‘ఘాటీ’తో క్రిష్ ఖాతాలో మరో పరాజయం చేరిపోయింది. కథానాయకుడు, మహానాయకుడు, కొండపొలం సినిమాలతో క్రిష్ వెనుకబడ్డాడు. అయితే ఘాటీతో ఆయన ఫామ్ లోకి వస్తారనిపించింది. కానీ ఈసారీ నిరాశే ఎదురైంది. ఇలాంటి ఫ్లాప్ తరవాత క్రిష్ నందమూరి బాలకృష్ణతో ఓ ప్రాజెక్ట్ చేయబోతున్నాడు. అదే.. ‘ఆదిత్య 999’.
ఓరకంగా బాలయ్య డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది. చాలామంది దర్శకులు ఈ ప్రాజెక్ట్ చేయడానికి ఆసక్తి చూపించారు. అయితే బాలయ్య ఏరి కోరి ఆ బాధ్యత క్రిష్ పై పెట్టాడు. ఈ సినిమాతో మోక్షజ్ఞ ఎంట్రీ కూడా ఖాయం అవ్వబోతోంది. ఇంతటి ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ క్రిష్ చేతుల్లో ఉంది. ఘాటీ లాంటి ఫ్లాప్ తరవాత ఇలాంటి ప్రాజెక్ట్ క్రిష్ హ్యాండిల్ చేయగలడా? అనేది బాలయ్య అభిమానుల ప్రశ్న.
అయితే బాలకృష్ణ ఆలోచనలు ఎప్పుడూ వేరుగా ఉంటాయి. ఆయన హిట్, ఫ్లాప్, ట్రాక్ రికార్డ్ ఇవ్వన్నీ పట్టించుకోరు. ఓసారి మాట ఇస్తే.. చేసేసినట్టే. దర్శకుడు ఎవరైనా సరే, ఆయనకు సరెండర్ అయిపోవడమే ఆయనకు తెలుసు. ఘాటీ రిజల్ట్ కు ముందే ఈ సినిమా చేద్దాం అని క్రిష్‌కి హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ రిజల్ట్ తో సంబంధం లేకుండా.. ఆయన ఈ ప్రాజెక్ట్ ముందుకు తీసుకెళ్లబోతున్నారని టాక్. ఇప్పటికే కథ విషయంపై బాలయ్య – క్రిష్ మధ్య చర్చలు నడిచాయి. స్క్రిప్టు కూడా దాదాపుగా ఓకే అయిపోయింది. ఇక ముందుకు వెళ్లిపోవడమే తరువాయి.
క్రిష్ చేతుల్లో ఉన్నది ఒక్కటే.. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలి. అన్నిరకాల జాగ్రత్తలూ తీసుకోవాలి. క్రిష్ ఆలోచనలు వేరుగా ఉంటాయి. అయితే వాటిని కమర్షియల్ యాంగిల్ లోకి తీసుకురావల్సిన బాధ్యత కూడా ఆయనపై ఉంది. బాలయ్య అంటేనే మాస్, కమర్షియల్. ఆ సంగతులన్నీ క్రిష్ కి కూడా తెలుసు. అందుకే ఈ విషయంపై క్రిష్ ఇంకొంచెం గట్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉంది. దసరాకు ఈ ప్రాజెక్ట్ అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.