భారతదేశపు అత్యంత దక్షిణ సరిహద్దుల్లో ఉన్న అండమాన్ నికోబార్ దీవుల్లో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన గ్రేట్ నికోబార్ ఐలాండ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్’ ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర రాజకీయ, పర్యావరణ దుమారాన్ని రేపుతోంది. నీతి ఆయోగ్ ప్రతిపాదనల ప్రకారం.. సుమారు 81,000 కోట్ల వ్యయంతో ఈ ద్వీపంలో ఒక అంతర్జాతీయ కంటైనర్ ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్ , సివిల్, మిలిటరీ అవసరాల కోసం అంతర్జాతీయ విమానాశ్రయం, గ్యాస్ బేస్డ్ పవర్ ప్లాంట్, అత్యాధునిక గ్రీన్ ఫీల్డ్ టౌన్‌షిప్‌ను నిర్మించాలని కేంద్రం భావిస్తోంది. మలక్కా జలసంధికి సమీపంలో ఉండటం వల్ల చైనా వ్యూహాత్మక ఆధిపత్యానికి అడ్డుకట్ట వేయడానికి, అలాగే అంతర్జాతీయ వాణిజ్యాన్ని పెంచడానికి ఈ ప్రాజెక్ట్ దేశానికి ఎంతో రక్షణ, ఆర్థిక ప్రయోజనకరమని ప్రభుత్వం చెప్తోంది.
పర్యావరణం ముఖ్యమంటున్నరాహుల్
లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఈ ప్రాజెక్టుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తూ దీన్ని ఒక పెద్ద స్కామ్ గా అభివర్ణించారు. ఈ ద్వీపాలను సందర్శించి, అక్కడ స్వయంగా సముద్రంలోకి డైవింగ్ చేసి అక్కడి పర్యావరణాన్ని పరిశీలించిన రాహుల్ గాంధీ ఒక వీడియోను విడుదల చేశారు. దేశ రక్షణ, అంతర్జాతీయ ఓడరేవు అనేవి కేంద్ర ప్రభుత్వం చెప్తున్న అబద్ధాలని ఆయన ఆరోపించారు. నిజానికి రక్షణ అవసరాలే ఉంటే అక్కడ ఉన్న మిలిటరీ బేస్ ఐఎన్ఎస్ బాజ్ ను విస్తరించవచ్చని, కానీ ప్రభుత్వం రక్షణ దళాల వెనుక దాక్కుని దేశ భూములను దోచిపెట్టే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు.
ఆదాని పేరుతో మరోసారి రాహుల్ ఆరోపణలు
ఈ ప్రాజెక్టులో ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ లింక్‌ను రాహుల్ గాంధీ ప్రధానంగా ప్రస్తావించారు. ఈ మెగా ప్రాజెక్టు ద్వారా లబ్ధి పొందేది కేవలం అదానీ మాత్రమేనని ఆయన ఆరోపించారు. భారతదేశపు అత్యంత అమూల్యమైన పర్యావరణాన్ని ధ్వంసం చేసి, ఒక వ్యాపారవేత్త కోసం అక్కడ లగ్జరీ హోటళ్లు, క్యాసినోలు, ,రియల్ ఎస్టేట్ సామ్రాజ్యాన్ని నిర్మించడానికి మోదీ ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఈ ప్రాజెక్ట్ పేరుతో అడవులను నరికివేసి, ఆ విలువైన కలపను అక్రమంగా తరలించి కోట్లాది రూపాయల వ్యాపారం చేసే స్కెచ్ దీని వెనుక ఉందనేది రాహుల్ ప్రధాన ఆరోపణ.
పెద్ద ఎత్తున చెట్లు తొలగించాలన్న అబిప్రాయం
పర్యావరణ పరంగా ఈ ప్రాజెక్టు వల్ల గ్రేట్ నికోబార్ ద్వీపానికి కోలుకోలేని నష్టం వాటిల్లుతుందని పర్యావరణ శాస్త్రవేత్తలు, విపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రాజెక్ట్ కోసం సుమారు 130 చదరపు కిలోమీటర్ల మేర దట్టమైన ఉష్ణమండల వర్షారణ్యాలను తొలగించాల్సి వస్తుందని దీనివల్ల 1.5 కోట్లకు పైగా అరుదైన వృక్షాలు నరికివేతకు గురవుతాయని రాహుల్ గాంధీ అంటున్నారు. ప్రపంచంలోనే అత్యంత వైవిధ్యమైన సుందాలాండ్ బయోడైవర్సిటీ హాట్‌స్పాట్‌లో ఈ ద్వీపం ఉంది. ఓడరేవు నిర్మాణం వల్ల సముద్రంలో శతాబ్దాలుగా ఉన్న సజీవ పగడపు దిబ్బలు అంతరించిపోతాయని, అంతరించిపోతున్న లెదర్‌బ్యాక్ సముద్ర తాబేళ్ల ప్రధాన సంతానోత్పత్తి కేంద్రమైన గలాథియా బే పూర్తిగా కలుషితమైపోతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
రాహుల్ ఆన్ లైన్ ఉద్యమం
కేవలం ప్రకృతికే కాకుండా, తరతరాలుగా అక్కడ నివసిస్తున్న షోంపెన్, నికోబారీస్ వంటి ఆదిమ గిరిజన తెగలను, దేశం కోసం ప్రాణాలర్పించి అక్కడ స్థిరపడిన మాజీ సైనికుల కుటుంబాలను ఫారెస్ట్ రైట్స్ యాక్ట్‌ను ఉల్లంఘించి అక్రమంగా వారి భూముల నుండి ఖాళీ చేయిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ఇక్కడ అడవులను నరికేసి, దానికి పరిహారంగా ఎక్కడో వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న హర్యానా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో మొక్కలు నాటుతామనడం పర్యావరణాన్ని అపహాస్యం చేయడమేనని కాంగ్రెస్ అంటోంది. రాహుల్ గాంధీ ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఆన్లైన్ పిటిషన్ ఉద్యమాన్ని కూడా ప్రారంభించడంతో ఈ వివాదం హాట్‌టాపిక్‌గా మారింది.
