అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ దాఖలు చేసిన సివిల్ ఫ్రాడ్ కేసును కొట్టివేయాలని కోరుతూ అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ, ఆయన మేనల్లుడు సాగర్ అదానీ అమెరికాలోని న్యూయార్క్ కోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు తమ న్యాయవాదుల ద్వారా ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తమపై వచ్చిన ఆరోపణలకు సరైన ఆధారాలు లేవని, ఈ కేసులో అమెరికా చట్టాల అతిక్రమణ జరగలేదని వారు తమ వాదనలో పేర్కొన్నారు.
ముఖ్యంగా ఈ వ్యవహారం అమెరికా అధికార పరిధిలోకి రాదని అదానీ తరపు న్యాయవాదులు వాదించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు భారతీయులని, వివాదాస్పద బాండ్ల జారీ ప్రక్రియ, దానికి సంబంధించిన అంశాలన్నీ భారత్లోనే జరిగాయని గుర్తు చేశారు. కేవలం విదేశీ చట్టాలను ఇక్కడ వర్తింపజేయడం చెల్లదని, తక్షణమే ఈ కేసును కొట్టివేయాలని కోరారు.
గతంలో నవంబర్ 2024లో SEC ఈ కేసును నమోదు చేసింది. అదానీ గ్రీన్ ఎనర్జీకి సంబంధించి సౌర విద్యుత్ ఒప్పందాల కోసం భారత అధికారులకు సుమారు 250 మిలియన్ డాలర్ల లంచాలు ఇచ్చారని, ఆ విషయాన్ని అమెరికన్ ఇన్వెస్టర్లకు వెల్లడించకుండా నిధులు సేకరించారని అప్పట్లో అభియోగాలు మోపారు. అయితే, అదానీ గ్రూప్ ఈ ఆరోపణలను మొదటి నుంచి తీవ్రంగా ఖండిస్తూ వస్తోంది.
కోర్టు అదానీ పిటిషన్ను స్వీకరించి, ఈ అంశంపై ప్రాథమిక విచారణ నిర్వహించేందుకు అంగీకరించింది. ఏప్రిల్ 30, 2026 నాటికి పూర్తిస్థాయిలో కొట్టివేత దరఖాస్తును సమర్పించనున్నట్లు అదానీ తరపు న్యాయవాదులు తెలిపారు. ఈ పరిణామాలతో అదానీ గ్రూప్ షేర్లు భారత మార్కెట్లలో బుధవారం నాడు గణనీయమైన లాభాలను నమోదు చేశాయి.