వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఉద్యోగుల ప్రయోజనాలను వైసీపీకి తాకట్టు పెట్టిన ఉద్యోగ సంఘం నేతలు ఏ మాత్రం సిగ్గుపడకుండా జగన్ రెడ్డి సమక్షంలో కండువా కప్పించుకున్నారు. బండి శ్రీనివాసరావు అనే ఎపీఎన్జీవో అధ్యక్షుడితో పాటు ఇతరులు వైసీపీలో అధికారికంగా చేరిపోయారు. ఈ పెద్ద మనిషి జగన్ రెడ్డి ఉద్యోగుల ప్రయోజనాలను ఎలా నిర్వీర్యం చేసినా పట్టించుకోలేదు. పైగా పొగిడారు. ఎందుకంటే.. పొగిడితేనే ఏదైనా విదిలిస్తారని చెప్పుకొచ్చారు.
పీఆర్సీ ఇవ్వకపోయినాజీతాలు తగ్గించినా.. టీచర్లు ఉద్యమించి ప్రభుత్వంపై తిరుగుబాటు చేసినా చివరికి అన్నింటిని నిర్వీర్యం చేయడంలోనూ ఈ బండి శ్రీనివాసరావుతో పాటు ఇతరులదీ కీలకపాత్ర. కొంత మంది ఇప్పటికీ ఉద్యోగ సంఘాల్లో ఉన్నారు. అనధికారికంగా వైసీపీకి పని చేస్తున్నారు. రిటైరైన వారు అధికారికంగా వైసీపీలో చేరిపోయారు. ఇప్పుడు ప్రభుత్వాన్ని వీరు ఉద్యోగులకు సంబంధించి ఒక్క డిమాండ్ ను కూడా ధైర్యంగా చేయలేని పరిస్థితి ఉంది.
గత ప్రభుత్వానికి అమ్ముడవడం వల్ల వీరు ఉద్యోగుల హక్కులను కాలరాశారు. తాము వ్యక్తిగత ప్రయోజనాలను పొందారు. ఇప్పుడు రాజకీయ ప్రయోజనాలను చూసుకుంటున్నారు. ఉద్యోగులకు వీరు చేసినంత అన్యాయం ఎవరూ చేయరేమో. భవిష్యత్ లో ఉద్యోగుల హక్కుల కోసం పోరాడే అవకాశాన్ని కూడా వీరు తాకట్టు పెట్టేశారు. ఇప్పుడు జగన్ తో కలిసి రాజకీయం చేస్తున్నారు.