మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్లు ఇప్పటికే అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్న తెలుగు చిత్ర పరిశ్రమకు ఇప్పుడు సమ్మె సెగ కూడా తాకింది. వేతనాల పెంపు డిమాండ్ చేస్తూ సినీ కార్మికులు సమ్మెకి దిగారు. అటు కార్మికులు, ఇటు నిర్మాతలు పట్టు వీడటం లేదు. సమ్మె ఎంతకాలం కొనసాగుతుందో క్లారిటీ లేదు. మిగతా సినిమాల సంగతి పక్కన పెట్టి విడుదలకు సిద్ధమవుతున్న పలు సినిమాలపై ఈ సమ్మె ప్రభావం తప్పకుండా ఉంటుంది.
ప్రభాస్ రాజాసాబ్, రామ్‌చరణ్ పెద్ది, బాలకృష్ణ అఖండ 2, చిరు–అనిల్ సినిమా, నాని ప్యారడైజ్, రవితేజ–కిశోర్ తిరుమల సినిమా, సాయి తేజ్ సంబరాల ఏటిగట్టు, అడివి శేష్ డకాయిట్… ఇలా చాలా చిత్రాలపై ఈ సమ్మె ప్రభావం వందశాతం ఉంటుంది. ఇవన్నీ కూడా ఒక డేట్‌ని లాక్ చేసుకొని ఆ డేట్‌కి రీచ్ కావడానికి చాలా పక్కాగా పని చేస్తున్న సినిమాలు. ఇలాంటి సినిమాలకు సమ్మె రూపంలో స్పీడ్ బ్రేకర్ ఎదురు కావడం నిర్మాతలను కలవరపెడుతోంది.
షెడ్యూల్ ప్రకారం షూటింగులు జరక్కపోతే నటీనటుల డేట్స్ మారిపోతాయి. డేట్స్ రీ-అడ్జస్ట్ చేయడం, కొత్త షెడ్యూల్ సెట్ చేయడం పెద్ద తలనొప్పి. ఈ రోజుల్లో క్వాలిటీ ముఖ్యం. సమ్మె కారణంగా ఉన్న సమయం వృథా అవుతుంది. అనుకున్న సమయంలో షూటింగ్ పూర్తి చేయడమే పెద్ద టాస్క్. అలాంటిది ఇప్పుడు షూటింగులే లేకుండా పోయాయి. ముందుగా షూటింగ్ ఫినిష్ చేస్తే ఏవైనా తేడాలు వచ్చినా మళ్లీ రీషూట్లు చేసుకోవచ్చు. పోస్ట్ ప్రొడక్షన్‌ని కావల్సినంత సమయం కేటాయించుకోవొచ్చు. కానీ ఇప్పుడు ఆ సౌలభ్యం ఉండదు.
ఈ బంద్ అన్నీరకాల ఇబ్బందే. వీలైనంత త్వరగా నిర్మాతలు, ఫెడరేషన్ ప్రతినిధులు ఒకరి ఇబ్బందులను మరొకరు అర్థం చేసుకొని ఓ పరిష్కారానికి వచ్చి సమ్మెకు ముగింపు పలికితే పరిశ్రమకు మంచిది.