కరీంనగర్లో గేటెట్ కమ్యూనిటీపై ఆసక్తి పెరుగుతోంది. ఉత్తర తెలంగాణకు ప్రధాన ఆర్థిక కేంద్రంగా ఉన్న కరీంనగర్ స్మార్ట్ సిటీ పరిధిలో రియల్ ఎస్టేట్ రంగం సరికొత్త పంథాలో దూసుకుపోతోంది. ఒకప్పుడు కేవలం వ్యక్తిగత గృహాలు, సాధారణ అపార్ట్మెంట్లకే పరిమితమైన ఇక్కడి మార్కెట్.. ఇప్పుడు వేగంగా గేటెడ్ కమ్యూనిటీ సంస్కృతి వైపు మళ్లుతోంది. నగర పౌరుల జీవన ప్రమాణాలు పెరగడం, అంతర్జాతీయ స్థాయి వసతులతో కూడిన జీవనశైలిని ఇష్టపడుతుండటంతో.. కరీంనగర్ శివార్లలో మునుపెన్నడూ లేని విధంగా కమ్యూనిటీ లివింగ్‌కు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఈ ట్రెండ్‌ను అందిపుచ్చుకోవడానికి ప్రముఖ నిర్మాణ సంస్థలు, బిల్డర్లు నగరంలో భారీ ప్రాజెక్టులతో ముందడుగు వేస్తున్నారు.
నగరంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న పద్మనగర్ బైపాస్ రోడ్, తీగలగుట్టపల్లి ప్రాంతాలు ప్రస్తుతం ఈ లగ్జరీ విల్లా ప్రాజెక్టులకు ప్రధాన వేదికలుగా మారాయి. ఈ రూట్లలో స్థానిక వ్యాపారవేత్తలు, డాక్టర్లు, ఉన్నతాధికారులతో పాటు ముఖ్యంగా గల్ఫ్ దేశాలలో స్థిరపడిన ఎన్ఆర్ఐ లను ఆకర్షించేలా బిల్డర్లు అత్యాధునిక డ్యూప్లెక్స్ విల్లాల నిర్మాణాలను లాంచ్ చేస్తున్నారు. 24 గంటల భద్రత, క్లబ్‌హౌస్, స్విమ్మింగ్ పూల్, అధునాతన జిమ్, ల్యాండ్‌స్కేప్ గార్డెన్స్ వంటి సదుపాయాలతో వస్తున్న ఈ ప్రాజెక్టులు విదేశాల్లో ఉండే కరీంనగర్ వాసులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. సొంతూరిలో సురక్షితమైన వాతావరణంలో లగ్జరీ ఇల్లు ఉండాలనే వారి కల ఈ వెంచర్ల ద్వారా సాకారమవుతోంది.
నగరంలో కమ్యూనిటీ లివింగ్‌కు క్రేజ్ రోజురోజుకూ పెరుగుతుండటంతో.. ఇటు బిల్డర్లు, అటు భూ యజమానుల మధ్య సరికొత్త వ్యాపార సమీకరణాలు తెరపైకి వస్తున్నాయి. ఖాళీ స్థలాల ధరలు ఆకాశాన్నంటుతున్న తరుణంలో, నేరుగా భూమిని కొనుగోలు చేయడం కంటే ల్యాండ్ ఓనర్లతో ‘జాయింట్ డెవలప్మెంట్ అగ్రిమెంట్’ చేసుకోవడానికే బిల్డర్లు మొగ్గు చూపుతున్నారు. ఎకరాల కొద్దీ ఉన్న తమ భూములను బిల్డర్లకు అప్పగించి, ప్రాజెక్టు పూర్తయ్యాక విల్లాలు లేదా లాభాల్లో వాటాలు పంచుకునేందుకు భూ యజమానులు సైతం ఉత్సాహం చూపిస్తున్నారు. గడిచిన కొద్దివారాల్లో పద్మనగర్, తీగలగుట్టపల్లి బెల్ట్‌లో రికార్డు స్థాయిలో జేడీఏ ఒప్పందాలు రిజిస్టర్ కావడం దీనికి సంకేతం.
స్మార్ట్ సిటీ నిధులతో నగరంలో రోడ్ల విస్తరణ, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, సుందరీకరణ పనులు పూర్తికావడం కూడా ఈ ప్రాంతాల రియల్ రంగానికి అదనపు బలాన్ని ఇచ్చింది. ప్రధాన రహదారులకు కనెక్టివిటీ మెరుగ్గా ఉండటం, కోరుట్ల-జగిత్యాల వైపు వెళ్లే రూట్లకు ఇవి దగ్గరగా ఉండటంతో ఇన్వెస్టర్లు ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి వెనకాడటం లేదు. రాబోయే రెండు మూడేళ్లలో కరీంనగర్ ముఖచిత్రాన్ని మార్చేలా ఈ గేటెడ్ కమ్యూనిటీలు రూపుదిద్దుకుంటున్నాయని, రాబోయే రోజుల్లో ఇక్కడి మార్కెట్ వరంగల్, నిజామాబాద్ నగరాలను దాటి మరింత విస్తరించే అవకాశం ఉందని స్థానిక రియల్ ఎస్టేట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
