రఘురామను కస్టోడియల్ టార్చర్ కు గురి చేసిన కేసులో విచారణకు హాజరయ్యేందుకు మాజీ సీఐడీ చీఫ్,సీనియర్ ఐపీఎస్ పీవీ సునీల్ కుమార్ నాన్చుతున్నారు. నాలుగో విచారణకు హాజరు కావాలని ఆయనకు రెండు వారాల ముందు నోటీసులు ఇస్తే.. తీరిగ్గా విచారణ రోజు..తనకు మరో పదిహేను రోజుల సమయం కావాలని లేఖ పంపారు. తాజాగా సిట్ అధికారులు పదిహేనో తేదీన రావాలని మరోసారి నోటీసులు జారీ చేశారు. సీనియర్ ఐపీఎస్‌గా ఉన్న ఆయన తాను నిందితుడిగా ఉన్న కేసులో విచారణకు రావడానికి మొండికేస్తున్నారు.
రఘురామపై కస్టోడియల్ టార్చర్ కేసులో ఆయన ఏ 1గా ఉన్నారు. ఆయనపై ఉన్న అనేకానేక ఆరోపణల్లో అది ఒకటి మాత్రమే. ఈ కేసు విచారణ సిట్ నెమ్మదిగా జరుపుతోంది. గతంలో ఆయన సన్నిహితులుగా పేరు పడిన వారిని అరెస్టు చేశారు. వారు జైలుకెళ్లారు.కానీ ఏ వన్ నిందితుడిగా ఉన్న పీవీ సునీల్ మాత్రం ఇంకా విచారణకు రావడం లేదు. ఆయన స్వయంగా రఘురామను హింసించడంతో పాటు ఆ హింసను లైవ్ లో ఇతరులకు చూపించారన్న ఆరోపణలు ఉన్నాయి.
కొత్త ప్రభుత్వం వచ్చిన తరవాత ఆయనకు పోస్టింగ్ లేదు. సస్పెన్షన్ లో ఉన్నారు. నిబంధనలకు విరుద్ధంగా విదేశీ పర్యటనలు చేసినట్లుగా గుర్తించారు. సస్పెన్షన్ లో ఉన్న ఆయన రాజకీయాలు చేస్తూ తన మత సంస్థను నడుపుతున్నారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆయనను సర్వీస్ నుంచి తొలగించాలన్న డిమాండ్ ఎక్కువగా వినిపిస్తోంది. పదిహేనే తేదీన ఆయన విచారణకు రాకపోతే.. పోలీసులు కఠిన చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి.
