2015లో దేశాన్ని కుదిపేసిన మాజీ మేయర్ దంపతుల హత్య కేసుపై చిత్తూరు కోర్టులో సంచలన తీర్పు వెలువరించింది. చిత్తూరు 9వ అదనపు సెషన్స్ జడ్జి శ్రీనివాస్ రావు ఈ రోజు ప్రధాన నిందితులకు ఉరిశిక్ష విధించారు. 2015లో చిత్తూరు మునిసిపల్ కార్పొరేషన్ మేయర్గా ఉన్న కటారి అనురాధను, ఆమె భర్త కటారి మోహన్ ను మేయర్ చాంబర్లోనే నిందితులు తుపాకీ కాల్పులు జరిపి , కత్తులతో దారుణంగా హతమార్చారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది.
ప్రధాన నిందితుడు చింటూ అలియాస్ చంద్రశేఖర్ చిత్తూరు మేయర్ దంపతుల మేనల్లుడే. అతనికి ఉరిశిక్ష పడింది. వెంకటాచలపతి, జయప్రకాశ్ రెడ్డి, మంజునాథ్, వెంకటేశ్ లకు ఉరిశిక్ష విధించారు. 2015 నవంబర్ లో ఈ హత్య జరిగింది. మొత్తం 23 మంది నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. 130 మంది సాక్షులను విచారించి 352 వాయిదాల తర్వాత తీర్పు వచ్చింది. A3, A4 అరెస్టు నుంచి జైలులోనే ఉన్నారు. 2015 నుంచి సాగిన విచారణల సమయంలో ఇద్దరు నిందితులు చనిపోయారు.
చింటూ అలియాస్ చంద్రశేఖర్ ను కటారి మోహన్, అనూరాధ దంపతులే పెంచి పోషించారు. అయితే ఆర్థికపరమైన విషయాల్లో తేడాలు రావడంతో వారిని దారుణంగా చంపాలని ప్లాన్ చేసుకున్నారు. కార్యాలయంలోనే చంపేశారు. ఈ ఘటన చిత్తూరు రాజకీయాల్లో మాయని మచ్చగా మిగిలింది.
 
                                                 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
                                               
                                               
                                               
                                               
                                               
                                                   
                                                   
                                                   
                 
                 
                 
                 
                