ఈ సెప్టెంబరు బాక్సాఫీసుకి చాలా కీలకం. ఎందుకంటే ఆగస్టులో ఒక్కటంటే ఒక్క హిట్టు లేదు. అంతకు ముందు కూడా బాక్సాఫీసుకు అంతంత మాత్రమే. సెప్టెంబరులో కూడా హిట్టు పడకపోతే, బయ్యర్లు పీకల్లోతు మునిగిపోవడం ఖాయం. సెప్టెంబరు తొలివారం అంత ఆశాజనకంగా కనిపించలేదు. ఘాటీ, మదరాసీ రెండూ ఫ్లాపులే. అయితే అనూహ్యంగా ‘లిటిల్ హార్ట్స్’ బాక్సాఫీసుని గట్టెక్కించింది. ఈ చిన్న సినిమా ఊహించని రీతిలో విజయాన్ని అందుకొంది. రూ.2.5 కోట్లతో తీసిన సినిమా ఇది. కనీసం రూ.30 కోట్ల గ్రాస్ వస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. చిన్న సినిమాలకు ఇది కచ్చితంగా ఓ బూస్టప్.
ఈవారం ‘మిరాయ్’ వచ్చింది. అంతటా బొమ్మ అదిరిందన్న రిపోర్టే. తేజా సజ్జా ఖాతాలో మరో మంచి విజయం పడినట్టే. పైగా ‘మిరాయ్’ సోలో రిలీజ్. మరో రెండు వారాల వరకూ ఈ సినిమాకు ఎదురు లేదు. 25న ‘ఓజీ’ వస్తోంది. సెప్టెంబరులోనే కాదు, ఈ యేడాది మొత్తానికి `ఓజీ` ఓ తీపి గుర్తుగా మిగిలిపోతుందని ఇండస్ట్రీ బలంగా నమ్ముతోంది. పవన్ కల్యాణ్ – సుజిత్ కాంబో మొదలైనప్పటి నుంచీ ఈ సినిమాకు హైప్ ఉంది. ఓజీ గ్లింప్స్ రావడంతో అది రెట్టింపు అయ్యింది. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ.. ఓజీ ఫీవర్ ఎక్కువ అవుతోంది. ఇది వరకు సెప్టెంబరు 25న ‘అఖండ 2’ పోటీగా ఉండేది. ఇప్పుడు అది కూడా లేదు. కాబట్టి ‘ఓజీ’దే రాజ్యం. ఇప్పటికే ప్రీ బుకింగ్స్ తో హీట్ పుట్టిస్తోంది ఓజీ. ఈ హవా ఇలానే కొనసాగితే.. ఫస్ట్ డే రికార్డు నెంబర్లు చూడడం ఖాయం. ఏమాత్రం పాజిటీవ్ టాక్ వచ్చినా, ఈ యేడాది టాలీవుడ్ చూసే అతి పెద్ద విజయం ‘ఓజీ’నే అవుతుంది. బయ్యర్లు ఇదే కోరుకొంటున్నారు. బాక్సాఫీసుకు మళ్లీ జోష్ రావాలంటే ‘ఓజీ’ హిట్ కొట్టడం అత్యవసరం. ప్రారంభంలో ‘లిటిల్ హార్ట్స్’ ఇప్పుడు ‘మిరాయ్’.. 25న ‘ఓజీ’ ఇలా హిట్లు పడుతూ పోతే… ఈ సెప్టెంబరు కచ్చితంగా గుర్తుండిపోతుంది.