ఫలక్ నుమా దాస్ సమీక్ష — మందు..మటన్..దందాలు

Telugu360 Rating – 2.25

ఎవరక్కడ.

ఓ నాలుగు కట్టలు డిస్పోజబుల్ గ్లాసులు,

రెండు కేసుల బీర్లు, ఓ కేసు మందు పట్రండి..

ఎవరక్కడ

పక్కా తెలంగాణ ఉర్దూ, తెలుగు కలగలిసిన, పక్కా నేటివ్ డైలాగులు పేజీలకు పేజీలు రాసేయండి. సీనుకు ఎన్ని అవసరం, అనవసరం అన్నది మరచిపోండి

ఎవరక్కడ

కనిపించిన వాళ్లను కనిపించినట్లు తీసుకురండి. మేకప్ వేసి వేషాలు ఇచ్చేద్దాం.

ఫలక్ నుమా దాస్ సినిమా చూసాక ఇలా అనిపిస్తే అది మీ తప్పు ఎంతమాత్రం కాదు. పక్కా తెలంగాణ లోకల్ రియలిస్టిక్ సినిమాను ప్రెజెంట్ చేద్దాం అనే యావలో పడి, అసలు విషయానికి తిలోదకాలు ఇచ్చి, కొసరు విషయాలు పట్టుకుని, కిందా మీదా అయిపోయిన సినిమా యూనిట్ ది.

అంగమలై డైరీస్..మళయాళంలో పెద్ద హిట్ సినిమా. పెద్ద సంఖ్యలో కొత్త ఆర్టిస్టులకు అవకాశం ఇచ్చిన సినిమా. పది నిమషాలకు పైగా షాట్ ను సింగిల్ టేక్ లో అది కూడా వందకు పైగా ఆర్టిస్టులు వున్న షాట్ ను తీసి, రికార్డు సృష్టించిన సినిమా. అలాంటి సినిమా తెలుగులోకి వస్తోంది అంటే ఎంతయినా ఆసక్తి వుంటుంది. పైగా సురేష్ మూవీస్ లాంటి బ్యానర్ సినిమా ను సమర్పిస్తోంది అంటే అంతో ఇంతో విషయం వుంటుందని ఆశించడం సహజం. కానీ ఇన్ని ఆశల మద్య సినిమాకు వెళ్తే అడియాసే మిగులుతుంది.

చిన్నతనం నుంచే దందాల మీద ఆసక్తి పెంచుకున్న కుర్రాడి జీవితం ఎక్కడ ప్రారంభమై, ఎన్ని మలుపులు తిరిగి, ఎక్కడకు చేరింది అన్నది సినిమా లైన్.

మలయాళంలోని స్టోరీకి చిన్న చిన్న మార్పులు చేసి, హైదరాబాద్ స్లమ్ లేదా గల్లీ ప్రాంతానికి అడాప్ట్ చేయడం వరకు బాగానే వుంది. కానీ రియలిస్టిక్ అప్రోచ్ అనే ధ్యాసలో పడి, ఎంతవరకు తీయాలి. ఎంత తీయాలి అన్నది మరచిపోయి, అలా అలా సీన్లకు సీన్లు, తీసుకుంటూ పోయారు. చెప్పాల్సిన దాంట్లో క్లారిటీ మిస్ చేసుకున్నారు. అక్కరలేనివి డిటైల్డ్ గా తీసుకున్నారు.

దాస్ (విశ్వక్ సేన్) తల్లి, చెల్లితో బతికే హైదరాబాద్ బస్తీ కుర్రాడు. తన మైండ్ సెట్ కు నచ్చిన నలుగురితో కలిసి దందాలు చేస్తూ బతికేస్తుంటాడు. ఓ సమయంలో దందాలు కాకుండా, బుద్దిగా వ్యాపారం చేద్దామని, స్నేహితులతో కలిసి మటన్ వ్యాపారం మొదలుపెడతాడు. ఆ వ్యాపారం కారణంగా ఇద్దరు రౌడీలు ప్లస్ పోటీ వ్యాపారులతో గొడవ వస్తుంది. ఇలాంటి టైమ్ లో దాస్ ఓ మర్డర్ కేసులో ఇరుక్కుంటాడు. దాని నుంచి బయట పడడానికి కిందా మీదా అవుతాడు. ఆఖరికి డబ్బుల కోసం ఏవేవో చేసి బయటపడతాడు. అప్పుడు ఇక ఏం మిగిలింది? ఏం జరిగింది? అన్నది సినిమా.

ఎ జర్నీ ఆఫ్ రిషి అన్నట్లుగా ఏ జర్నీ ఆఫ్ దాస్ అనుకోవాలి సినిమా మొత్తం చూసాక. తెగిన గాలిపటం గాలికి దాని చిత్తానికి అది వెళ్లినట్లు, సినిమా కథ మొత్తం రైటర్ కంట్రోల్ లో లేకుండా అలా వెళ్తుంది. ఎక్కడా సినిమాటిక్ టచ్ వుండదు. సినిమా ఓపెన్ అయిన దగ్గర నుంచి చివరి వరకు తాగుడు..తాగుడు..తెగ మాట్లాడుడు..తినుడు. ఇదే యావ. తెర ముందు వున్నవాళ్లకు కూడా గుప్పు గుప్పు మని కొట్టేంతగా మందు సీన్లే మందు సీన్లు. పాత్రలన్నీ గలగలా తెలంగాణ స్లాంట్ లో మాత్రమే కాకుండా, లోకల్ లాంగ్వేజ్ లో గలగలా మాట్లాడేస్తూ వుంటాయి. ప్రేక్షకుడు ఫాలో కావడం తప్ప చేసేది ఏమీ వుండదు. తెలంగాణ రియలిస్టిక్ సినిమా అంటే అలా మందుతాగుతూ వుండడం, మంచింగ్ కోసం మాంసం తింటూ వుండడం తప్ప మరేమీ కాదా? అన్న అనుమానం కలుగుతుంది.

ఫకాల్న నవ్వే సీన్ సినిమా మొత్తం మీద ఒక్కటీ వుండదు. అలా అని గుండెల్ని మెలిపెట్టే రియలిస్టిక్ సీన్లు కూడా వుండవు. సినిమా అలా సాగిపోతూ వుంటే, ప్రేక్షకుడు కళ్లు అప్పగించి అలా చూస్తూ వుండాలంతే. సినిమా టేకాఫ్ కాస్త బాగానే వున్నట్లు అనిపిస్తుంది. హీరో బృందం ఎంట్రీ వరకు సరిగ్గానే వున్నట్లు వుంటుంది. ఆ తరువాత తరువాత సినిమా దాని దారిన అది ఎటో వెళ్తున్నట్లు, సాగుతున్నట్లు, అసలు విషయం చెప్పకుండా నాన్చుతున్నట్లు అనిపిస్తుంది. విశ్రాంతి ఎప్పుడా అని ఎగ్జిట్ గేట్ ల వైపు చూడడం ప్రారంభమవుతుంది.

అలాంటి టైమ్ లో చిన్న ట్విస్ట్ తో ఇంటర్వెల్ బ్యాంగ్. గలత్ షాట్ అంటూ. నిజమే ఇది గలత్ షాట్ నే అనుకుంటూ జనాలు బయటకు వెళ్లి, చిన్న ఆశతో మళ్లీ వస్తారు లోపలికి.

ఇక అక్కడి నుంచి సినిమా అలా అలా ఓ దారితప్పిన యువకుడి బయోపిక్ అన్నట్లుగా అలా అలా వెళ్తూ, వెళ్తూ, క్లయిమాక్స్ కు చేరుకుంటుంది. మలయాళంలో మాదిరిగానే బోలెడు మంది ఆర్టిస్టులు, స్టడీకామ్ కెమేరాతో పది నిమషాలకు పైగా సింగిల్ టేక్ షాట్ తీయడం అన్నది కాస్త ఆశ్చర్యం కలిగిస్తుంది.

ఇంత టాలెంట్ పెట్టుకుని కూడా ఇలా సినిమా స్క్రిప్ట్ ఎందుకు తయారుచేసుకున్నారా? అనిపిస్తుంది. అసలు బాంబు వేసి, మర్డర్ చేసిన వాడిని విట్ నెస్ లేదని పోలీసులు అలా బయట వదలడం ఏమిటో? మాటి మాటికీ విట్ నెస్ లేదని వదులుతున్నా అని పోలీసులు బెదిరించడం ఏమిటో? అక్కడ మాత్రం రియలిస్టిక్ అప్రోచ్ కనిపించదు.

రియలిస్టిక్ అప్రోచ్ నుంచి సినిమాను అంగుళం పక్కకు జరిపి, కాస్త షార్ప్ గా, క్రిస్పీగా డైలాగులు వుంచుకుని, ఉత్తేజ్ లాంటి వాళ్ల ఓవర్ యాక్షన్ ను కాస్త అదుపుచేసే ప్రయత్నం చేసి వుంటే కనీసం ఓ మంచి ప్రయత్నంగానో, యావరేజ్ సినిమా గానో మిగిలి వుండేది కదా అనిపిస్తుంది.

దీనికి తోడు సినిమాలో పాటలు ఒక్కటీ జనాలకు పట్టదు. కళ్ల ముందు నడుస్తున్న సినిమానే అలా వుంటే, దానికి తోడు ఈ పాటలేంట్రా బాబూ అని జనం గొణుక్కోవడం తప్పదు. కానీ మ్యూజిక్ డైరక్టర్ వివేక్ సాగర్ బ్యాక్ గ్రవుండ్ స్కోర్ మాత్రం బాగా చేసాడు. సినిమా నిండా నటులే. ఒకరు ఇద్దరు కారు. యాభైకి పైగానే. ఏ ఒక్క ఫేస్ రిజిస్టర్ కాదు. సినిమాలో హీరోకి మూడు చిన్న చిన్న లవ్ ట్రాక్ లు. అవి కూడా అంతే. హీరోయిన్ల నయినా కాస్త కనుముక్కు తీరు వున్నవాళ్లను తీసుకోవాల్సింది. జబర్దస్త్ లో మగవాళ్లు ఆడవేషం వేసుకున్న తీరు గుర్తుకు వస్తుంది.

ద్వితీయార్థం చూసేసరికి, తొలిసగం మీద వచ్చిన కాస్త ఇంప్రెషన్ పోతుంది. అయితే హీరో విశ్వక్ సేన్ కు డైరక్టర్ గా కాస్త మంచి మార్కులే పడతాయి. షాట్ లోకేషన్లు, తెలియని మొహాల చేత కూడా మాంచి నటన రాబట్టుకోవడం, క్లయిమాక్స్ ను సింగిల్ షాట్ లో పది నిమషాలు ప్లాన్ చేయడం, సినిమా మొత్తం రియలిస్టిక్ లొకేషన్లు, రియలిస్టిక్ అప్రోచ్ తో వెళ్లడం, ఇవన్నీ ప్రయత్నాలే తప్ప, మెచ్చుకోదగ్గ విషయాలే తప్ప, సినిమాను ఆక్టుకునేలా మార్చలేకపోయాయి.

సాధారణంగా తెలంగాణ నేటివ్ సినిమా అంటే ఎంటర్ టైన్ మెంట్ ప్రధానంగా వుంటుంది. ఎంత రియలిస్టిక్ సినిమా అయినా, అందులోంచి ఫన్ పుట్టించే ప్రయత్నం వుంటుంది. కానీ ఈ సినిమాలో ఎక్కడా అది అంతగా కనిపించదు. హీరో, హీరోయిన్ల మధ్య రెండు మూడు రొమాంటిక్ మూమెంట్లు వుంటాయి. కానీ హీరోయిన్ల ఫేస్ లు ఫుణ్యమా అని అవి జనాలకు పట్టవు.

విశ్వక్ సేన్, తరుణ్ భాస్కర్ లాంటి వాళ్లు, పేర్లు తెలియకపోయినా, రౌడీ పార్టనర్ లుగా నటించిన వాళ్లు బాగానే చేసారు.

మొత్తం మీద ఫలక్ నుమాదాస్ ఓ విఫల పయత్నం. ఏ సీన్ ఎంతవరకు అవసరం, అసలు ఏ సీన్ అవసరం, అనవసరం అన్న విషయాలు పట్టించుకోలేదు. మలయాళం సినిమాను దాదాపుగా ఫాలో అయిపోయారుు. అది ఎక్కడో..ఎందుకో..వికటించింది. వాక్యానికి కర్త..కర్మ..క్రియ వున్నట్లే, కథకు కూడా కొన్ని లక్షణాలు వుండాలి. అందులోనూ సినిమా కథకు. అది లేకపోతే, మిగిలిన హంగులు, నవతరం టేకింగ్, రియలిస్టిక్ అప్రోచ్ ఇలా ఎన్ని వున్నా వృధానే.

ఫినిషింగ్ టచ్….ఫసక్…నుమా..దాస్

Telugu360 Rating – 2.25

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close