దెయ్యాన్నే భయపెట్టిన టివీ దెయ్యం

(సెటైర్)

నేను దెయ్యాన్ని. ఇలా అనగానే మీలో చాలామంది ఉలిక్కి పడతారని తెలుసు. ఆమాటకొస్తే, నేనూ అంతే. బ్రతికున్నప్పుడు ఎవరైనా `దెయ్యం’ అంటేచాలు, ఉలిక్కిపడి చచ్చినంతపని చేసేవాడ్ని. కానీ ఇప్పుడు ఆ భయం లేదు. ఎందుకంటే నేనే దెయ్యాన్ని. అంతా నా గురించే- అదే,దెయ్యం గురించే భయపడుతుంటే నేనెవరి గురించి భయపడాలి ? అందుకే నాకిప్పుడు భయంలేదు. అర్థరాత్రి వేళకూడా , స్వేచ్ఛగా శ్మశానంలో తిరుగుతుంటాను. హ్హీహ్హీహ్హీ.

దెయ్యాలకున్న స్వేచ్ఛ ఈ భూప్రపంచంలో మరెవ్వరికీ లేదంటే నమ్మండి. మాకు రెక్కలు లేవు, కానీ ఎగురుతాం. ఆకారం లేదు, కానీ బహురూపాల్లో అందర్నీ భయపెడుతుంటాం. మాకు రంగు,రుచి వాసన లేవు, కానీ పరకాయ ప్రవేశంతో ఆస్వాదిస్తుంటాం. `పరకాయ’ అంటే అర్థంకాలేదా…? అదేనండి పరుల కాయాల్లోకి ప్రవేశించి అన్నీ అనుభవిస్తుంటామన్నమాట. ఈ స్పెషల్ స్టేటస్ మాకిచ్చినందుకు ఆ భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం.

కానీ కాలం ఎప్పుడూ ఒక రకంగా ఉండదు. భయమన్నదే తెలియని నాకు ఈ మధ్య భయంపట్టుకుంది. ఒళ్లు (అది లేకపోయినప్పటికీ ఉన్నట్లుగా) వణకిపోతోంది. పరంధామయ్యను కలవక ముందువరకు నేను బాగానే ఉన్నాను. కలిసిన తర్వాతే భయం మొదలైంది. అసలేం జరిగిందంటే…

ఆరోజు పరంధామయ్య నేనుండే మఱ్ఱి చెట్టు పక్కగా పోతున్నాడు. ఓసారి ఆటపట్టించాలని అతనికి కనిపించా. పాపం బిడ్డడు కంగారుపడిపోయాడు. కానీ తర్వాత కుదుటపడ్డాడు. చివరకు ఆర్గ్యూమెంట్ కి దిగాడు. `నువ్వు నన్ను భయపెట్టొచ్చు. కానీ నిన్న భయపెట్టేది మరొకటుంది, చూస్తావా ‘ అంటూ సవాల్ విసిరాడు. సవాల్ కి పై సవాల్ అన్నాను నేను. `నువ్వు మా ఇంట్లో ఓ పదిరోజులు ఉండు. నేను ఎటు చూపిస్తే అటే చూడాలి. నా మాట వినాలి’ షరతులు పెట్టాడు పరంధామయ్య. `ఓస్, ఇంతేనా…’ అంటూ ఎగురుకుంటూ వారింటికి వెళ్ళాను. అదో మధ్యతరగతి ఇల్లు. పెద్దగా ఆర్భాటాలులేవు. ముందు హాలుల్లో చెక్క సోపాసెట్టు, దానికి ఎదురుగా టీవీ సెట్ ఉన్నాయి. పక్కన ఓ కర్టెన్ ఉంది. వెళ్ళీవెళ్లగానే నాకు పని అప్పగించాడు పరంధామయ్య. నిజానికది పనేకాదు. కర్టెన్ చాటుగా ఉంటూ టివీలో వస్తున్న రకరకాల సినిమాలు చూడటమే. `ఓస్..ఇదీ ఒక పనేనా….’ అనుకుంటూ సరే అన్నాను. అప్పుడు మొదలయ్యాయి నా కష్టాలు.

అలా కర్టెన్ మాటుగా ఉంటూ మొత్తం పదిరోజుల గడువులో ఓ నాలుగు రోజులు టివీల్లో వచ్చిన సినిమాలు చూసేసరికి నాకు కొత్త జబ్బు పుట్టుకొచ్చింది. ఎక్కడ చిన్న శబ్దమైనా వణకిపోతున్నాను. తలుపు చప్పుడైనా, గాలివానకు కర్టెన్లు ఊగినా భయమేస్తోంది. అంతదాకా ఎందుకు పరంధామయ్య చిన్నమ్మాయి తలంటు పోసుకుని జుట్టు విరబోసుకుని సోపాలో కూర్చుని అదోలా నావైపు చూసింది. నా గుండెలు అవసిపోతున్నాయి. ఇంకా ఆరురోజులు ఎలా గడపాలో తెలియని పరిస్థితి. మొదటి రోజు టివీ ఆన్ చేసి హాయిగా సినిమాలు చూడమని అనగానే హుషారుపుట్టింది. ఛానెళ్లు మారుస్తూ సినిమాలు చూస్తున్నాను. ఒక ఛానెల్ లో `రాజుగారి గది’ సినిమా వస్తోంది. మరో ఛానెల్ లో `ప్రేమకథా చిత్రం’ వస్తున్నాయి. చూడటానికి సరదాగానే ఉన్నా, అప్పుడప్పుడు దెయ్యాలు భయపెట్టాయి. అదే రోజు రాత్రి సెకండ్ షోలుగా మళ్ళీ రెండు దెయ్యాల సినిమాలు నడిచాయి. ఒక ఛానెల్ లో `మంగళ’ వస్తుంటే మరో ఛానెల్ లో `పిశాచి’ నడుస్తోంది. అలా ఒక్క రోజునే నాలుగైదు దెయ్యం సినిమాలు చూశాను. అక్కడితో ఆగలేదు. ఆ తర్వాత ప్రతి రోజూ ఏదో ఒక ఛానెల్ దెయ్యం సినిమా వస్తూనే ఉంది. వాడెవడో రాంగోపాల్ వర్మట దెయ్యాల సినిమాలు తీయడంలో ఎక్సపర్ట్ అంట. రాత్రి, పగలు తేడాలేకుండా దెయ్యం సినిమాలు తీసిపారేశాడు. అవన్నీ వరుసగా చూడాల్సి వచ్చింది. దీంతో పరంధామయ్య పిల్లాడు ఐస్ క్రీమ్ తింటున్నా అందులో నుంచి దెయ్యం వస్తుందేమోనన్న భయం నాకే పట్టుకుంది. అంతదాకా ఎందుకు టివీలో నుంచి కూడా దెయ్యం వస్తుందని మరో సినిమాలో చూపించారు. ఇంకొకడేమో నీళ్లే దెయ్యమనేశాడు. ఇలా రాత్రనకా, పగలనకా రోజు వచ్చే దెయ్యం సినిమాలు చూసేసరికి నా మెదడు (దెయ్యాలకు సెపరేట్ మెదడ్లు ఉంటాయిలేండీ) మొద్దుబారింది. వీటికి తోడు టివీ సీరియల్స్ లో కూడా దెయ్యాల ట్రెండ్ వచ్చేసింది. ఇలా టివీలో దెయ్యాలు చూడలేక నానా అవస్థ పడుతుంటే, పరంధామయ్య జాలితలచి నన్ను వదిలిపెట్టాడు.

అంతే, ఎగురుకుంటూ మళ్ళీ మఱ్ఱి చెట్టును ఆశ్రయించాను. ఇప్పుడు కాస్తంత హాయిగా ఉంది. కానీ వణుకు తగ్గడంలేదు. మనుషులు `దెయ్యం’ అన్న పదానికి భయపడుతుంటే, నేనేమో `టివీ’ అన్న పదానికి భయపడుతున్నాను. టివీల్లో దెయ్యాలు చూశాక మామీద మాకే అసహ్యం కలుగుతోంది. మా పేరుచెప్పుకుని ఇష్టమొచ్చినట్లు సినిమాలు తీస్తున్నవారినీ, వాటిని టివీల్లో చూపిస్తున్న వారినీ పట్టిపీడించాలని ఉంది. కానీ ఆ పనిచేయలేను. ఎందుకంటే, వీళ్లు నన్నే భయపెడుతున్న పెద్ద దెయ్యాలు. అలాంటి దెయ్యాలను టివీల్లో చూపిస్తున్నవారు నా కంటే పెద్ద పిశాచీలు. అయినా ధైర్యం చేసి నా డిమాండ్ మీముందు ఉంచుతున్నాను. టివీల్లో దెయ్యం సినిమాలు, సీరియల్స్ బ్యాన్ చేయాలి. పిచ్చిపిచ్చిగా దెయ్యాల సినిమాలు తీసి మా పరువు తీయకండి.మరి నా మాట ఎవరు వింటారు? ప్చ్ఁ… నా పిచ్చిగాని…

– కణ్వస

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఉరిమి ఉరిమి ప్రైవేట్ ల్యాబ్స్‌పై పడుతున్న తెలంగాణ సర్కార్..!

కరోనా టెస్టుల విషయంలో తెలంగాణ సర్కార్ తప్పు అంతా ప్రైవేటు ల్యాబ్స్‌ మీద నెట్టేస్ ప్రయత్నాలు చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. తెలంగాణలో టెస్టులు చేస్తున్న పదహారు ప్రైవేటు ల్యాబుల్లో పదమూడింటికి ప్రభుత్వం నోటీసులు జారీ...

అమరావతికి ఎయిర్‌పోర్టు ఉందా..? రైల్వే స్టేషన్ ఉందా..?

అమరావతి పోరాటం విషయంలో ప్రభుత్వం ఎదురుదాడి చేయడానికి విచత్రమైన కారణాలను ఎదుర్కొంటోంది. ఉద్యమం ప్రారంభమై 200 రోజులు అయిన సందర్భంగా పెద్ద ఎత్తున దేశ, విదేశాల నుంచి రైతులకు సంఘిభావం తెలియచేశారు. ఈ...

కాళేశ్వరం సబ్ కాంట్రాక్టర్లు ఫిరాయింపు కాంగ్రెస్ ఎమ్మెల్యేలా..?

కొండపోచమ్మ సాగర్ కాలువకు పడిన గండిని తెలంగాణ కాంగ్రెస్ నేతలకు రాజకీయంగా ఉపయోగపడుతోంది. కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు అతి సమీపంలో ఉండే వెంకటాపూర్ గ్రామాన్ని ఆ నీరు ముంచెత్తింది. అయితే.. సమస్య అది...

చికాగో నగరం లో అమరావతి ప్రొటెస్ట్

చికాగో నగరం లో నివసిస్తున్న ఆంధ్రప్రదేశ్ కి చెందిన పలువురు ప్రవాస భారతీయులుఅమరావతి ఉద్యమం 200 రోజులకు చేరిన సందర్భంగా తమ సంపూర్ణ మద్దతుతెలియజేస్తూ ఒకే రాష్ట్రం ఒకే రాజధాని నినాదంతో కొవ్వుత్తుల...

HOT NEWS

[X] Close
[X] Close