ఎడిటర్స్ కామెంట్ : ఈ మాత్రం దానికి ఎన్నికలు అవసరమా..!?

ప్రజలు ఓట్లు వేసి గెలిపిస్తేనే ప్రజాస్వామ్యం. అసలు ఓట్లేయనియకుండా గెలిచామని సంబరాలు చేసుకుంటే అతి నియంతృత్వం. ఇప్పటి వరకూ అనేకానేక దేశాలు ఈ తరహా ప్రజాస్వామ్య నియంతృత్వాన్ని చూశాయి. మెల్లగా అలాంటి పరిస్థితి భారత్‌లోకి కూడా దూసుకొస్తోంది. దేశంలో జరుగుతున్న కొన్ని ఎన్నికల తీరును చూస్తే… ఉత్తుత్తి ప్రజాస్వామ్యంగా ఇండియా మారడానికి ఇంకా ఎంతో కాలం పట్టకపోవచ్చన్న అంచనాలు సహజంగానే వస్తాయి.

స్వేచ్ఛ తగ్గిపోయిన భారత ప్రజాస్వామ్యం..!

“స్వేచ్చాయుతమైన ప్రజాస్వామ్యం” నుంచి “పరిమితమైన స్వేచ్చ ఉన్న ప్రజాస్వామ్యం” అన్న స్టేజ్‌కి భారత్ దిగజారిపోయిందని అంతర్జాతీయంగా ప్రజాస్వామ్య దేశాల్లోని పరిస్థితులను అంచనా వేసి.. రేటింగ్స్‌ లాంటివి ఇచ్చే సంస్థ అయిన “గ్లోబల్ పొలిటికల్ రైట్స్ అండ్ లిబరేట్స్” అనే సంస్థ తాజాగా తేల్చింది. ఇలా చెప్పింది అంతర్జాతీయ సంస్థ.. అదీ కూడా వ్యతిరేకంగా చెప్పింది కాబట్టి.. ఆ సంస్థను దేశద్రోహి కేటగిరిలో వేయాలి. ఆ సంస్థ చెప్పిన రిపోర్టు గురించి ప్రస్తావించిన వారిని దేశద్రోహుల జాబితాలో చేర్చాలి. అవసరం అయితే కేసులు పెట్టాలి. ఇదీ సహజంగా… భారత్‌లోని కొంత మంది వాదన. ఇటీవల టూల్ కిట్ అంటూకొంత మందిపై పెట్టిన కేసుల్ని పరిశీలిస్తే అదేమంత అతిశయోక్తి కాదని అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి పరిస్థితినే .. స్వేచ్చ లేని ప్రజాస్వామ్యం అంటారు. అది ఇప్పుడు ఇండియాలో కమ్ముకుంటోంది. అది మాత్రం కళ్ల ఎదురుగా కనబడుతున్న దృశ్యం. ఇది మరింత ముదిరితే… ప్రజాస్వామ్య వ్యవస్థ ఆయువు అయిన ఎన్నికల వరకూ వెళ్తుంది. ఇప్పుడు వెళ్తున్న సూచనలు కూడా కనిపిస్తున్నాయి. తాము మాత్రమే పోటీ చేయాలి.. లేకపోతే ఇంకెవరూ పోటీ చేయకుండా చూడాలి… అన్న పరిస్థితికి ప్రజాస్వామ్యం దిగజారితే… దాన్నే నియంతృత్వం అంటారు. ఇప్పుడు దేశంలో అలాంటి పరిస్థితి ప్రారంభ స్టేజ్‌లో ఉంది.

ఇదే పద్దతిలో అసెంబ్లీ, పార్లమెంట్‌కు కూడా ఏకగ్రీవాలు చేసుకుంటే..!?

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక ఎన్నికలు జరుగుతున్న తీరు చూస్తే “గ్లోబల్ పొలిటికల్ రైట్స్ అండ్ లిబరేట్స్” సంస్థ భారత్‌కు తగ్గించిన ప్రజాస్వామ్య రేటింగ్ నిజమేనని తెలుగు వాళ్లు కూడా అంగీకరించక మానదు. ప్రజలు ఓట్లు వేస్తే.. గెలిస్తే అది ప్రజాస్వామ్యం. ఎవరూ పోటీ చేయనివ్వకుండా చేసి… ఏకగ్రీవంగా గెలిచామని… చెప్పుకోవడం నియంతృత్వం. ప్రపంచంలో చాలా నియంతృత్వపు దేశాల్లో ఇదే జరిగేది. అంతర్జాతీయ సమాజానికి భయపడి ఎన్నికలు పెడతారు కానీ.. బ్యాలెట్‌లో ఎవరి పేర్లూ ఉండవు. ఒక్కరి పేరు మాత్రమే ఉంటుంది. వచ్చి ఓటేయకపోతే దండనలు ఉంటాయి. అలాంటి నియంతృత్వ దేశాలు చాలా వరకూ ఉన్నాయి. ఇప్పుడు కుప్పకూలిపోయాయి. ఇంకా ఉన్నాయి.. ఇప్పుడు.. అలాంటివి ఇండియాలో తయారవుతున్నాయి. స్థానిక ఎన్నికల్లో ఏకగ్రీవాలను చూసిన తర్వాత.. ఈ వైరస్ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు కూడా పాకడం ఖాయమని.. అంచనా వేయడానికి పెద్దగా రాజకీయ విశ్లేషణలు అవసరం లేదు.

ప్రజలు ఓట్లతో గెలిస్తేనే ఏ రాజకీయ పార్టీకి అయినా కిక్..! మరి అధికార పార్టీలకు.,.!?

ఏ రాజకీయ పార్టీ అయినా ప్రజల మద్దతు ఉందని చెప్పుకోవడానికి తమకు పడిన ఓట్ల లెక్కలను చూపిస్తుంది. కానీ విచిత్రంగా ఏపీలో అధికార పార్టీ ప్రజలను ఓట్లు వేయనివ్వకుండా చేసి… వారి ప్రజాస్వామ్య హక్కును కాలరాసి.. తమకు యునానిమస్ మద్దతు ఉందని ప్రచారం చేసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నాయి. సామ, బేధ, దాన, దండోపాయాలకు పోను.. కొత్తగా… మోసాలతో నామినేషన్లు లేకుండా చేయడం… కొత్త రకం ప్రజాస్వామ్యం. నిబంధనల ప్రకారం నామినేషన్ వేసిన అభ్యర్థి వచ్చి.. ఉపసంహరించుకుంటేనే్… అధికారికంగా నామినేషన్ ఉపసంహరించుకున్నట్లు. కానీ ఎవరూ పోటీలో ఉండకూడదనుకుంటే… వారి సంతకాలను ఫోర్జరీ చేసేసి… నామినేషన్ల పత్రాలను వైసీపీ నేతలే సమర్పించేసి.. అధికారులతో మ..మ అనిపించేసి.. అందర్నీ బరి నుంచి తప్పించేయడం కొత్త పద్దతి. ఇలా చేసి చిత్తూరు కార్పొరేషన్ ను వైసీపీ సొంతం చేసుకుంది. ఇలాంటివి కొన్ని వందలు జరిగాయి. మాచర్ల, పుంగనూరు, పులివెందుల, పిడుగురాళ్ల వంటి మున్సిపాల్టీల‌లో పరిస్థితి చూస్తే… మన రౌడీ రాజకీయానికి చాలా దగ్గరగా ఉన్నామని తేలిపోయింది. ఎవరైనా వ్యతిరేకంగా పోటీ చేయాలని చూసినా వారికి శాల్తీలు గ్యారంటీ ఉండని పరిస్థితి వచ్చేసింది. భారత్ లాంటి ప్రజాస్వామ్య దేశాల్లో ఇలాంటి పరిస్థితి ఒకప్పుడు బీహార్‌లో కూడా లేదు. ఇప్పుడు.. అసలు లేదు. కానీ ఆంధ్ర… బీహార్‌ను దాటి ఎన్నికల నియంతృత్వానికి దగ్గరగా వెళ్తోంది. ఇదే అనుభవంతో రేపు అసెంబ్లీ ఎన్నికల్లోనూ తమ సత్తా చాటరని గ్యారంటీ ఏమీ లేదు. పోటీలో నిలబడిన అభ్యర్థుల్ని పార్టీలో చేర్చుకోవడం దగ్గర్నుంచి చాలా చేయవచ్చని.. ఇప్పటికే చూపించారు. కేంద్రంలోనో.. పొరుగు రాష్ట్రంలోనో..తమకు మద్దతిచ్చే .. పార్టీ అధికారంలో ఉంటే చాలు.. ఇక్కడ పోటీ చేయడానికి కూడా భయపడే పరిస్థితుల్ని కల్పించి.. అధికారాన్ని ప్రజాభీష్టం లేకుండానే సొంతం చేసుకోవచ్చు.

పోటీదారులందర్నీ ఎలిమినేట్ చేయడం ఏ తరహా ప్రజాస్వామ్యం..!?

151 అసెంబ్లీ సీట్లు 50 శాతానికిపైగా ఓట్లు సాధించిన పార్టీ ఇప్పుడు … ప్రజలు ఓట్లేస్తారంటే ఎందుకు భయపడుతుందో ఎవరికీ అర్థం కాని పరిస్థితి. నిజంగా తమకు ఉన్న మద్దతును ఓట్ల ద్వారా చూపించాలని ఏ రాజకీయ పార్టీ అయినా అనుకుంటుంది. కానీ ఎన్నికలు జరగకూడదని కోరుకోదు. కానీ విచిత్రంగా వైసీపీ మాత్రం.. ఎన్నికలు వద్దే వద్దంటోంది. అన్నీ ఏకగ్రీవాలు చేసుకుంటామంటోంది. ఎందుకు ఇలా.. అని వస్తున్న సందేహాలను కొట్టి పారేస్తోంది. తమ దారిన తాము పోయి… దాడులు.. దౌర్జన్యాలతో అందర్నీ ఎలిమినేట్ చేస్తోంది. నిజానికి ప్రజలు కూడా… తమకు ఉన్న ఓటు హక్కును ఉపయోగించుకుని.. ప్రభుత్వాల్ని ఎన్నుకుంటారు. తమ ప్రమేయం లేకుండా.. ప్రభుత్వం ఏర్పడితే.. అది స్థానిక ప్రభుత్వమైనా… వారికి అసంతృప్తిగానే ఉంటుంది. అలా ఏర్పడటం ప్రజాస్వామ్య విరుద్ధం కూడా. రాజ్యాంగ నిబంధనలతో గెలిచిన ప్రభుత్వాలు.. ఈ మౌలిక సూత్రాన్ని నమ్మి.. ఎన్నికలకు అవకాశం కల్పించాల్సి ఉంటుంది. కానీ అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఏదైనా చేస్తామని… ప్రజల ప్రజాస్వామ్య హక్కు ఓటును తీసేస్తామని విర్రవీగడం ఇప్పుడే చూస్తున్నాం.

కళ్లు తెరుచుకుని చూస్తూ కామ్‌గా ఉండిపోతున్న రాజ్యాంగ వ్యవస్థలు..!

ఓ మున్సిపాలిటీలో … అన్ని వార్డుల్లో ఒకే పార్టీ తప్ప ఇతరులెవరూ నిలబడలేకపోయారంటే.. అక్కడ పరిస్థితి అంచనా వేయడం పెద్ద విషయం కాదు. ఇలాంటి సందర్భాల్లో రాజ్యాంగ వ్యవస్థలు ఏం చేయాలి. ..! ప్రజాస్వామ్య పునాదులు కదిలిపోతూంటే కాపాడాల్సిన రాజ్యాంగ వ్యవస్థలు.. న్యాయవ్యవస్థలు ఏం చేయాలి..?. తక్షణం రంగంలోకి దిగాలి. కానీ.. ఇప్పుడు జరుగుతున్నదేంటి..?. అంత దారుణమైన పరిస్థితులను చూస్తూ… కళ్లు మూసుకుంటున్నాయి. ఎవరూ స్పందించడం లేదు. అందుకే రాను రాను పరిస్థితి దిగజారిపోతోంది. ఎన్నికలను ఎలాంటి ఒత్తిళ్లు లేకుండా నిర్వహించాల్సిన నిమ్మగడ్డపై ఎన్ని ఒత్తిళ్లు వస్తున్నాయో.. ఆయన తీసుకుంటున్న నిర్ణయాలతోనే తేలిపోతోంది. ఎన్ని ఫిర్యాదులు వచ్చినా ఏమీ చేయలేని నిస్సహాయతలో ఆయన పడిపోయారు. శేషన్‌ను గుర్తు చేశారని మొదట్లో అనుకున్న జనాలు ఇప్పుడు.. ఆయన దేనికో రాజీ పడిపోయారని చర్చించుకోవాల్సిన పరిస్థితి. ఆయనకు న్యాయస్థానాల్లోనూ “మధ్యేమార్గం తీర్పు”లతో ఊరట లభించడం లేదు. ఫలితంగా… మార్చి 31 ఎప్పుడు వస్తుందా.. అని ఆయన ఎదురు చూస్తున్నట్లుగా పరిస్థితి కనిపిస్తోంది.

భారత ప్రజాస్వామ్య వ్యవస్థకు బీటలు పడ్డాయన్నది నిజం..! కాపాడుకోకపోతే కష్టం..!

భారత్ ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం. ప్రపంచంలోనే ఈ గుర్తింపు రావడానికి ప్రజాస్వామ్యమే కారణం. కానీ భారత ప్రజాస్వామ్యంలో ఉన్న లోపాలు ప్రపంచం ముందు ఎప్పుడూ చర్చనీయాంశం కాలేదు. ఓట్లు కొనుగోలు చేసే దరిద్రమైన విధానం ఇండియాలో ఉందని .. ప్రపంచంలో చర్చ జరగలేదు. అధికారాన్ని కొంటారని … ప్రజలు అమ్ముతారని.. ఎవరూ అనుకోరు. అనుకోలేరు. కానీ పార్టీలు.. ఆ ఘనతనూ సాధించి పెడుతున్నాయి. ఇప్పుడు ఓట్లు కొనే పరిస్థితి ఎందుకని… భయపెట్టి… ఏకగ్రీవాలు చేసుకుంటున్నారు. అధికారం అండతో చెలరేగిపోతున్నారు. రేపటి రోజున… ఎన్నికల్లో ఒక్క తమ పార్టీ మాత్రమే పోటీ చేయాలని ఆర్డినెన్స్ తెచ్చినా ఆశ్చర్యపోనవసరంలేదు. ఏదో తమకు మాత్రమే సరిపోయే క్వాలిటీనిచూపించి.. అలాంటి వారు మాత్రమే ఎన్నికల్లో పోటీ చేయాలని.. చట్టం చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు. అధికారాన్ని .. అక్రమ మార్గంలో శాశ్వతం చేసుకుందామనుకునేవారి ఆలోచనలు ఇలానే ఉంటాయి. ఇది ప్రజాస్వామ్య పతనానికి… ప్రజాస్వామ్య వ్యవస్థ బీటలు వారిందనడానికి సాక్ష్యం. “గ్లోబల్ పొలిటికల్ రైట్స్ అండ్ లిబరేట్స్” చెబుతోంది అదే..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

శ్రీవారిని ఒక్క సారీ దర్శించుకోని వైసీపీ అభ్యర్థి..!

తిరుపతి వైసీపీ అభ్యర్థి గురుమూర్తిపై భారతీయ జనతా పార్టీ నేతలు కొత్త కొత్త విషయాలు ప్రసారం చేస్తున్నారు. తిరుపతి ఎంపీ అభ్యర్థి ఇంత వరకూ ఒక్క సారంటే ఒక్క సారి కూడా తిరుమల...

కోల్‌కతా ఓడిపోవడానికే ఆడినట్లుందే..!?

ఎవరైనా మ్యాచ్‌లు ఎందుకు ఆడతారు..? గెలవడానికే ఆడతారు. కానీ ఓడిపోవడానికే ఆడితే ఎలా ఉంటుంది..?. నిజంగా ఓడిపోవడానికి ఎవరూ ఆడరు..కానీ మంగళవారం నాటి ముంబై, కోల్‌కతా మ్యాచ్ చూస్తే రెండు జట్లు ఓడిపోవడానికి...

ఆ ప్రాజెక్ట్ చూస్తామంటే కుదరదంటోన్న ఏపీ..!

ఓ ప్రాజెక్ట్‌ను చూడటానికి వస్తామని కృష్ణాబోర్డు అంటోంది. చూసేందుకు కూడా ఒప్పుకోబోమని.. ఏపీ సర్కార్ తేల్చి చెబుతోంది. కృష్ణా బోర్డు మాత్రం.. అదే పనిగా తాము వస్తున్నామని తేదీ ఖరారు చేసి ఏపీ...

ఏపీలోనే ధరలెక్కువ..! ఎందుకని..?

సాధారణంగా నిత్యావసర వస్తువుల ధరలు ఎక్కడ ఎక్కువగా ఉంటాయి..? పట్టణాల్లో .. నగరాల్లో ఉంటాయి. గ్రామీణ ప్రాంతాల్లో దేశంలో అన్ని ప్రాంతాల్లో ఉన్న సాధారణ రేట్లే ఉంటాయి. కానీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం.. నిత్యావసర...

HOT NEWS

[X] Close
[X] Close