కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ కేంద్ర మంత్రి సుబ్బరామిరెడ్డికి చెందిన గాయత్రి ప్రాజెక్ట్స్ తీసుకున్న రూ. 8వేల కోట్ల పైచిలుకు అప్పుల్లో 70 శాతం మాఫీ చేసి.. 30 శాతం కడితే చాలునని బ్యాంకులు వన్ టైమ్ సెటిల్మెంట్ ఆఫర్ ఇచ్చాయి. అదేం మహాభాగ్యం కట్టేసి.. క్లీన్ గా బయటకు వచ్చి మళ్లీ వేల కోట్లు అప్పులు తీసుకుంటామని ఆ సంస్థ రెడీ అయిపోతుంది. కానీ ఇక్కడ అసలు సమస్య ఏమిటంటే .. వారి ఆస్తుల్ని జప్తు చేసి ఎందుకు వేలం వేయరు అన్నదే.
వేల కోట్లు ఎటు పోతాయి.. బినామీల ఖాతాల్లోకి తప్ప ?
గాయత్రి ప్రాజెక్ట్సు రుణాలు తీసుకున్నది లాటరీలు ఆడటానికి..పార్టీలు చేసుకోవడానికి కాదు. నిర్దిష్టమైన ప్రాజెక్టుల కోసమే రుణాలు ఇచ్చారు. ఆ సంస్థ చేపట్టిన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు రుణాలు ఇచ్చారు. వాటిని కట్టి ప్రభుత్వం నుంచి రావాల్సింది తీసుకుని ఉంటారు. అలాగే టోల్ గేట్లు పెట్టుకుని వసూలు చేస్తున్నారు. మరి ఆ డబ్బులను బ్యాంకులకు ఎందుకు చెల్లించలేదు?. వాటిని ఇతర బినామీ ఆస్తులు పెంచుకుని.. అసలు కంపెనీని మాత్రం దివాలా తీయించారు. ఇప్పుడు ఆ కంపెనీ రుణాలను అణాకాణీలు కట్టి మాఫీ చేయించుకుంటున్నారు.
వేల కోట్లు ఎగ్గొడుతున్న కార్పొరేట్లు – మళ్లీ మళ్లీ రుణాలు
ఒక్క సుబ్బరామిరెడ్డి కాదు..కార్పొరేట్లు అందరిదీ ఇదే దారి. అదానీ కంపెనీలకూ ఇలా రుణాల రీస్ట్రక్చరింగ్ చేసి.. చివరికి వన్ టైమ్ సెటిల్మెంట్ చేసిన దాఖలాలు ఉన్నాయి. వీరు మాత్రమే కాదు.. కొన్ని వేల కోట్లు ఇలా రైటాఫ్ చేస్తున్నట్లుగాఎప్పటికప్పుడు వార్తలు వస్తూనే ఉన్నాయి. వీరందరికీ మళ్లీ మళ్లీ కొత్త కంపెనీల ద్వారా రుణాలు వస్తూనే ఉన్నాయి. చివరికి అనిల్ అంబానీనే తీసుకుంటే.. ఆయనకు ఇప్పటికీ వేల కోట్లు ఆస్తులు ఉంటాయి. కానీ దివాలా కేటగిరీలో చేర్చిరైటాఫ్ చేయడం తప్ప మరో మార్గం అనుకుంటూ ఉంటారు.
వాళ్లను అరెస్టు చేసే చట్టాలు తేవాలి!
ఈ కార్పొరేట్లు వ్యక్తిగతంగా ఏమీ చేయరు. కంపెనీల పేరు మీద చేస్తారు. ఆస్తుల్ని బినామీల మీద ఉంచుకుంటారు. బ్యాంకులకు డబ్బులు చెల్లించకపోతే ఆ కంపెనీలే బాధ్యులవుతాయి కానీ వ్యక్తిగతంగా కారు. అందుకే వారి ఆస్తులు వారి వద్దే ఉంటున్నాయి. మోసపోతోంది బ్యాంకులు. అంటే వారి వద్ద డిపాజిట్లు చేస్తున్న ప్రజలే . ఈ కార్పొరేట్లకు దందాకు ఎప్పుడు అడ్డుకట్ట పడితే అప్పుడే ఆర్థిక నేరాలు తగ్గుతాయి. చైనాలో బ్యాంకుల రుణాలు ఎగ్గొట్టినందుకు కఠిన శిక్షలు వేస్తారు. అందుకే అక్కడ అర్థిక నేరాలు ఉండవు. కానీ ఇక్కడ బ్యాంకులకు డబ్బులు ఎగగొట్టడం కార్పొరేట్లకు ఓ వ్యాపార విజయంగా మారింది.