ఆంధ్ర విశ్వవిద్యాలయం మాజీ వీసీ ప్రసాదరెడ్డికి హైకోర్టు నెల రోజుల శిక్ష విధించింది. ఉత్తర్వులు వెలువడిన తర్వాతనే ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కోర్టు ఉత్తర్వులాలను ధిక్కరించినందుకు నెలరోజుల సాధారణ జైలు శిక్షకు రూ. 2,000 జరిమానా విధించింది. వైసీపీ హయాంలో ఏయూని వైసీపీ ఆఫీసుగా చేసేశారు ప్రసాదరెడ్డి, నిబంధనలకు విరుద్ధంగా అడ్డగోలుగా వీసీగా వచ్చిన ఆయన 2019-2024 మధ్య సమయంలో చేయకూడదని పనులన్నీ చేశారు. హైకోర్టు ఆదేశాలను పాటించలేదు.
ఏయూ సైన్స్ కళాశాల బోటనీ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పని చేసే నూకన్న దొరను ప్రసాదరెడ్డి వీసీ అవగానే తొలగించారు. 17 సంవత్సరాల పాటు కాంట్రాక్ట్ ప్రొఫెసర్గా ఆయన పని చేస్తూ వచ్చారు. ప్రసాదరెడ్డి నిర్ణయాన్ని సవాల్ చేస్తూ నూకన్న 2023లో హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. విచారణలో న్యాయమూర్తి నూకన్నను అసిస్టెంట్ ప్రొఫెసర్గా కొనసాగించాలని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. కానీ, ఈ ఆదేశాలు అమలు కాకపోవడంతో నూకన్న ప్రసాదరెడ్డిపై కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ విచారణలో ప్రసాదరెడ్డి తరఫు వాదనలు, ఆయన చర్యలు పరిశీలించిన న్యాయమూర్తి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
కోర్టు ఉత్తర్వులాలకు తక్కువ ప్రాధాన్యత ఇచ్చి, వీసీ బాధ్యతల నుంచి తప్పుకునే వరకు అమలు చేయలేదు. ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిందని నిర్ధారించారు. కోర్టు ఉత్తర్వులను యథాతథంగా అమలు చేయడం అధికారుల విధి. వాటికి వక్రభాష్యాలు చెప్పడానికి వీల్లేదు. కోర్టు ఆదేశాలు చట్టవిరుద్ధంగా ఉంటే అప్పీల్ చేయవచ్చు, కానీ తప్పుడు అర్థాలు చెప్పకూడదని స్పష్టం చేశారు. ఇలాంటి వ్యవహారాలు చట్టబద్ధ పాలనకు తీవ్ర అడ్డంకిగా మారతాయి. ప్రసాదరెడ్డి వంటి వ్యక్తులపై కనికరం చూపితే, న్యాయవ్యవస్థకు నష్టం వాటిల్లుతుందని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు.
ప్రసాదరెడ్డి తీర్పును సవాల్ చేసుకునే అవకాశం కల్పించింది. ఈనెల 22 వరకూ గడువు ఇచ్చింది. అప్పీల్ చేసినా స్టే రాకపోతే 22న సాయంత్రం 5 గంటలలోపు హైకోర్టు రిజిస్ట్రార్ వద్ద లొంగిపోవాలని ఆదేశించారు.