మాజీ మంత్రి విడదల రజనీ మంత్రిగా ఉన్నప్పుడు ఉద్యోగులు ఇప్పిస్తామని ఆమె పీఏలు, అనుచరులు ప్రకాశం జిల్లాలోని దోర్నాల యువకుల నుంచి ఐదు కోట్లు వసూలు చేసిన అంశం పల్నాడు ఎస్పీ వద్దకు చేరింది. యువకులంతా.. తాము డబ్బులు కట్టిన వివరాలతో సహా వచ్చి ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ ఫిర్యాదును పరిశీలిస్తున్నారు. ప్రాథమిక ఆధారాలు ఉంటే కేసు నమోదు చేసి విడదల రజనీ అనుచరుల్ని అదుపులోకి తీసుకోనున్నారు.
మంత్రికి తెలియకుండా పీఏలు, అనుచరులు కోట్లలో వసూళ్లు చేయడం అనేది అసాధ్యమైన విషయం. ఎందుకంటే వసూళ్ల విషయంలో విడదల రజనీపై ఎన్ని ఆరోపణలు ఉన్నాయో లెక్కే లేదు. అధికారం పోయిన వెంటనే వెల్లువలా వచ్చిన కేసుల ధాటికి కొన్ని చోట్ల డబ్బులు వెనక్కి ఇచ్చారు. ఓ క్రషర్ యజమానిని పోలీసుల్ని పెట్టి బెదిరించి డబ్బులు వసూలు చేసిన ఘటనలో కోర్టు సైతం కేసునమోదు చేయాలని ఆదేశించింది. ఇంకా చాలా మంది ఆరోపణలు చేశారు.
అయితే ప్రభుత్వం మాత్రం కేసులు, విచారణల వరకూ వెళ్తోంది కానీ అరెస్టు వరకూ వెళ్లలేదు. విడదల రజనీ అనుచరుల్ని పట్టుకుని మొత్తం గుట్టు బయటకు లాగితే.. ఐదేళ్ల పాటు ఆమె చేసిన దందాలు, వసూళ్ల గురించి మొత్తం బయటకు వస్తుందన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఇప్పుడు పోలీసులకు ఆ అవకాశం లభిస్తోంది.
