తెలంగాణ మంత్రివర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మంత్రులకు గ్యాప్ పెరిగిపోతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఈ అంశంపై అంతర్గతంగా ఎంత గ్యాప్ ఉందో కానీ బయట మాత్రం.. విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. రేవంత్ కాకుండా ఉన్న 14 మంది మంత్రులు ఉన్నారు. వీరిలో కనీసం ఐదారుగురు ముఖ్యమంత్రి రేవంత్ తో అంటీ ముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. చివరికి అత్యంత ఆత్మీయురాలిగా పేరు పడిన సీతక్క కూడా .. కొన్ని విషయాల్లో అసంతృప్తికి గురయ్యారని అంటున్నారు. అందుకే ఇటీవలి కాలంలో ఆమె కూడా వీలైనంత సైలెంటుగా ఉంటున్నారని చెబుతున్నారు.
జూపల్లి కృష్ణారావుతో విబేధాలని ప్రచారం
ఎక్సైజ్ శాఖ నిర్వహిస్తున్న జూపల్లి కృష్ణారావు సీనియర్ మంత్రి. ఆయన తన శాఖలో ఓ టెండర్ వ్యవహారంలో ఉన్నతాధికారి రిజ్వీపై అసహనం వ్యక్తం చేశారు. మద్యం బాటిళ్లపై హోలోగ్రామ్ టెండర్ విషయంలో తన మాట వినిపించుకోలేదని జూపల్లి అసంతృప్తిలో ఉన్నారు. మంత్రికి పంపాల్సిన ఫైల్‌ను సీఎం
కు పంపేశారు రిజ్వీ. అక్కడ్నుంచి వెనక్కి రాలేదు. అధికారి చేసిన పని వల్ల సీఎంకు, మంత్రికి మధ్య ఏదో ఉందని ప్రచారం ప్రారంభమయింది. రిజ్వీ వీఆర్ఎస్ తీసుకోవడంతో ఈ విషయం మరింత ముదిరింది. అదేమీ లేదని వారు ఎంత ప్రచారం చేసినా.. ప్రజల్లోకి మాత్రం వెళ్లిపోయింది.
కొండా సురేఖ, పొంగులేటి సహా కొంత మంది మంత్రుల కినుక
కొండా సురేఖ అంశం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆమె ఏకంగా రేవంత్ కుటుంబంపైనే నిందలు వేశారు. ఇప్పుడు అంతా సెట్ రైట్ అయిందన్నట్లుగా ఉన్నా.. ఆ గ్యాప్ పోదు. గతంలో రేవంత్ తో ఎక్కువగా కనిపించే పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఇ్పపుడు అసలు అలా కనిపించడం లేదు. మల్లిఖార్జున్ ఖర్గేను పరామర్శించడానికి కూడా సీఎంతో వెళ్లలేదు. తర్వాత రోజు వెళ్లారు. ఇటీవల కోమటిరెడ్డి కూడా సైలెంట్ అయ్యారు.
కేబినెట్ సహకరిచకపోతే రేవంత్ ఏం చేయగలరు?
ముఖ్యమంత్రి చెప్పినట్లుగా మంత్రులు చేయాలి. సీఎంపై మంత్రులకు విశ్వాసం లేకపోయినా.. మంత్రులపై సీఎంకు నమ్మకం లేకపోయినా ఆ టీమ్ పర్ ఫెక్ట్ కాదు. తనకు నమ్మకం ఉన్న వారిని.. తనపై విశ్వాసం ఉన్నవారిని మాత్రమే సీఎం తన టీమ్‌లో ఉంచుకుని దానికి తగ్గట్లుగా పనులు చేయించుకోవాలి. అప్పుడే మంచి ఔట్ పుట్ వస్తుంది. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం అనేక విషయాల్లో విఫలమవుతోందన్న ఫీడ్ బ్యాక్ రావడానికి మంత్రుల మధ్య అనైక్యత కూడా ఓ కారణం అనుకోవచ్చు.
