హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌కు క్లారిటీ లేని అంశాల్లో అతి పెద్దది 111 జీవో. కేసీఆర్ ప్రభుత్వం దాన్ని ఎత్తేసినట్లుగా ప్రకటించింది. అదే అదనుగా చాలా మంది నిర్మాణాలు చేసేస్తున్నారు. కానీ జీవో 111 అనేది అంత సులువుగా ఎత్తివేసేది కాదన్న అభిప్రాయం మాత్రం ఉంది. తాజాగా హైకోర్టు హైదరాబాద్ ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ వద్ద జీవో 111 ఉల్లంఘనలపై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పర్యావరణ పరిరక్షణ చట్టాన్ని అమలు చేయడంలో రాష్ట్రం ఎందుకు విఫలమయిందని ప్రశ్నించింది. ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జలాశయాల చుట్టూ అక్రమ నిర్మాణాలపై నాలుగు వారాల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది.
కేసీఆర్ ప్రభుత్వం ఈ జీవోను ఎత్తేస్తున్నట్లుగా ప్రకటించింది. కానీ అధికారిక ప్రక్రియ పూర్తయిందా లేదా అన్నదానిపై ఎలాంటి సమాచారం లేదు. ప్రస్తుత ప్రభుత్వం 111 జీవో ఉనికిలో ఉందన్నట్లుగా వ్యవహరిస్తోంది. జీవో 111 కిందికి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ పరిధిలో 84 గ్రామాలు ఉన్నాయి. ఈ రెండు చెరువులు ఒకప్పుడు హైదరాబాద్ తాగునీటి అవసరాలు కీలకం. అందుకే వాటిలోకి నీరు చేరే క్యాచ్ మెంట్ ఏరియాలో నిర్మాణాలు ఉండకూడదని.. జీవో 111 తీసుకు వచ్చి బయో కన్జర్వేషన్ జోన్‌గా మార్చారు. ఈ ప్రాంత విస్తీర్ణం 538 చదరపు కిలోమీటర్లు ఉంటుంది. 1 లక్షా 32 వేల ఎకరాల భూములు ఉంటాయి.
నగరానికి చేరువలో ఇంత భూముల్లో కేవలం పది శాతంలో మాత్రమే నిర్మాణాలకు అనుమతి ఉంటుంది. అయితే ఇప్పుడు ఆ రెండు చెరువుల నీటిని వాడటం లేదు కాబట్టి.. ఆ జీవో ఎత్తేసి.. అటు రియల్ ఎస్టేట్ అభివృద్ధికి సహకరిస్తామని కేసీఆర్ ప్రకటించారు. జీవో ఎత్తేశారు. కానీ ఉనికిలోకి రాలేదు. ఇప్పుడు హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటవుతోంది. జీవో 111 ప్రకారమే చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది. కేసీఆర్ జీవో ఎత్తేసినట్లుగా ప్రకటించిన తర్వాత పెద్ద ఎత్తున నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. బడా బాబులు నిర్మించుకున్న ఫామ్ హౌస్‌ల సంగతి పక్కన పెడితే.. ప్లాట్లుగా మారిపోయిన పొలాల్లో నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. అనుమతుల్లేకుండా… పంచాయతీల్లో అపార్టుమెంట్లు కట్టేస్తున్నారు. వీటన్నింటికీ గడ్డు పరిస్థితి ఏర్పడిన్లే. అందుకే 111 జీవోలు పరిధిలో ఏదైనా చూసి కొనాల్సి ఉంటుంది.