నేపాల్ రాజకీయాల్లో ఒక సంచలనం చోటుచేసుకుంది. దశాబ్దాలుగా దేశాన్ని ఏలుతున్న సంప్రదాయ రాజకీయ పార్టీలకు షాక్ ఇస్తూ, మాజీ ర్యాప్ సింగర్ , ఖాట్మండు మాజీ మేయర్ బాలేంద్ర షా ప్రధాని పీఠం వైపు దూసుకెళ్తున్నారు. మార్చి 5 న జరిగిన సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపులో ఆయన నేతృత్వంలోని రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ ప్రభంజనం సృష్టిస్తోంది. 275 స్థానాలున్న నేపాల్ పార్లమెంటులో మెజారిటీకి కావాల్సిన 138 సీట్ల దిశగా RSP దూసుకుపోతుండటంతో, 35 ఏళ్ల బాలేంద్ర షా నేపాల్ చరిత్రలోనే అతి పిన్న వయస్కుడైన ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు.
గతేడాది నేపాల్‌ను ఊపేసిన జెన్ జీ విప్లవం ఈ మార్పుకు ప్రధాన కారణం. అవినీతి, పాతతరం నాయకుల మొండి వైఖరిపై విసిగిపోయిన యువత, విద్యార్థులు రోడ్లపైకి వచ్చి అప్పటి ప్రధాని కేపీ శర్మ ఓలి ప్రభుత్వాన్ని గద్దె దించారు. ఆ పోరాట స్ఫూర్తితోనే, మేయర్ పదవికి రాజీనామా చేసి ఎన్నికల బరిలోకి దిగిన బాలేంద్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. సాదాసీదా నల్ల చొక్కా, కళ్లద్దాలతో కనిపించే ఈ ఇంజనీర్-కమ్-ర్యాపర్.. సంప్రదాయ రాజకీయాల్లో ఉండే మేనిఫెస్టో ల కంటే, పరిపాలనలో పారదర్శకత అనే నినాదంతో ఓటర్లను ఆకట్టుకున్నారు.
ఈ ఎన్నికల్లో రాజకీయ దిగ్గజాలకు సైతం చుక్కెదురైంది. మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలి తన సొంత నియోజకవర్గమైన ఝాపా-5లో బాలేంద్ర షా చేతిలో భారీ తేడాతో వెనుకంజలో ఉన్నారు. కేవలం రాజధాని ఖాట్మండులోనే కాకుండా, దేశవ్యాప్తంగా RSP అభ్యర్థులు ఆధిక్యంలో ఉండటం చూస్తుంటే.. నేపాలీలు పాత పార్టీలైన నేపాలీ కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీలను కాదని, ఒక కొత్త తరం నాయకత్వాన్ని కోరుకుంటున్నారని స్పష్టమవుతోంది.


