అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్న తరుణంలో, కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్పై లీటరుకు రూ. 10 వరకు పన్నులను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. సాధారణంగా పన్నులు తగ్గితే ధర తగ్గుతుందని అనుకుంటారు. ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు రావు. ఎందుకంటే ఇది ఆయిల్ కంపెనీలు, ప్రభుత్వం మధ్య సర్దుబాటు మాత్రమే. గతంలో క్రూడాయిల్ ధర భారీగా తగ్గినప్పుడు కేంద్రం పన్నులు పెంచింది. అప్పుడు సాధారణ ప్రజలకు రేట్లు పెరగలేదు. అలాగే ఇప్పుడు పన్నులు పెంచినా రేట్లు పెరగవు.
ప్రస్తుత గ్లోబల్ పరిస్థితులను బేరీజు వేస్తే, పెట్రోల్ ధర లీటరుకు రూ. 150 దాటాల్సిన పరిస్థితి ఉందన్న అంచనాలు ఉన్నాయి. కానీ కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ధరలు పెరగకుండా ఒకే చోట స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ధరలు తగ్గించడం గురించి ఎవరూ ఆలోచించడం లేదు.. పెట్రోల్, డీజిల్ కొరత లేకుండా ఉంటే చాలని అనుకుంటున్నారు. ఒకవేళ కేంద్రం పన్నులు తగ్గించకుండా ఉండి ఉంటే, చమురు సంస్థలు తప్పనిసరి పరిస్థితుల్లో సామాన్యుడిపై భారం వేయాల్సి వచ్చేది. ఈ క్లిష్ట సమయంలో ధరలను పెంచకుండా యథాతథంగా ఉంచడమే సామాన్యుడికి ప్రభుత్వం ఇచ్చిన అతిపెద్ద కానుక అనుకోవచ్చు.
ప్రభుత్వం తన రాబడిని తగ్గించుకోవడం వల్ల దేశ ఆర్థిక లోటుపై ప్రభావం పడుతున్నప్పటికీ, ద్రవ్యోల్బణం అదుపు తప్పకుండా ఉండేందుకు ఈ మార్గాన్ని ఎంచుకుంది. రవాణా ఖర్చులు పెరిగితే నిత్యావసర వస్తువుల ధరలు అమాంతం పెరుగుతాయి, దానిని నివారించడమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం. రాబోయే రోజుల్లో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గితే అప్పుడు మళ్లీ ప్రభుత్వం ట్యాక్సులు పెంచి చమురు కంపెనీల నుంచి వసూలు చేసుకుంటుంది.


