నవ్యాంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక అపూర్వ ఘట్టం ఆవిష్కృతమవుతోంది. రాష్ట్ర విభజన అనంతరం పదేళ్ల నిరీక్షణకు తెరదించుతూ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తొలిసారిగా రాజధాని అమరావతి వేదికగా గణతంత్ర దినోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహిస్తోంది. తుళ్లూరు మండల పరిధిలోని రాయపూడి వద్ద ఏర్పాటు చేసిన పరేడ్ గ్రౌండ్స్ ఇందుకు వేదికయ్యాయి. గవర్నర్ గారు జాతీయ జెండాను ఆవిష్కరించి, సాయుధ దళాల గౌరవ వందనం స్వీకరించేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
గత పాలకుల హయాంలో రాజధాని మార్పుల వల్ల విజయవాడ లేదా విశాఖపట్నానికే పరిమితమైన ఈ వేడుకలు, నేడు రాజధానిలో జరగడం అమరావతి పునర్వైభవానికి సూచికగా నిలుస్తోంది. ఈ వేడుకల్లో అత్యంత ఆకర్షణీయమైన , ఉద్వేగభరితమైన అంశం అమరావతి రైతులకు ప్రత్యేకాహ్వానం పలకడం. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను త్యాగం చేసి, ఐదేళ్లుగా మొక్కవోని దీక్షతో పోరాడిన వేలాది మంది రైతులు , మహిళలను ప్రభుత్వం గౌరవపూర్వకంగా ఈ వేడుకలకు ఆహ్వానించింది.
వారి కోసం గ్యాలరీల్లో ప్రత్యేక సీటింగ్ ఏర్పాటు చేయడమే కాకుండా, రాజధాని ఆకాంక్షను ప్రతిబింబించేలా ప్రత్యేక ప్రదర్శనలను కూడా సిద్ధం చేశారు. ఇది కేవలం ప్రభుత్వ వేడుక మాత్రమే కాదు, భూములిచ్చిన రైతుల ఆత్మగౌరవ సభ అని ప్రజాప్రతినిధులు పేర్కొంటున్నారు. అమరావతి పరేడ్ గ్రౌండ్స్ సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. వివిధ ప్రభుత్వ శాఖల అభివృద్ధిని చాటిచెప్పేలా శకటాల ప్రదర్శన , విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.


