమే.. దేశంలో చాలా ఘటనలు జరుగుతున్నాయి. అందులో నేరస్తుల స్థాయిని బట్టి న్యాయ, అన్యాయాలు నిర్ధారమవుతున్నాయి. దిశ ఘటనలో… నిందితులు హై ప్రోఫైల్ వ్యక్తులు అయితే.. ఈ ఎమోషన్ ఉండేదా.. అన్నది ప్రధానమైన ప్రశ్న. అప్పుడు ఎన్ కౌంటర్ చేసేవారా అన్నది మరో ప్రశ్న. అసలు.. ఈ కేసు.. సినీ, రాజకీయ, పారిశ్రామిక రంగాలకు చెందిన హైప్రోఫైలో.. లో ప్రోఫైలో మెయిన్‌టెయిన్ చేసే వ్యక్తుల హస్తం ఉంటే… దాన్ని ఈ పాటికి మసిపూసి మారేడు కాయ చేసి ఉండేవారు. ఈ ఎన్ కౌంటర్ల డిమాండ్లు అసలు రావు. వచ్చినా పోలీసుల మనసుల్లో ఉండవు. ఈ నిజాన్ని మనం అంగీకరించాల్సిందే. గతంలో జరిగిన ఎన్నో ఘటనల్లో .. జరిగింది ఇదే.

అయితే… దేశంలో భిన్నాభిప్రాయాలు సహజం. ప్రతీ పనిలోనూ మంచీ.. చెడూ ఉంటాయి. ఎంత ఎక్కువ మందికి మంచి జరిగితే.. అదే మంచి. అనుకోవాలి. వాళ్లను చట్టప్రకారం..ఎన్ కౌంటర్ చేశారా..? ఆత్మరక్షణ కోసం ఎన్ కౌంటర్ చేశారా..? ప్రజలు కోరారని ఎన్ కౌంటర్ చేశారా..? అన్నది తర్వాత విషయాలు. ఈ ఎన్ కౌంటర్ వల్ల సమాజానికైతే మంచే జరుగుతుందని.. జనం నమ్మకం…!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com