2026లో అప్పుడే మూడు నెలలు గడిచిపోయాయి. మొన్ననే సంక్రాంతి సినిమాల గురించి మాట్లాడుకొన్న ఫీలింగ్. ఇంతలోనే సమ్మర్ సీజన్‌కి టాలీవుడ్ రెడీ అయిపోయింది. జనవరి, ఫిబ్రవరి, మార్చి ఫలితాల్ని చూసుకొంటే – పెద్దగా ఆశాజనకంగా కనిపించడం లేదు. జనవరిలో సంక్రాంతి సినిమాల హడావుడి మినహాయిస్తే ఈ క్వార్టర్లీలో టాలీవుడ్ అంతగా సాధించిందేం లేదు. ఫిబ్రవరి, మార్చిలో తగిలిన గట్టి షాక్ లతో కాస్త ఇబ్బందులకే గురైంది.
జనవరిలో దాదాపు 20 సినిమాల వరకూ టాలీవుడ్ ని పలకరించాయి. అందులో సంక్రాంతి సినిమాలపైనే ఫోకస్. ‘రాజాసాబ్’ తో పొంగల్ హడావుడి మొదలైంది. ప్రభాస్ – మారుతి కాంబోలో వచ్చిన ఆ సినిమా బాక్సాఫీసు ముందు ఏమాత్రం నిలబడలేకపోయింది. వీఎఫ్ఎక్స్ తో మారుతి చేయాలనుకొన్న మ్యాజిక్ జనాలకు రీచ్ కాలేదు. ప్రభాస్ కటౌట్ కీ, స్టామినాకూ సంబంధం లేని కథ, కథనాలతో మారుతి రిస్క్ చేశాడన్న కామెంట్లు గట్టిగా వినిపించాయి. ఈ ఫ్లాప్ ప్రభావం మారుతిపై ఎక్కవగా పడింది. ‘ఈ సినిమా నచ్చకపోతే మా ఇంటికి రండి’ అని మారుతి తన అడ్రస్స్ కూడా చెప్పడం, మారుతి ఇంటికి జొమాటో, స్విగ్గీల పార్శిల్స్ పంపి, అభిమానులు తమ నిరసన వ్యక్తం చేయడం చర్చనీయాంశం అయ్యాయి. ఆ తరవాత నిడివి తగ్గించినా, కొత్త యాక్షన్ సీన్ జోడించినా ఫలితం లేకుండా పోయింది.
సంక్రాంతి సీజన్లో వచ్చిన మెరుపు.. ‘మన శంకర వర ప్రసాద్ గారు’. దాదాపు 300 కోట్లతో ఈ సినిమా రికార్డులు సృష్టించింది. మెగాస్టార్ కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. అనిల్ మార్క్ వినోదం, చిరు స్టార్ డమ్, చివర్లో వెంకీ ఎంట్రీ ఇవన్నీ సినిమాకు కలిసొచ్చాయి. హిట్ మిషన్ గా పేరు తెచ్చుకొన్న అనిల్ రావిపూడి.. తన విజయయాత్రని ఈ సినిమాతోనూ కొనసాగించగలిగారు. ఇదే సీజన్లో విడుదలైన `అనగనగా ఒకరాజు` సూపర్ హిట్ సినిమాగా నిలిచింది. చక్కటి ఎంటర్టైనర్ తో మలిచిన ఈ సినిమాకు సంక్రాంతి సీజన్ కూడా బాగా కలిసొచ్చింది. చాలా కాలం తరవాత శర్వా కూడా ఓ హిట్ అందుకోగలిగాడు. ‘నారీ నారీ నడుము మురారి’ ఫ్యామిలీ బొమ్మగా నిలిచింది. రవితేజకు ఈసారి కూడా నిరాశ తప్పలేదు. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ టార్గెట్ ని రీచ్ కాలేకపోయింది. అలా సంక్రాంతి సీజన్లో మిక్డ్స్ రిజల్ట్ దక్కించుకొంది టాలీవుడ్.
ఫిబ్రవరిలో టాలీవుడ్ కి విజయమే దక్కకుండా పోయింది. గుణశేఖర్ ‘యుఫోరియా’ ప్రేక్షకుల్ని థియేటర్లకు తీసుకురావడంలో విఫలం అయ్యింది. విశ్వక్ సేక్ – అనుదీప్ చేసిన ‘ఫంకీ’ పత్తా లేకుండా పోయింది. అసలు ఈ సినిమాకు ఓపెనింగ్సే రాలేదు. ‘హే బలవంత్’, ‘విష్ణు విన్యాసం’ చిత్రాలూ నిరాశ పరిచాయి. ‘కపుల్ ఫ్రెండ్లీ’ కి మంచి టాక్ వచ్చినా, వసూళ్ల పరంగా మెప్పించలేదు. కాకపోతే… సంతోష్ శోభన్ కు మంచి సినిమా చేశామన్న తృప్తి మిగిలింది.
మార్చిలో అందరి కళ్లూ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పైనే ఉన్నాయి. ‘ఓజీ’ తరవాత పవన్ కల్యాణ్ చేసిన సినిమా ఇది. హరీష్ శంకర్ ‘గబ్బర్ సింగ్’ మ్యాజిక్ మళ్లీ రిపీట్ అవుతుందని భావించారు. కానీ.. ఈసారి నిరాశే మిగిలింది. ఫ్యాన్స్‌కి ‘జస్ట్ ఓకే’ అనిపించిన సినిమా ఇది. సాధారణ ప్రేక్షకులకు ఏమాత్రం నచ్చలేదు. మార్చిలో విడుదలైన ‘మృత్యుంజయ్’, ‘సంప్రదాయినీ సుప్పినీ సుద్దపూసనీ’, ‘బ్యాండ్ మేళం’ లాంటి సినిమాల వైపు ప్రేక్షకులు కాస్త కూడా దృష్టి సారించలేకపోయారు. అయితే డబ్బింగ్ సినిమా ‘దురంధర్ 2’ మాత్రం ఎఫెక్ట్ చూపించింది. ఈ సినిమాకు తెలుగు నాట కూడా మంచి వసూళ్లే దక్కాయి. మార్చిలో.. థియేటర్ ఆక్యుపెన్సీ కాస్తో కూస్తో ఉండడానికి కారణం ‘దురంధర్ 2’నే. హిందీ వెర్షన్‌కు మల్టీప్లెక్స్ లో జనాలు పోటెత్తుతున్నారు. ఈవీకెండ్ కూడా ‘దురంధర్ 2’ దే హవా.
మూడు నెలలలో సంక్రాంతి సినిమాలు మినహాయించి చూస్తే – టాలీవుడ్ కు సరైన హిట్ పడలేదనే చెప్పాలి. ఓరకంగా టాలీవుడ్ కాస్త క్లిష్టపరిస్థితిలో ఉంది. వేసవి సినిమాలతో కాస్త కోలుకొంటుందన్న ఆశ మాత్రం ఉంది. ‘పెద్ది’, ‘డెకాయిట్’, ‘బైకర్’, ‘స్వయంభూ’ లాంటి సినిమాలు ఈ వేసవిలో టాలీవుడ్ ని గట్టెక్కించాలి. లేదంటే… సినిమా మరింత సంక్షోభంలో పడే ప్రమాదం ఉంది.