అమరావతి రైతుల సమస్యలంటూ కొంత మంది వీడియోలు చేయడం.. పోలోమంటూ టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలు ఇంత కంటే ప్రభుత్వాన్ని విమర్శించడానికి అవకాశం దొరకదంటూ ఎగేసుకుని రావడం.. కామన్ అయిపోతోంది. టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలే రాళ్లు వేస్తూంటే.. అమరావతిపై ద్వేషం పెంచుకున్నవారు బండలు, బాంబులతో రాకుండా ఉంటారా?. ఇప్పుడు అదే జరుగుతోంది. వ్యక్తిగత సమస్యను తీసుకొచ్చి పరిష్కరించాల్సిందేనని మాట్లాడే రైతుల్ని తీసుకు వచ్చి.. అసలు విషయం తెలుసుకోకుండా సమస్యలు అంటూ.. ప్రభుత్వంపై నిందలేస్తున్నారు.
కందుల రమేష్‌కు పూర్వపరాలు తెలియవా ?
2014-19 సమయంలో చంద్రబాబు ప్రభుత్వంలో.. ఆంధ్రప్రదేశ్ పత్రిక సంపాదకుడిగా వ్యవహరించిన ప్రముఖ జర్నలిస్ట్ కందుల రమేష్‌కు ఈ సారి అలాంటి పోస్టు, పదవి ఏమీ రాలేదు. ఆయన యూట్యూబ్ చానల్ ద్వారా తన జర్నలిజం చేస్తున్నారు. అంత వరకూ బాగానే ఉంది.. ఇటీవలి కాలంలో అమరావతి రైతుల కష్టాలను, సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడంలేదనే వాదన ఉద్దేశపూర్వకంగా ప్రారంభించారు. రెండు, మూడు సందర్భాల్లో ఆయన ప్రస్తావించిన సమస్యలు పూర్తిగా వ్యక్తిగత సమస్యలుగా నిర్దారణ అయ్యాయి. ఈ సారి ఆయన 90 ఏళ్ల వృద్ధురాలిని రోడ్డున పడేశారంటూ.. పెద్ద కథనం చేశారు. కానీ అసలు విషయాలు ఆయన పూర్తిగా సీఆర్డీఏ అధికారుల నుంచి తెలుసుకోలేకపోయారు. ఆ ప్రయత్నం కూడా చేయలేదేమో కానీ.. ఇప్పుడు ఆ కథనం ఆధారంగా అమరావతి అంటే ద్వేషం పెంచుకున్నవారందరూ.. బండలేస్తున్నారు.
అమరావతి రైతుల్ని రియల్ ఎస్టేట్ వ్యాపారులు అన్న వారికీ ఇప్పుడు సానుభూతే !
అమరావతి రైతుల్ని .. వాళ్లు రైతులు ఎందుకు అవుతారు ? అని వైసీపీ హయాంలో వ్యాఖ్యానించి .. వారిపై లాఠీ చార్జీ చేయడాన్ని, కొట్టడాన్ని, తిట్టడాన్ని సమర్థించిన జర్నలిస్టులు, ఇతర మేధావుల సంత అంతా ఇప్పుడు.. రైతుల మీద ప్రేమ ఒలకబోస్తున్నట్లుగా నటిస్తున్నారు. వారికి టీడీపీకి దగ్గరగా ఉండే ఓ జర్నలిస్టు చెబుతున్నాడు కాబట్టి .. ఇలాంటివి చాలా హాయిగా ఉంటాయి. ఒకప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారులని నిందించిన వారికి ఇప్పుడు రైతుల హోదా ఇచ్చి ముందుకు వచ్చి… వారి భుజాలపై నుంచి ప్రభుత్వంపై దాడులు చేస్తున్నారు.
ఆ వృద్ధురాలి సమస్య ఏమిటో పెద్ద వివరణ ఇచ్చిన ఫ్యాక్ట్ చెక్
కందుల రమేష్ వెల్లడించిన వృద్ధురాలి సమస్య ఏమిటో పూర్తిగా.. ఫ్యాక్ట్ చెక్ ద్వారా సీఆర్డీఏ వెల్లడించింది. ఆమె ల్యాండ్ పూలింగ్ లో ఇచ్చిన ఐదు సెంట్ల స్థలానికి రిటర్నబుల్ ప్లాట్ కావాలంటున్నారు. కానీ సీఆర్డీఏ నిబంధనల ప్రకారం కనీసం 12 సెంట్లు ఇచ్చిన వారికే రిటర్నబుల్ ప్లాట్ వస్తుంది. ఐదు సెంట్లు ఇచ్చిన వారికి టీడీఆర్ బాండ్లు ఇస్తారు. ఈ సమస్యను సీఆర్డీఏ అధికారులు ఎలా పరిష్కరించగలరు ?. కందుల రమేష్ అనే జర్నలిస్టు మొదటి సారి.. అమరావతి రైతులకు సమస్యలు అని సీరియల్ గా రాస్తున్నారు. కానీ అది ఇబ్బంది పెట్టడానికే అన్నట్లుగా ఉంటోంది.
టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తల గుడ్డి ప్రచారం !
గతంలో అమరావతి మీద ఎవరైనా నిందలు వేస్తే ఎదర్కొనే టీడీపీ సోషల్ మీడియా ఇప్పుడు మాత్రం.. అమరావతిలో రైతుల కష్టాలు అంటే నిజం ఉందా లేదా అని చూసుకోకుండా ట్రాప్ లో పడిపోతున్నారు. రైతుల వ్యక్తిగత సమస్యలు.. నిబంధనలకు విరుద్ధంగా చేయాలన్న వారి డిమాండ్లు కూడా సమస్యలు అయితే.. పరిష్కారానికి సీఆర్డీఏ ఏం చేస్తుంది ?. మిగతా విషయాల కన్నా.. మంత్రి నారాయణ, సీఆర్డీఏను నడిపిస్తున్న కన్నబాబుపైనే వీరికి ఎక్కువ వ్యతిరేకత ఉన్నట్లుగా ఉంది. ఏ సమస్యలూ లేకుండా ఏ ప్రాజెక్టూ ఉండదు. కానీ.. వీలైనంతగా పరిష్కారం చేసుకోవాలి. తప్పుడు ప్రచారాలు చేసి .. అమరావతి విరోధులకు ఆయుధాలిస్తే.. ఎవరికి నష్టం ..?
