తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కురుక్షేత్రంలో ‘మేనిఫెస్టో’ల యుద్ధం తారస్థాయికి చేరింది. ఆదివారం ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ విడుదల చేసిన డీఎంకే మేనిఫెస్టో, ప్రత్యర్థుల ఎత్తుగడలకు ఏమాత్రం తలొగ్గకుండా తన ద్రవిడ మోడల్ నమ్మకాన్నే ప్రతిఫలించింది. అన్నాడీఎంకే ఉచితాల వర్షం కురిపించినా, విజయ్ తన టీవీకే ద్వారా కొత్త ఆశలు రేపినా.. స్టాలిన్ మాత్రం తనదైన శైలిలో, అదనపు ఆకర్షణల కంటే ఆచరణాత్మక పాలనకే మొగ్గు చూపారు.
స్టాలిన్ సూపర్ స్టార్ మేనిఫెస్టో
డీఎంకే మేనిఫెస్టోను సూపర్ స్టార్ గా అభివర్ణించిన స్టాలిన్, ప్రత్యర్థుల ఉచితాలకు దీటుగా తనదైన శైలిలో ఇల్లత్తరసి అనే పథకాన్ని ప్రకటించారు ఆదాయ పన్ను పరిధిలోకి రాని గృహిణులకు ఏకంగా రూ.8,000 విలువైన కూపన్ అందజేస్తామని, దీనితో వారికి నచ్చిన వాషింగ్ మెషీన్, టీవీ లేదా ఫ్రిజ్ వంటి ఎలక్ట్రానిక్ వస్తువులను కొనుగోలు చేసుకోవచ్చని వెల్లడించారు. అలాగే కలైంజ్ఞర్ మహిళా హక్కు పథకం కింద ఇస్తున్న నగదును ₹1,000 నుండి 2,000కు పెంచుతున్నట్లు ప్రకటించారు. ప్రత్యర్థి పార్టీలు తన పాత పథకాలనే ప్రాతిపదికగా తీసుకుని పోటీ పడుతుండటంతో, తాను పెద్దగా పంథా మార్చుకోవాల్సిన అవసరం లేదని స్టాలిన్ బలంగా నమ్ముతున్నారు.
ఫ్రిజ్ వర్సెస్ కూపన్
అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి తన మేనిఫెస్టోలో ఉచిత రిఫ్రిజిరేటర్లు, ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, మహిళలకు రూ.2,000 చొప్పున ఆర్థిక సాయం వంటి భారీ హామీలు గుప్పించారు. అయితే, స్టాలిన్ దీనికి భిన్నంగా ఎంపిక చేసుకునే అవకాశాన్ని లబ్ధిదారులకే వదిలేశారు. ప్రభుత్వం నేరుగా వస్తువులు ఇచ్చే కంటే, ప్రజలే తమకు నచ్చిన వస్తువును కొనుగోలు చేసుకునే వెసులుబాటు కల్పించడం ద్వారా అవినీతికి తావులేకుండా చేయవచ్చని స్టాలిన్ భావిస్తున్నారు. అన్నాడీఎంకే ఉచితాల హోరును చూసి ఆయన ఏమాత్రం ఆందోళన చెందకుండా, తన పాత పథకాలనే స్కేల్-అప్ చేయడం ఆయన ధీమాకు నిదర్శనం.
టీవీకే గాలం.. స్టాలిన్ కు సవాల్?
సినీ నటుడు విజయ్ తన తమిళగ వెట్రి కళగం మేనిఫెస్టోలో నిరుద్యోగ భృతి , డ్రగ్-ఫ్రీ స్టేట్ వంటి అంశాలకు ప్రాధాన్యత ఇచ్చారు. కొత్త ఓటర్లు, యువతను ఆకట్టుకోవడమే లక్ష్యంగా విజయ్ అడుగులు వేస్తుంటే, స్టాలిన్ మాత్రం నాన్ ముదల్వన్ పథకం ద్వారా ఇప్పటికే 5 లక్షల మంది యువతకు శిక్షణ, నెలకు 1,500 స్టైపెండ్ ఇస్తున్నామని గుర్తు చేస్తున్నారు. కొత్త పార్టీల రాకతో ఓట్లు చీలిపోయినా, తన డెలివరీ సిస్టమ్ (Delivery Mechanism) బలంగా ఉండటంతో విజయం తనదేనని స్టాలిన్ ఫిక్స్ అయ్యారు.
తమిళనాడు చరిత్రలో ఏ ప్రభుత్వం చేయని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేశామని, ప్రజల మద్దతుతో ఏడవసారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని స్టాలిన్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యర్థులు తనను అనుకరిస్తున్నారే తప్ప కొత్తగా ఏమీ చేయడం లేదన్నది ఆయన విశ్లేషణ. ఏప్రిల్ 23న జరగనున్న పోలింగ్లో ఈ మేనిఫెస్టోల యుద్ధం ఎవరిని సింహాసనంపై కూర్చోబెడుతుందో చూడాలి.
