విశాఖలో పెట్టుబడుల సదస్సు అద్భుతంగా జరిగింది. రూ. పదమూడు లక్షల కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు జరిగాయి. అయితే ఈ సదస్సులో ఒక్కటే వెలితిగా కనిపించింది. జనసేనకు చెందిన మంత్రులు దుర్గేష్, నాదెండ్ల కనిపించారు కానీ..డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కనిపించలేదు. ఆయన సచివాలయంలోనే సమీక్షలు చేస్తున్నారు. దీనికి కారణం ఏమిటి అన్నదానిపై వైసీపీలో కూడా చర్చలు జరుగుతున్నాయి.
విశాఖ సమ్మిట్‌లో కీలకంగా వ్యవహరించిన జనసేన మంత్రులు
విశాఖ సమ్మిట్‌లో జనసేన మంత్రులు నాదెండ్ల మనోహర్, దుర్గేష్ కీలకంగా వ్యవహరించారు. నాదెండ్ల మనోహర్ ప్రారంభ కార్యక్రమంలో ఏపీ ఇండస్ట్రియల్ ఎకోసిస్టమ్‌పై మంచి ఉపన్యాసం ఇచ్చారు. పారిశ్రామికవేత్తలకు ప్రయారిటీలు చెప్పారు. దుర్గేష్ కూడా తమ శాఖ పరిధిలో ఎన్నో ఒప్పందాలు చేసుకున్నారు. కానీ వీరు ఎంత క్రియాశీలకంగా వ్యవహరించినా పవన్ కల్యాణ్ రాకపోవడం మాత్రం కాస్త వెలితిగానే ఉంటుంది.
సచివాలయంలోనే సమీక్లల్లో పవన్ కల్యాణ్
అలాగని పవన్ కల్యాణ్ ఇతర విషయాల్లో బిజీగా లేరు. ఆయన అధికారిక కార్యక్రమాల్లోనే ఉన్నారు. సచివాలయంలోనే విస్తృత సమీక్షలు చేస్తున్నారు. పంచాయతీరాజ్ , అటవీ శాఖల విషయంతో పాటు పిఠాపురం లో అభివృద్ధి కార్యక్రమాల విషయంలో కీలక ఆదేశాలు జారీ చేస్తూ వచ్చారు. అధికారిక కార్యక్రమాల్లో ఉన్నప్పుడు.. విశాఖకు వస్తే మరింత ఉత్సాహంగా ఉండేది కదా అన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఆయన రాకపోయినా సోషల్ మీడియాలో పెట్టుబడుల సదస్సు,ఇన్వెస్టర్ల నమ్మకంపై ఓ ట్వీట్ పెట్టారు.
పవన్ కల్యాణ్ వెళ్లకపోవడానికి కారణం ఆయనకే తెలియాలి !
పవన్ కల్యాణ్ ఎప్పుడూ ప్రోటోకాల్ విషయంలో చంద్రబాబు తర్వాత ఉంటారు. ఆయన ప్రభుత్వంలో కీలక వ్యక్తి. ఆయన రాకపోవడం అనేది ఉండదు. కానీ తాను వెళ్లాలని అనుకోలేదని జనసేనవర్గాలు చెబుతున్నాయి. దానికి కొన్ని కారణాలు కూడా ఉన్నాయంటున్నారు. ఈ పెట్టుబడుల కోసం చంద్రబాబు, లోకేష్ తీవ్రంగా కష్టపడ్డారు. తాను వస్తే.. కొంత అయినా క్రెడిట్ తనకు ఇచ్చే ప్రయత్నం చేస్తారని అలా తనకు ఇష్టం లేదని పవన్ అనుకున్నారని అంటున్నారు. అదే సమయంలో యంత్రాంగం అంతా విశాఖలో ఉంటే పాలన గాడి తప్పే ప్రమాదం ఉంది కాబట్టి తాను.. అమరావతి నుంచి మానిటర్ చేశారని చెబుతున్నారు.
కారణం ఏదైనా పవన్ కల్యాణ్ కూడా వచ్చి ఉంటే.. ఇన్వెస్టర్స్ సమ్మిట్ మరింత కలర్ ఫుల్ గా ఉండేదనడంలో సందేహం లేదు. ఆయన అసంతృప్తితో రాలేదని మాత్రం ఎవరూ అనుకోవడం లేదు. ఒక్క వైసీపీ వాళ్ల సొంత ఆనందం కోసం తప్ప.
