గద్దర్ అవార్డులన్న పేర్లను ప్రకటించినప్పుడు ఇండస్ట్రీ నుంచి ఎవరూ కనీసం దరఖాస్తు చేసుకోవడానికి కూడా ఆసక్తి చూపించలేదు. నంది పేరు ఇష్టం లేకపోతే మరో మంచి పేరు పెట్టి ఉంటే బాగుండేదని అనుకున్నారు. చాలా మంది న్యూట్రల్ వర్గాల నుంచి కూడా అదేం పేరు.. ఆయన పేరుతో ఓ అవార్డు ఇచ్చినా సరిపోతుంది కానీ అన్ని అవార్డులకు ఆ పేరు పెట్టడం ఏమిటని అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే రేవంత్ రెడ్డి మాత్రం వెనక్కి తగ్గలేదు. అదే పేరుతో అవార్డులు ప్రదానం చేశారు. ఈవెంట్ కూడా ఊహించని రేంజ్ లో జరిగింది. అది రేవంత్ పట్టుదల అనుకోవచ్చు.
సాధారణంగా ఇలాంటి ఈవెంట్లకు చాలా మంది సెలబ్రిటీలు హాజరు కారు. తక్కువగా అంచనా వేస్తారు. కానీ గద్దర్ అవార్డులకు మాత్రం అవార్డులు పొందిన స్టార్స్ అందరూ వచ్చారు. ఈవెంట్ ను కూడా కలర్ ఫుల్ గా డిజైన్ చేశారు. ఇండస్ట్రీ విషయంలో రేవంత్ కఠినంగా ఉంటారన్న అభిప్రాయం ఉన్నా….అభివృద్ధి కోసం పూర్తి స్థాయిలో సహకరిస్తామని చెప్పాకనే చెప్పారు. ఈ విషయంలో రేవంత్ రెడ్డికి ప్రత్యేకమైన ఆలోచనలు ఉన్నాయి. ఇండస్ట్రీ వాళ్లతో పొగిడించుకుని .. వారితో ప్రచారం చేయించుకోవాలని ఆయన అనుకోవడం లేదు. కానీ హైదరాబాద్ లో ఎంటర్ టెయిన్మెంట్ ఇండస్ట్రీని మరింతగా అభివృద్ధి చేయాలని మాత్రం అనుకుంటున్నారు.
సినీ తారల ప్రచారంతో రాజకీయ నేతలకు ఒరిగేదేమీ ఉండదని రేవంత్ రెడ్డికి తెలుసు. అందుకే వారి ప్రచారాన్ని డ్రగ్స్ వంటి సామాజిక సమస్యలపై చైతన్యానికి ఉపయోగించుకుటున్నారు. ఎవర్నీ మరీ అతిగా ప్రోత్సహించడం లేదు..మరీ అతిగా దూరం పెట్టడం లేదు. టిక్కెట్ రేట్ల పెంపు విషయంలో వెనక్కి తగ్గేది ఉండదని.. కూడా స్పష్టమైన సంకేతాలను ఇచ్చారు. ఇండస్ట్రీకి ఎంత అవసరమో అంత చేసేందుకు రేవంత్ రెడ్డి రెడీగా ఉన్నారు. అదే అలుసుగా చేసుకుని ఎవరైనా రాజకీయం చేస్తే ఎలా ఎదుర్కోవాలో కూడా తనకు తెలుసని ఆయన సందేశం ఇచ్చారని అనుకోవచ్చు.