సోషల్ మీడియా వేదికలైన ఎక్స్ , ఇన్‌స్టాగ్రామ్‌లలో గల్ఫ్ దేశాలపై జరుగుతున్న దాడులకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అయితే, వీటిలో దాదాపు 90 శాతం వీడియోలు ఏఐ ద్వారా సృష్టించినవి, వీడియో గేమ్ గ్రాఫిక్స్ నుండి తీసుకున్నవని నిపుణులు నిర్ధారిస్తున్నారు. ముఖ్యంగా దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫా కూలిపోతున్నట్లు, నగరం మొత్తం అగ్నిప్రేమలో చిక్కుకున్నట్లు చూపిస్తున్న వీడియోలు పూర్తిగా నకిలీవి. ఇవి కేవలం భయాందోళనలు సృష్టించేందుకు కొందరు కావాలని వైరల్ చేస్తున్నవే తప్ప, క్షేత్రస్థాయిలో అటువంటి భారీ విధ్వంసం ఏదీ జరగలేదు.
వాస్తవానికి, గల్ఫ్ దేశాలలో పరిస్థితి సోషల్ మీడియాలో చూపిస్తున్నంత దారుణంగా లేదు. దుబాయ్, అబుదాబి వంటి నగరాల్లో జనజీవనం సాధారణంగానే ఉంది. బుర్జ్ ఖలీఫాతో పాటు ఏ ఇతర కీలక భవనాలపై కూడా దాడులు జరగలేదు. వైరల్ అవుతున్న చిత్రాల్లోని అగ్నిగోళాలు, పేలుళ్లు ఏఐ టెక్నాలజీ తో ద్వారా రూపొందించినట్లు ఫ్యాక్ట్ చెక్ సంస్థలు స్పష్టం చేశాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వం కూడా ఇటువంటి తప్పుడు సమాచారాన్ని, రూమర్లను వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
గత కొన్ని రోజులుగా నిలిచిపోయిన విమాన రాకపోకలు ఇప్పుడు పాక్షికంగా పునఃప్రారంభమయ్యాయి. ఎమిరేట్స్, ఎతిహాద్, ఫ్లై దుబాయ్ వంటి విమాన సంస్థలు ఇప్పటికే పరిమిత సంఖ్యలో సర్వీసులను నడుపుతున్నాయి. భారత్ నుండి కూడా ఇండిగో వంటి సంస్థలు జెడ్డా వంటి నగరాలకు ప్రత్యేక విమానాలను నడుపుతూ కార్యకలాపాలను క్రమబద్ధీకరిస్తున్నాయి. విమానాశ్రయాలు తెరిచి ఉన్నాయని, ప్రయాణికులు తమ విమాన సంస్థల నుండి అధికారిక సమాచారం వచ్చిన తర్వాతే విమానాశ్రయాలకు రావాలని అధికారులు సూచిస్తున్నారు.