అనిల్ అంబానీ కుమారుడు జై అన్మోల్ అంబానీపై కేంద్ర జాతీయ అవినీతి బ్యూరో రూ.228 కోట్ల బ్యాంకింగ్ మోసం కేసులో క్రిమినల్ కేసు నమోదు చేసింది. ఇది జై అన్మోల్‌పై మొదటి క్రిమినల్ కేసు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిర్యాదు ఆధారంగా ఈ కేసు నమోదు అయింది.
రిలయన్స్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ 2017 సెప్టెంబర్‌లో నేషనల్, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లలో లిస్ట్ అయింది. అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ గ్రూప్‌కు చెందిన ఈ సంస్థ, ముంబైలోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రూ.450 కోట్ల టర్మ్ లోన్లు, రూ.100 కోట్ల విలువైన నాన్-కన్వర్టిబుల్ డెబెంచర్లు పొందింది.ఆ లోన్ మొత్తాలను దారి మళ్లించారు.
రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్ లిమిటెడ్, రిలయన్స్ టెలికాం లిమిటెడ్, రిలయన్స్ కమ్యూనికేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ వంటి గ్రూప్ సంస్థలకు మళ్లించారు. సర్క్యులర్ ట్రాన్సాక్షన్లు ద్వారా నిధులు తిరిగి ఆర్హెఫ్ఎల్కు వచ్చాయి. కానీ బ్యాంకులకు కట్టడం మానేశారు. ఆర్హెఫ్ఎల్ లోన్ అకౌంట్ నాన్-పెర్ఫార్మింగ్ అసెట్ గా మారింది. యూబీఐ ఆర్హెఫ్ఎల్ అకౌంట్‌ను ‘ఫ్రాడ్’గా ప్రకటించి సీబీఐకి ఫిర్యాదు చేసింది.
జై అన్మోల్ అంబాని రిలయన్స్ హోం ఫైనాన్స్ డైరెక్టర్లుగా రోజువారీ వ్యవహారాలు, ఆర్థిక నిర్ణయాలకు బాధ్యత వహించారు. లెండింగ్, రీపేమెంట్లలో అక్రమాలు చేసి, బ్యాంకు నిధులు అక్రమంగా వాడారు. ఆధారాలన్నీ ఉండటంతో కేసు పెట్టారు. ఇప్పటికే తండ్రి అనిల్ అంబానీ దివాలా తీశారు. ఆయనపైనా చాలా కేసులు ఉన్నాయి. ఇప్పుడు ఆయన కుమారుడు కూడ ఆర్థిక మోసాల కేసుల్లో ఇరుక్కుంటున్నారు.