మాంఝీ సరే, ఖాద్రిపై సినిమా తీయరా?

యదార్థ సంఘటనలకు సినిమా రూపం ఇవ్వడం కొత్తేమీకాకపోయినా తాజాగా విడుదలైన `మాంఘీ ద మౌంటేన్ మ్యాన్’ సినిమా కొత్త ఆలోచనలకు బీజంవేస్తోంది. బిహార్ లో మాంఘీ అనే వ్యక్తి తన భార్యజ్ఞాపకాలతో ఏకంగా కొండను తొలిచి రహదారివేస్తే, ఉత్తరప్రదేశ్ లోని ఖాద్రి తన భార్యపట్ల ప్రేమను వ్యక్తం చేయడంకోసం మినీ తాజ్ మహల్ నే నిర్మిస్తున్నాడు.
దశరథ్ మాంఘీ కథ బాలివుడ్ సినిమాగా తెరకెక్కింది. అలాగే, ఫాజుల్ హాసన్ ఖాద్రి యదార్థఘటనపై కూడా సినిమా తీస్తే ప్రేమికులకు మంచి స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందనడంలో సందేహంలేదు. ఆ యదార్థ సంఘటనను చెప్పేందుకే ఈ ప్రయత్నం.

మాంఘీ భార్య ఒక ప్రమాదంలో చిక్కుకుంటుంది. ఆమెను ఆస్పత్రికి తీసుకువెళ్లాలంటే కొండచుట్టూ తిరిగివెళ్ళాల్సిందే. అంతదూరం వెళ్లేసరికి ఆమె కన్నుమూసింది. దీంతో మాంఘీలో కసి పెరిగింది. ఈ కొండ అడ్డులేకపోతే తన భార్య బ్రతికేదికదా అన్న ఆలోచనతో కొండను పిండిచేద్దామనుకుంటాడు. తనవద్ద ఉన్న సుత్తి, ఉలిసాయంతో కొండరాళ్లను బద్దలుకొట్టడం ప్రారంభిస్తాడు. 22ఏళ్లపాటు ఎవరెన్నిఅన్నా పట్టించుకోకుండా కొండను తొలిచి చివరకు మధ్యలో నుంచి దారితయారుచేస్తాడు మాంఘీ. దీంతో ఆస్పత్రికి, స్కూల్ కీ వెళ్లేవాళ్లకు దూరం తగ్గిపోయింది. ఈ సంఘటన స్ఫూర్తితో కేతన్ మెహతా దర్శకత్వంలో `మాంఝీ ది మౌంటెన్ మ్యాన్ ‘ పేరిట తీసిన హిందీచిత్రం శుక్రవారం (21-08-15) విడుదలైంది. మాంఘీ పాత్రను నవాజుద్దీన్ సిద్ధిఖీ పోషించాడు.

సరే, మరి ఫాజుల్ హాసన్ ఖాద్రి కథఏంటీ? ఉత్తరప్రదేశ్ లోని కేసర్ కాలన్ అనే గ్రామానికి చెందిన ఖాద్రి ప్రేమకథే ఇది. యాదార్థ ఘటనలతో ఓ మంచి ప్రేమకథా చిత్రం తీయాలనుకునేవారికి ఇదో ప్రేరణ.

ఇదీ ఖాద్రి కథ

ఖాద్రికి ఇప్పుడు 80ఏళ్లు. పండుముసలి. తెల్లని గడ్డం వెనుక అతని ప్రేమకథ దాగుంది. తన బేగం కోసం రాత్రనకా, పగలనకా కష్టపడి మినీ తాజ్ మహల్ కట్టిస్తున్నాడు. ఇతనో రిటైర్డ్ పోస్ట్ మాస్టర్. షాజహాన్ – ముంతాజ్ ప్రేమకు చిహ్నంగా ఆగ్రాలో తాజ్ మహల్ కట్టించినట్టు ఖాద్రి ఒక్కొక్క ఇటుక పేరుస్తూ మినీతాజ్ మహల్ కట్టిస్తున్నాడు. ఎవరిసాయం తీసుకోకుండా తన సొంతడబ్బుతో ఈ ప్రేమచిహ్నాన్ని కట్టిస్తున్నాడతను. తన ఇంటి ఆవరణలో ఇది నిర్మాణమవుతోంది. ఇందుకోసం ఖాద్రి వ్యవసాయ భూమిని, భార్య తాజమ్ములి నగలను అమ్మేశాడు. తాజమ్మలి 2011లో మరణించింది. తాను చనిపోయినతర్వాత ఎవరు గుర్తుపెట్టుకుంటారని ఆమె అతణ్ణి అడుగుతుండేదట. అందుకు అతను – `నేను నీకోసం టూంబ్ కట్టిస్తాను, దీంతో అంతా గుర్తుపెట్టుకుంటారు’- అని చెబుతుండేవాడట.

ఖాద్రి మినీతాజ్ మహల్ కట్టిస్తుండటంతో ఊర్లోవాళ్లు అతణ్ణి సామాన్యుల్లో షాజహాన్ లాంటివాడని అంటున్నారు. ఐదువేల చదరపు అడుగుల విస్తీర్ణంలో కట్టిన ఈ మినీతాజ్ మహల్ కట్టడం చూసేందుకు పర్యాటకులు కూడా వస్తున్నారు. ఖాద్రీ తాజమ్మలిల వివాహం1953లో అయిందట. అప్పటి నుంచి వీరిది అన్యోన్య దాంపత్యం. తాజమ్మలి మరణానంతరం ఖాద్రి ఈ 27 అడుగుల ఎత్తున్న కట్టడం పనిమొదలుపెట్టాడు. స్థానిక మేస్తీల సాయం తీసుకుంటూ కట్టించాడు. ఇక ఫినిషింగ్ వర్క్ మిగిలింది.

మినీ తాజ్ మహల్ మందు చక్కటి చెట్లు పెంచాలనీ, కట్టడానికి చలవరాతి తాపడం చేయించాలని అనుకుంటున్నాడు ఈ ప్రేమికుడు. ఇప్పటిదాకా ఆరులక్షల రూపాయలు ఖర్చుపెట్టాడు. ఇంకా ఆరేడు లక్షల పని మిగిలేఉంది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి సహా అనేక మంది ప్రముఖులు ఈ కట్టడాన్ని సందర్శించి ఖాద్రికి సాయంచేయడానికి ముందుకువచ్చినా, ఇతను మాత్రం తానీపని సొంతంగానే చేయాలనుకుంటున్నానంటూ సున్నితంగా తిరస్కరిస్తున్నాడు. `ఇది నా ప్రేమకు తార్కాణం. ఇది అచ్చంగా నా సొంతం’ అని అంటుంటాడు ఖాద్రి. `నేను చనిపోయేలోపు దీన్ని పూర్తిచేస్తాను. నా మరణానంతరం భౌతికదేహాన్ని ఇక్కడే పూడ్చిపెట్టాలి’ – అని చెబుతుంటే ఊర్లోజనం కళ్లవెంట నీరు పెట్టుకుంటున్నారు.

ప్రేమ, పట్టుదల, పేదరికం, ఉన్నత వ్యక్తిత్వం వంటి అనేక అంశాలున్న ఈ యదార్థ సంఘటన కచ్చితంగా సినిమా తీయడానికి పనికొచ్చేదే. మరి ఈ కథతో బాలీవుడ్ వాళ్లు సినిమా తీస్తారో, లేక టాలీవుడ్ స్పందిస్తుందో చూద్దాం.

– కణ్వస

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com