రెండేళ్లలో ఏపీకి రూ. 30వేల కోట్ల పెట్టుబడులు తెచ్చామని ప్రకటించుకున్న గౌతం రెడ్డి… ఆ పెట్టుబడులు తెచ్చిన పరిశ్రమల పేర్లను కూడా ప్రకటించి.. అందర్నీ సంభ్రమాశ్చర్యంలో ముంచెత్తారు. తెలిసి.. తెలిసి.. గత రెండేళ్లలో ఏపీలోకి ఒక్క పరిశ్రమ కూడా పెట్టుబడితో రాలేదు. అయినా గౌతం రెడ్డి ఏ పరిశ్రమల పేర్లు ప్రకటించారబ్బా.. అని ఆయన లిస్టును చూసి.. అందరూ నోరెళ్ల బెట్టాల్సి వచ్చింది. ఎందుకంటే.. ఆ పరిశ్రమలన్నీ.. గత రెండేళ్లలో వచ్చినవి కావు. అంతకు ముందే వచ్చినవి. కొన్ని ఉత్పత్తి ప్రారంభించినవీ ఉన్నాయి. మరికొన్ని.. చంద్రబాబు హయాంలో శంకుస్థాపనలు.. ఫ్యాక్టరీ నిర్మాణాలు పూర్తి చేసుకుని … ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉత్పత్తి ప్రారంభించినవి ఉన్నాయి.
ఈ మొత్తం వ్యవహారంలో ఇంకా కామెడీ ఏమిటంటే… కియా మోటార్స్ ను.. ఆ కంపెనీ అనుబంధ పరిశ్రమలను.. కూడా.. గత రెండేళ్లలోనే తీసుకొచ్చినట్లుగా గౌతం రెడ్డి ప్రకటించారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికే.. కియా మోటార్స్ తొలి కారును ఉత్పత్తి చేసింది. ఇక చిత్తూరులో హీరో ఎలక్ట్రిక్… కృష్ణా జిల్లాలో అశోక్ లేలాండ్ ఎలక్ట్రిక్.. చిత్తూరు జిల్లాలో అపోలో టైర్స్ వంటివి ఉత్పత్తి ప్రారంభించేదశలో ప్రభుత్వం మారింది. ఇక చిన్నా చితకా పరిశ్రమలన్నీ.. చంద్రబాబు హయాంలో వచ్చినవే ఉన్నాయి. ఫార్మా దిగ్గజ కంపెనీలు గతంలోనే పెట్టిన పెట్టుబడుల్ని ఇప్పుడు చూపించారు. ఇవన్నీ.. చూస్తూంటే.. తాము తెచ్చినవి కాకుండా.. ఏపీలో ఉన్న పరిశ్రమల వివరాలను ప్రకటించినట్లుగా ఉందన్న అభిప్రాయం నెటిజన్లలో వ్యక్తమవుతోంది.
చాలా మంది మంత్రి గౌతం రెడ్డి మంచి కమెడియన్ అని సెటైర్లు వేస్తున్నారు. లేనిపోని గొప్పలు చెప్పుకోవడం ఎందుకు.. దానికి సాక్ష్యాలుగా ఇలాంటి వివరాలు ప్రకటించి.. అడ్డగోలుగా నవ్వుల పాలవడం ఎందుకన్న ప్రశ్న నెటిజన్లలో వస్తోంది. గౌతం రెడ్డి ప్రకటించిన కంపెనీల పేర్లను చూసిన వారు.. కొత్తగా ఏపీ ప్రభుత్వం ఒక్క పరిశ్రమ కూడా తేలేదని.. తమకు తామే చెప్పుకున్నట్లుగా అయిందని అంటున్నారు. మొత్తానికి గౌతంరెడ్డి.. తమ పార్టీ పరువును ఒక్క ట్వీట్ ద్వారా సోషల్ మీడియాలో పడేశారని ఆ పార్టీ నేతలే గింజుకోవాల్సిన పరిస్థితి.