ఏపీ మాజీ ఎక్సైజ్ మంత్రి నారాయణ స్వామిని ఆరు గంటల పాటు సిట్ అధికారులు ప్రశ్నించారు. విచారణకు ఎన్ని సార్లు పిలిచినా అనారోగ్యం పేరుతో వచ్చేందుకు నిరాకరించడంతో సిట్ అధికారులే పుత్తూరులోని ఆయన ఇంటికి వెళ్లారు. దాంతో ఆయనను అరెస్టు చేసి విజయవాడ తరలిస్తారన్న ప్రచారంజరిగింది. అయితే ఇంట్లో జరిగిన విచారణలో ఆయన పూర్తిగా సహకరించి అన్ని వివరాలు చెప్పడమే కాదు..తన వద్ద ఉన్న కొన్ని రికార్డులను కూడా సిట్ అధికారులకు అప్పగించారు.
సిట్ అధికారులుక పూర్తిగా సహకరించానని భవిష్యత్ లో కూడా పూర్తిగా సహకరిస్తానని ఆయన ప్రకటించారు. అంతకు ముందుకు నారాయణ స్వామి కుమార్తె కృపాలక్ష్మి కూడా మీడియాతో మాట్లాడారు. ఇది సాధారణ విచారణేనని అరెస్టు చేసేదేమీ ఉండదని చెప్పారు. సిట్ అధికారులు అరెస్టు చేయకపోవడంతో నారాయణ స్వామి కుటుంబసభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.
మంత్రిగా ఉన్నప్పటికీ నారాయణ స్వామికి ఏ నిర్ణయంలోనూ భాగస్వామ్యం ఉండేది కాదు. దళితునికి డిప్యూటీ సీఎం ఇచ్చాం.. కీలకమైన శాఖ ఇచ్చాం అని చెప్పుకోవడానికే తప్ప.. కనీసం ఎక్సైజ్ కానిస్టేబుల్ కూడా ఆయన మాట వినేలా పవర్స్ ఇవ్వలేదు. దాంతో పిలిచినప్పుడు వెళ్లి సంతకాలు పెట్టడానికే పరిమితమయ్యారు. ఎక్కువగా సచివాలయానికి కూడా వెళ్లేవారు కాదు. అదే ఇప్పుడు ఆయనకు ప్లస్ పాయింట్ అయినట్లుగా ఉంది. అరెస్టు నుంచి తప్పించుకున్నారు.