నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటిస్తున్న వందో చిత్రం… ‘గౌతమి పుత్ర శాతకర్ణి’. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి శ్రియ కథానాయిక. ఇటీవల మధ్యప్రదేశ్‌లో కీలక షెడ్యూల్ చిత్రీకరణ జరుపుకొని తిరిగి వచ్చింది చిత్రబృందం. అక్టోబరులో గౌతమి పుత్ర శాతకర్ణి టీమ్ జార్జియా వెళ్తోంది. అక్కడ వారం రోజుల పాటు షూటింగ్ జరగనున్నదట. ఇది వరకే గౌతమి పుత్ర యూనిట్ జార్జియా వెళ్లొచ్చింది. అక్కడ ఓ సుదీర్ఘమైన షెడ్యూల్ ముగించుకొని తిరిగొచ్చింది. జార్జియాలో యుద్ద సన్నివేశాల్ని ఫైట్ మాస్టర్ రామ్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో తెరకెక్కించారు. ముందు అనుకొన్న షెడ్యూల్ ప్రకారం జార్జియా మళ్లీ వెళ్లనవసరం లేదు. మధ్య ప్రదేశ్‌లో చిత్రీకరణ ముగిశాక… హైదరాబాద్‌లోని శివారు ప్రాంతంలో ప్రత్యేకంగా తీర్చిదిద్దిన సెట్లో షూటింగ్ నిర్వహిస్తే సినిమా పూర్తయినట్టే. అయితే షెడ్యూల్లో లేకుండా.. మళ్లీ జార్జియా ఎందుకు వెళ్తున్నారన్న బలమైన అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
అక్కడ తెరకెక్కించిన యాక్షన్ ఎపిసోడ్స్ ఆశించినంతగా రాలేదని, తిరిగి కొన్ని సీక్వెన్స్‌ని జార్జియాలో రీషూట్ చేయబోతున్నారని చెప్పుకొంటున్నారు. అయితే చిత్రబృందం మాత్రం జార్జియాలో తీసిన సీన్లకు కొనసాగింపుగా మరికొన్ని యాక్షన్ ఘట్టాల్ని తీయబోతున్నామంటోంది. అదే నిజమైతే.. తొలిసారి జార్జియా వెళ్లినప్పుడే ఆయా సన్నివేశాల్నీ తెరకెక్కించి వస్తారు కదా?? అంటే స్ర్కిప్టులో కొత్తగా ఇప్పుడు చేర్చిన సన్నివేశాలేమైనా ఉన్నాయా? అనిపిస్తోంది. ఏదేమైనా బాలయ్య బృందం మళ్లీ జార్జియా పనయం అవుతోంది. తిరిగొచ్చాక హైదరాబాద్‌లో కొత్త షెడ్యూల్ ప్రారంభిస్తారు. ఈ షెడ్యూల్ పొడిగింపుతో విడుదల తేదీలో ఏమార్పూ రాకపోతే అదే పది వేలు అనుకొంటున్నారు నందమూరి అభిమానులు.