భారత రాష్ట్ర సమితి నుంచి బీజేపీలో చేరడానికి ఐదుగురు ఎమ్మెల్యేలు తనతో టచ్ లో ఉన్నారని .. బీజేపీ తెలంగాణ కొత్త అధ్యక్షుడు రామచంద్రరావు ప్రకటించుకున్నారు. ఇప్పటికి ఐదుగురే కానీ.. ఈ లెక్క ఇంతటితో ఆగదని కూడా హింట్ ఇచ్చారు. గువ్వల బాలరాజు పదో తేదీన బీజేపీలో చేరాలనుకుంటున్నారు. ఆయనతో ప్రారంభించి ఇక వరుసగా చేరికలు ఉంటాయన్న మైండ్ గేమ్ ను రామచంద్రరావు ప్రారంభించారని అనుకోవచ్చు.
బీఆర్ఎస్ నాయకత్వంపై ఆ పార్టీ నేతల్లో నమ్మకం పోయిందని రామచంద్రరావు అంటున్నారు.
విలీనం పేరుతో జరుగుతున్న ప్రచారంతో బీఆర్ఎస్ నేతలు గందరగోళంలో ఉన్నారు. ఎంత జరుగుతున్న బీజేపీని పల్లెత్తు మాట అనలేకపోతున్నారు. తెలంగాణ ఉన్నంత కాలం బీఆర్ఎస్ ఉంటుందన్న డైలాగ్ ఒక్కటే కేటీఆర్ చెబుతున్నారు. బీజేపీతో చర్చలు జరగలేదని మాత్రం చెప్పడం లేదు. విలీనం చేసేదాకా ఆగడం ఎందుకని కొంత మంది బీజేపీ లో ఇప్పుడే చేరిపోతే పోలా అనుకుంటున్నారు. రాను రాను బీఆర్ఎస్ పరిస్థితి అత్యంత గడ్డుగా మారుతోందన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ క్యాడర్ ను తమ పార్టీలోకి లాగడం బీజేపీకి పెద్ద పని కాదు.
బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ చాలా వరకూ బీజేపీ గూటికి చేరుతోంది. పార్లమెంట్ ఎన్నికల్లో ఆ విషయం స్పష్టమయింది. ఇప్పుడు లీడర్లను లాక్కునేందుకు ప్రయత్నిస్తోంది. బీఆర్ఎస్ మరింత బలహీనపడుతుంది. ఇటీవల తీన్మార్ మల్లన్న త్వరలో బీఆర్ఎస్ ఎల్పీ… బీజేపీలో విలీనం అవుతుందని జోస్యం చెప్పారు. రామచంద్రరావు మైండ్ గేమ్ వర్కవుట్ అయితే అది జరిగినా ఆశ్చర్యం లేదన్న వాదన వినిపిస్తోంది.