ఈ ప్రపంచంలో ఉన్న అన్ని వృత్తుల వాళ్ళకంటే కూడా సినిమా వాళ్ళకు ఆశలు, కోరికలు కాస్త ఎక్కువ ఉండేలాగా ఉన్నాయి. మొదట్లో చిన్న చిన్న అవకాశాల కోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఆ కష్టాలన్నీ కూడా సినేమా కష్టాల కంటే కూడా ఘోరంగా ఉంటాయి. చాలా భయానకంగా ఉంటుంది ఆ జీవితం. ఆ టైంలోనే ఎవరినో ఒకరిని పట్టుకుని చిన్నగా చిన్న చిన్న అవకాశాలు దొరకబుచ్చుకుంటారు. ఏ అవకాశాలూ లేనప్పుడే పిచ్చ డ్రీమ్స్‌లో బ్రతికే జీవులు కదా. ఒక్కసారి అవకాశం రాగానే ఇక ఆకాశానికి నిచ్చెన వేయడం స్టార్ట్ చేస్తారు. మొదట్లో స్టార్ హీరో, స్టార్ డైరెక్టర్ అయిపోయినట్టు కలలు కంటారు. సినిమాల నుంచి రిటైరయ్యే టైం వచ్చిందంటే మాత్రం ఇక మనవాళ్ళ ఆశలన్నీ పాలిటిక్స్ చుట్టూ తిరుగుతూ ఉంటాయి.
చదువు, అర్హతల్లాంటివి ఏవీ లేకపోయినా ఎవడైనా….ఏ స్థాయికైనా ఎదిగే అవకాశం ఉండేది సినిమా, రాజకీయ రంగాల్లోనే అని గట్టి నమ్మకం కాబోలు. అందుకే సినిమా ఫీల్డ్ నుంచి డైరెక్టుగా రాజకీయాల్లోకి దూకేయాలని తెగ ఉబలాటపడిపోతూ ఉంటారు. అభిమాన గణం బాగా ఉన్నవాళ్ళు సొంత పార్టీ పెట్టుకుని ముఖ్యమంత్రి కుర్సీకి టెండర్ వేద్దామని ప్లాన్ చేసుకుంటారు. అభిమాన గణం కాస్త తక్కువ ఉన్నవాళ్ళు మాత్రం ఆయా పార్టీల్లో జాయిన్ అయిపోయి ఏ ఎమ్మెల్యేనో, ఎంపినో అయిపోదామని ఆశ పడతారు. ఇప్పుడు రిటైర్మెంట్ వయసుకి దగ్గర పడ్డ త్రిషకు కూడా అర్జెంట్‌గా సిఎం కుర్సీ ఎక్కేయాలని మహా ఉబలాటంగా ఉందట. అదేంటంటే తమిళనాడు ముఖ్యమంత్రి చదివుకున్న స్కూల్లోనే నేనూ చదువుకున్నానని ఓ లాజిక్ బయటకు తీస్తోంది. నంబర్ ఒన్ హీరో స్థాయిలో ఉన్నవాళ్ళ నుంచీ అలీ, హేమ, త్రిషలాంటి వాళ్ళందరూ రాజకీయాలనే టార్గెట్ చేస్తుంటే ఏం మాట్లాడాలో కూడా తెలియడం లేదు. బహుశా సినిమా సెలబ్రిటీలుగా ఉండే స్టేటస్‌తో…‘డబ్బులు పోనాయి…మేమేటి సేత్తాం……’అనేలాంటి కొంతమంది రాజకీయ నాయకులతో ఉన్న పరిచయాల కొద్దీ, వాళ్ళను దగ్గరగా చూసిన అనుభవంతో………‘ఓసోస్…రాజకీయం అంటే ఇంతేనేటి… ఈ మాత్రం రాజకీయం మేమూ సేసేయగలం’ అన్న డెసిషన్కి వచ్చేస్తున్నట్టున్నారు. లేకపోతే ఆ మధ్య ఒక స్టార్ హీరోగారు చెప్పినట్టు…..సెంటిమెంటల్ ఫూల్స్ అయిన ప్రజలు సినిమా వాళ్ళను చూడగానే ఓట్లు గుద్దేస్తారన్న గట్టి నమ్మకం కూడా ఎట్టేసుకుంటున్నట్టున్నారు. అయినా తప్పంతా మన రాజకీయనాయకులదే. వాళ్ళు చేసే రాజకీయాలు సూస్తా ఉంటే సెడ్డీ ఏసుకోవడం రాని బుడ్డోడి దగ్గర నుంచీ సినిమావాళ్ళ వరకూ అందరికీ రాజకీయాలంటే మా సెడ్డ సిన్న సూపు ఏర్పడిపోతా ఉన్లే.
గమనికః ఏదో ఒక ఆశయంతో, గొప్ప ఆలోచనలతో సినిమా, రాజకీయ రంగాల్లో రాణిస్తున్నవారికి మాత్రం ఈ విమర్శ వర్తించదు.