తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు సిద్ధమవుతున్న తమిళగ వెట్రి కళగం అధినేత విజయ్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఎన్నికల్లో విజయ్ రెండు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు. చెన్నైలోని పెరంబూర్ , తిరుచిరాపల్లిలోని తిరుచ్చి ఈస్ట్ స్థానాలను ఆయన ఎంచుకున్నారు. తొలిసారి బరిలోకి దిగుతున్న ఒక కొత్త పార్టీ నాయకుడు రెండు చోట్ల పోటీ చేయడం వ్యూహాత్మక తప్పిదమయ్యే అవకాశం కనిపిస్తోంది.
ఆత్మవిశ్వాసమా.. లేక అభద్రతా భావమా?
నేటి రాజకీయాల్లో ఏ నాయకుడైనా రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నారంటే, ప్రజల్లోకి వెళ్లే మొదటి సంకేతం అభద్రతా భావం . ఒకే చోట గెలుస్తామన్న నమ్మకం లేకనే సేఫ్ సైడ్ కోసం రెండో స్థానాన్ని ఎంచుకున్నారన్న అభిప్రాయం ఓటర్లలో బలంగా నాటుకుపోతోంది. గతంలో రేవంత్ రెడ్డి, కె. చంద్రశేఖర్ రావు (వంటి దిగ్గజాలే తమ కంచుకోటలతో పాటు వ్యూహాత్మక పోటీ అని రెండో చోట పోటీచేసి ఓడిరపోయారు. 2023 తెలంగాణ ఎన్నికల్లో కామారెడ్డిలో వీరిద్దరూ పోటీ పడి.. చివరకు ఒక సామాన్య అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. ఇప్పుడు విజయ్ కూడా అదే తరహాలో రెండు చోట్ల నిలబడటం వల్ల ఓటర్లకు ఆయనపై ఉన్న నమ్మకం సన్నగిల్లే ప్రమాదం ఉంది.
రెండు పడవల ప్రయాణం – ఇరుక్కునే ఛాన్స్
విజయ్ ఎంచుకున్న నియోజకవర్గాల్లో ప్రత్యర్థులు చాలా బలంగా ఉన్నారు. పెరంబూర్ స్థానంలో డిఎంకె సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్.డి. శేఖర్ తన పట్టును నిరూపించుకోగా, తిరుచ్చి ఈస్ట్‌లో ఇనిగో ఇరుదయరాజ్ గట్టి పోటీని ఇస్తున్నారు. ఈ రెండు చోట్లా విజయ్ ఒకే సారి దృష్టి సారించడం కష్టతరమైన పని. ప్రచారం కోసం ఒక నియోజకవర్గంలో ఎక్కువ సమయం కేటాయిస్తే, రెండో చోట ప్రజలు మమ్మల్ని పట్టించుకోవడం లేదు అనే భావనకు వచ్చే అవకాశం ఉంటుంది. ఫలితంగా రెండు చోట్లా ఓటర్లు ఆయనకు వ్యతిరేకంగా మొగ్గు చూపే అవకాశం లేకపోలేదు. అదే సమయంలో ఆయన రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించాలి. ఏ నియోజకవర్గంలోనూ ఎక్కువగా ప్రచారం చేయలేరు.
అస్తిత్వ పోరాటంలో ఇబ్బందులు
కొత్తగా రాజకీయాల్లోకి వచ్చే వ్యక్తికి ఒక కంచుకోట ఉండటం చాలా అవసరం. అది తన సొంత నియోజకవర్గంగా ప్రజల్లో ముద్ర వేసుకోవాలి. కానీ విజయ్ రెండు చోట్ల పోటీ చేయడం వల్ల ఆయన అసలు ఏ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించాలనుకుంటున్నారు? అనే స్పష్టత ప్రజలకు అందడం లేదు. దీనివల్ల ఆయనను కేవలం ఒక గెస్ట్ క్యాండిడేట్ గా మాత్రమే స్థానిక ఓటర్లు చూసే ప్రమాదం ఉంది. పైగా రెండు చోట్లా గెలిస్తే ఏదో ఒక స్థానానికి రాజీనామా చేయాల్సి వస్తుంది, అది ఆ నియోజకవర్గ ప్రజలను అవమానించినట్లు అవుతుందనే ప్రచారం ప్రత్యర్థులు అప్పుడే మొదలుపెట్టారు.
చరిత్ర పునరావృతమవుతుందా?
ఇటీవలి కాలంలో రెండు చోట్ల పోటీ చేసి రెండు చోట్లా గెలిచిన సందర్భాలు చాలా తక్కువ. ఒకవేళ గెలిచినా మెజారిటీలు చాలా స్వల్పంగానే ఉంటున్నాయి. విజయ్ తన సినిమాల మాదిరిగా రాజకీయాల్లో కూడా డబుల్ రోల్ సక్సెస్ అవుతుందని భావిస్తున్నారేమో కానీ, క్షేత్రస్థాయి రాజకీయాలు అందుకు భిన్నంగా ఉంటాయి. డిఎంకె, అన్నాడీఎంకే వంటి బలమైన కేడర్ ఉన్న పార్టీలను ఎదుర్కోవాలంటే ఒకే చోట నిలబడి గట్టిగా పోరాడటం ఉత్తమ వ్యూహం కావొచ్చు. కానీ విజయ్ మాత్రం రెండు చోట్ల పోటీకే నిర్ణయం తీసుకున్నారు.


