సినిమా అనేది చాలా మంది ఓ వ్యసనం. తెలుగు వారికి ఇంకా ఎక్కువ. యువతలోనూ సినిమాలపై ఆసక్తి ఉంటుంది. అయితే మంచి వినోదం ఆస్వాదించడానికి ఈ సినిమా పిచ్చి రావడం లేదు… సోషల్ మీడియా వేదికగా సాగుతున్న ఫ్యాన్ వార్స్ చేసుకోవడానికి, కలెక్షన్ల లెక్కల పంచాయతీలు పెట్టుకోవడానికి సినిమాను చూస్తున్నారు. సినిమాను కేవలం వినోదంగా చూడటం మానేసి, దానిని ఒక వ్యక్తిగత యుద్ధంగా మార్చుకోవడం ప్రమాదకరంగా మారుతోంది.
ఎన్ని కలెక్షన్లు వచ్చినా హీరో, నిర్మాతలకే లాభం
సోషల్ మీడియాలో ఏ చిన్న హీరో సినిమా విడుదలైనా, కలెక్షన్ల పోస్టర్ల మీద పెద్ద ఎత్తున యుద్ధం మొదలవుతోంది. తమ అభిమాన హీరోకి వంద కోట్లు వచ్చాయంటే, కాదు కాదు రెండొందల కోట్లు వచ్చాయంటూ ఫేక్ డేటాతో పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు. ఈ కలెక్షన్ల వల్ల నిజంగా లాభపడేది సదరు హీరోలు, నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు మాత్రమే. సినిమా హిట్టయితే హీరో రెమ్యూనరేషన్ పెరుగుతుంది, నిర్మాత లాభాల బాట పడతాడు. కానీ, గొంతు చించుకుని సోషల్ మీడియాలో పోరాడే అభిమానికి, ఆ కలెక్షన్ల నుండి ఒక్క రూపాయి కూడా రాదు సదా, వారి వ్యక్తిగత జీవితానికి ఇది ఏ రకంగానూ ఉపయోగపడదు.
సినిమా అనేది వ్యాపారం.. !
సినిమా రంగం అనేది వేల కోట్ల రూపాయల వ్యాపారం. ఇక్కడ హీరోలు, దర్శకులు ఒక ప్రాజెక్ట్ తర్వాత మరో ప్రాజెక్ట్ చేసుకుంటూ తమ కెరీర్ను నిర్మించుకుంటారు. హీరోలందరూ ఎంతో స్నేహంగా మెలుగుతుంటే, బయట వారి అభిమానులు మాత్రం కుల, మత, ప్రాంతాల వారీగా చీలిపోయి బూతులు తిట్టుకోవడం అత్యంత దౌర్భాగ్యం. ఒక హీరోను ఇష్టపడటంలో తప్పు లేదు, కానీ ఆ ఇష్టం ఇతర హీరోలను ద్వేషించే స్థాయికి చేరడం మానసిక వైకల్యమే అవుతుంది. వినోదం కోసం కేటాయించాల్సిన సమయాన్ని, ఈ అర్థం లేని గొడవలకు కేటాయించడం వల్ల జీవితంలో అత్యంత కీలకమైన యువతరం సమయం వృధా అవుతోంది.
జీవితాలను నాశనం చేసుకోవడం ఫ్యానిజం కాదు!
యువత గుర్తించాల్సిన ప్రాథమిక సూత్రం ఒకటే జీవితం అనేది సినిమా కంటే చాలా పెద్దది. కెరీర్ నిర్మించుకోవాల్సిన వయసులో, కుటుంబ బాధ్యతలు స్వీకరించాల్సిన సమయంలో, సినిమా కలెక్షన్ల గురించి సోషల్ మీడియాలో పోరాటాలు చేయడం వల్ల భవిష్యత్తు అంధకారమవుతుంది. సినిమాను థియేటర్లో చూసి, ఆ వినోదాన్ని అక్కడితో వదిలేయాలి. రికార్డులు, కలెక్షన్ల వేటలో పడి వ్యక్తిత్వాలను దిగజార్చుకోవడం ఆపేయాలి. హీరోలు తమ పని తాము చేసుకుపోతున్నప్పుడు, అభిమానులు కూడా తమ జీవితాలను చక్కదిద్దుకోవడమే నిజమైన స్టార్డమ్ అనిపించుకుంటుంది.


