కరోనా కొత్త వేరియంట్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. భారత్ లో కోవిడ్ కొత్త వేరియంట్లు NB .1.8.1 , LF.7లను ఇండియన్ సార్స్ – కొవ్ 2 జోనోమిక్స్ కన్సార్టియం గుర్తించినట్లు వెల్లడించింది. ఈ NB .1.8.1 కేసులు ఏప్రిల్ లోనే నమోదు కాగా… LF.7 వేరియంట్ కేసులను మేలో గుర్తించారు. ఈ కొత్త వేరియంట్ లతో భయపడాల్సిన పని లేదని వైద్య వర్గాలు చెబుతున్నా పెరుగుతోన్న కేసులు ప్రజల్లో ఆందోళన రేకెత్తిస్తున్నాయి.
ఇప్పటికే దేశంలో కరోనా కేసులు రోజూవారీగా పెరుగుతుండటంతో మునుపటి పరిస్థితులను రానున్నాయా? అని జనం భయపడుతున్నారు. ఈ సమయంలోనే ఢిల్లీలో ఒకే రోజులో 23కేసులు పెరగడం, బెంగళూరులో కేసులు పెరుగుతుండటం, గతంలోలాగే కేరళలో కేసులు రయ్ మని రెట్టింపు అవుతున్న వేళ కోవిడ్ మరణం చోటు చేసుకోవడం ఆందోళన పుట్టిస్తోంది.
శనివారం బెంగళూరులో మొదటి కరోనా మరణం నమోదు అయిందని కర్ణాటక ఆరోగ్య శాఖ అధికారికంగా ప్రకటించింది. ఇప్పటివరకు కర్ణాటకలో 46కేసులు నమోదు అవ్వగా.. అందులో 32కేసులు బెంగళూరులోనే నమోదు అయినట్లు వెల్లడించింది. మాస్క్ లను ధరించాలని సూచించింది.
ఇటీవలే తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. ప్రధాన ఆసుపత్రులను అప్రమత్తం చేశాయి. అయితే, ఈ కొత్త వేరియంట్ కేసుల తీవ్రత నామమాత్రంగానే ఉంటుందని, భయపడవద్దని స్పష్టం చేశాయి. ధైర్యమే కరోనాకు మెడిసిన్ అని వెల్లడించాయి