ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 వేదికపై గల్గోటియాస్ యూనివర్సిటీ చేసిన అతి తెలివి ప్రదర్శన దేశ ప్రతిష్టను అంతర్జాతీయ స్థాయిలో మసకబార్చేలా చేసింది. ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు ఆసక్తిగా చూస్తున్న తరుణంలో, ఈ యూనివర్సిటీ ప్రదర్శించిన చైనీస్ రోబో డాగ్ వివాదం ఒక పెద్ద స్పాయిలర్ గా మారింది. మేకిన్ ఇండియా స్ఫూర్తిని చాటాల్సిన వేదికపై, ఆన్లైన్లో దొరికే చైనా రోబోను తెచ్చి తామే స్వయంగా రూ. 350 కోట్లతో రూపొందించామని చెప్పడం ఇప్పుడు నవ్వుల పాలవుతోంది.
భారతీయ మేధస్సును, స్వదేశీ ఏఐ ఆవిష్కరణలను ప్రపంచానికి పరిచయం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ సమ్మిట్‌ను భారీ స్థాయిలో ప్లాన్ చేసింది. గల్గోటియాస్ యూనివర్సిటీ ప్రదర్శించిన ఓరియన్ అనే రోబోటిక్ డాగ్, అసలు చైనాకు చెందిన యూనిట్రీ గో2 అని నిమిషాల వ్యవధిలోనే నెటిజన్లు కనిపెట్టారు. ఈ దారుణమైన తప్పిదాన్ని గమనించిన కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి, ఎక్స్పో నుంచి సదరు యూనివర్సిటీని ఖాళీ చేయించినప్పటికీ, జరగాల్సిన నష్టం జరిగిపోయింది. చైనా మీడియా కూడా ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ భారత్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించే అవకాశం కల్పించినట్లయింది.
ఈ ఏఐ సమ్మిట్‌లో అనేకమంది ఔత్సాహికులు, అంకుర సంస్థలు తమ అద్భుతమైన , నిజమైన ఆవిష్కరణలను ప్రదర్శించారు. కానీ, మీడియాలో , సోషల్ మీడియాలో వారి గొప్ప ఆవిష్కరణల గురించి చర్చ జరగాల్సిన చోట, గల్గోటియాస్ యూనివర్సిటీ చేసిన ఈ కాపీ-పేస్ట్ ఉదంతమే హైలెట్ అవుతోంది. నిజాయితీతో కూడిన పరిశోధనలు చేసిన ఎంతోమంది యువ శాస్త్రవేత్తల శ్రమ ఈ ఒక్క ఘటనతో వెనక్కి వెళ్ళిపోయింది.