ఏప్రిల్ 30న ‘పెద్ది’ రావాలి. మేకర్స్ కూడా రిలీజ్ డేట్ వదులుకోకూడదని గట్టిగా ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ఈ సినిమా వాయిదా పడబోతోందంటూ ప్రచారం జరుగుతోంది. షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ బాకీ ఉన్న నేపథ్యంలో ఏప్రిల్ 30న రావడం కష్టమని విశ్లేషకులు తేల్చేస్తున్నారు. కాకపోతే… సెకండ్ యూనిట్ పెట్టి షూటింగ్ వేగవంతం చేసింది టీమ్. పోస్ట్ ప్రొడక్షన్ లో రాత్రి పగలూ పని చేస్తున్నారు. ఇప్పటికైతే రిలీజ్ డేట్ ఏప్రిల్ 30నే.
మరోవైపు కొన్ని మీడియం రేంజ్ సినిమాలు ‘పెద్ది’ రిలీజ్ డేట్ టార్గెట్ చేస్తున్నాయి. ఒకవేళ ‘పెద్ది’ రాకపోతే తమ సినిమాకు ప్లస్ అవుతుందన్నది వాళ్ల ఆశ. తరుణ్ భాస్కర్ సినిమా ‘గాయపడ్డ సింహం’ చిత్రాన్ని మే 1న రిలీజ్ చేస్తామని చిత్రబృందం ప్రకటించింది. ఈ సినిమా హక్కుల్ని దిల్ రాజు సొంతం చేసుకొన్నారు. దిల్ రాజు రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారంటే ‘పెద్ది’ రిలీజ్ డేట్ పై అనుమానాలు ఉన్నట్టే లెక్క. ‘పెద్ది’ రావట్లేదన్న స్పష్టమైన సమాచారం దిల్ రాజు దగ్గర ఉందని, అందుకే ‘సింహం’ని బరిలో దించుతున్నారన్న ఊహాగానాలు గట్టిగా వినిపిస్తున్నాయి.
దిల్ రాజు మాత్రం ‘పెద్ది’ రాకపోతేనే మా సినిమాని రిలీజ్ చేస్తాం, వస్తే కొత్త డేట్ చూసుకొంటాం, ఆ కండీషన్ పైనే ‘సింహం’ రిలీజ్ డేట్ ప్రకటించాం అంటున్నారు. చిత్రబృందం కూడా `పెద్ది` వచ్చినా ఫర్వాలేదు మా సినిమాని రిలీజ్ చేస్తామంటోంది. ”పెద్ది లాంటి పెద్ద సినిమాకు మా సినిమా పోటీ కాదు. ఆ సినిమా ఓవర్ ఫ్లోస్ తో కూడా మేం సర్దుకుపోతాం. ‘పెద్ది’ చేతిలోకి థియేటర్లన్నీ వెళ్లిపోతాయి. మాకు కొన్ని మిగిలి ఉంటే చాలు. ఓటీటీ వాళ్లు రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. కాబట్టి మేం రాక తప్పడం లేదు. ఒకవేళ మాకు సరిపడా థియేటర్లు లేకపోతే.. మా సినిమాని వాయిదా వేస్తాం” అని నిర్మాతలు స్పష్టంగా చెబుతున్నారు.
నిఖిల్ స్వయంభూ కూడా మే 1న రావాలనుకొంటోంది. రేపో మాపో రిలీజ్ డేట్ ఫిక్స్ చేసే అవకాశం ఉంది. ‘పెద్ది’ వస్తే మాత్రం స్వయంభూ కూడా వాయిదా పడుతుంది.
