కేటీఆర్‌ను జైలుకు పంపుతారని ఎంతో మంది అనుకున్న ఫార్ములా ఈ రేసు కేసు కోల్డ్ స్టోరేజ్‌లోకి వెళ్లే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ఏసీబీ అరెస్టులు లేకుండా విచారణ పూర్తి చేసింది. ఐఏఎస్ అరవింద్ కుమార్ తో పాటు బీఎల్ఎన్ రెడ్డి అనే మరో రిటైర్డ్ అధికారిపై ప్రాసిక్యూషన్‌కు ఏసీబీ సిఫారసు చేసింది. కేటీఆర్‌పై ప్రాసిక్యూషన్ గవర్నర్ అనుమతి కావాలి కాబట్టి ఆయనకు లేఖ రాశారు. అక్కడి నుంచి వచ్చే అనుమతి బట్టి తదుపరి నిర్ణయాలు ఉంటాయి.
బీఆర్ఎస్ ప్రభుత్వం చివరి రోజుల్లో ఫార్ములా ఈ రేసు కంపెనీకి రూ.50 కోట్లు చెల్లించారు. దానికి లెక్కా పత్రం లేదు. అనుమతి లేదు. కానీ హెచ్ఎండీఏ ఖాతా నుంచి ఆ కంపెనీకి ..విదేశాలకు తరలిపోయాయి. అదే సమయంలో స్పాన్సర్ షిప్ నుంచి వైదొలిగినట్లుగా ప్రకటించుకున్న కంపెనీ నుంచి బీఆర్ఎస్ పార్టీకి రూ.41 కోట్లు ఎలక్టోరల్ బాండ్లు వచ్చాయి. ఆ బాండ్లు ఈ సొమ్మేనని.. ఏసీబీ అభియోగం. విచారణ పూర్తి అయింది. చార్జిషీటు దాఖలుకు ఆటంకాలు ఉన్నాయి.
కేటీఆర్ పై విచారణకు గవర్నర్ మొదటే అనుమతి ఇచ్చారు. సుప్రీంకోర్టు వరకూ వెళ్లినా.. కేసును కేటీఆర్ క్వాష్ చేయించుకోలేకపోయారు. ఆయనను అరెస్టు చేయడానికి ఏ ఆటంకాలు లేకపోయినా అరెస్టు చేయలేదు. ఇప్పుడు చార్జిషీటు దాఖలు కోసం గవర్నర్ అనుమతి కోసం ప్రయత్నిస్తున్నారు. గవర్నర్ అనుమతి వస్తుందా లేదా అన్నది తెలియదు. కానీ చార్జిషీటుకు అనుమతి రాకపోతే.. అధికారుల్నీ ప్రాసిక్యూట్ చేయలేరు. అందుకే ఇప్పటికి హడావుడి జరిగినా ఆ కేసు కోల్డ్ స్టోరేజీలోకి వెళ్తుందని భావిస్తున్నారు.