పదిరోజుల్లోకొచ్చిన పుష్కరాలు: శరవేగంగా పూర్తవుతున్న ఏర్పాట్లు

పన్నెండు సంవత్సరాలకొకసారి వచ్చే గోదావరి పుష్కరాలు ఈసారి జూన్ 14 వతేదీన మొదలౌతున్నాయి. ఈ నదీతీరమహాజన సంబరానికి వ్యవధి ఇంకో పదిరోజులే!! రోజూ ఎనిమిది నుంచి పది లక్షల మంది రాజమండ్రి రాగలరనుకుంటుని అంచనా. మరణించిన వారి పట్ల శ్రద్ధాసక్తులు చూపవలసిన క్రతువుగా మాత్రమేకాక  నిర్విరామ చైతన్యమైన, నీటి ప్రవాహంలో జీవనదిలో…మనుషుల మనుగడకు సంబంధించిన గతమూ, వర్తమానమూ, భవిష్యత్తూ దాగున్నాయని ఈ తరానికి చెప్పడానికి, వారికొక ప్రత్యేక భావన కల్పించటానిక కూడా గోదావరి పుష్కరాల్లో స్నానాలు చేయవలసిందే!

నది, ప్రవాహమార్గం నుంచి విస్తరించి ఒడ్డునే రేవులు రూపుదిద్దుకుంటాయి. అవే పుష్కర స్నానఘట్టాలయ్యాయి. అక్కడ ప్రవాహం మందకొడిగా వుంటుంది. పుష్కరవిధుల్లో భాగంగా యాత్రికులు నదిలో జారవిడిచే ఆకులు, ఇతర ద్రవ్యాలు అక్కడక్కడే తేలుతూ వుంటాయి. ఈతగాళ్ళు నెట్టేస్తూవున్నా  అదంతా తెట్టుగా అక్కడక్కడే తేలుతూ వుంటుంది. కుళ్ళి వాసనవస్తూంటుంది. అయినా ముక్కుమూసుకుననే సంకల్పం మొదలు తర్పణాలు వదలడం వరకూ పుష్కర క్రతువును నిర్వహించేవారు. 2003 పుష్కరాల్లో కూడా ఇదే అవస్ధ…మానవమాత్రుల చేతులు పట్టనంత పూజాద్రవ్యాలు వచ్చిపడుతూంటే ఎవరు మాత్రం ఏమి చేయగలరని సరిపెట్టుకునేవారు.

ఈ తరం పిల్లలకు అశుభ్రతను సహించే ఓర్పులేదు. హైజీనిటీ లేకపోతే వారికి కుదరదు. వారి మనోభావాలను గౌరవించడానికే అన్నట్టు…గట్టువరకూ చేతులు సాచి చెత్తని లోనికి లాగేసుకునే భారీ మరపడవలు రెండు వచ్చాయి. ఇవి గోదివరి నదిలో రాజమండ్రి స్నానఘట్టాలన్నీ కలియదిరుగుతూ చెత్తను నదిలోకి ఈడ్చేస్తూంటాయి. ఈ జర్మన్ యంత్రాలకు రోజుకి లక్షరూపాయల చొప్పున రాష్ట్రప్రభుత్వం అద్దె చెల్లిస్తుంది.

ఎక్కడ ఏం జరుగుతూందో తెలుసుకోడానికి వీలుకల్పించే 170 సీసీ కెమేరాలను రిలయెన్స్ జియో సంస్ధ పోలీసులకు ఇచ్చింది. ఇందుకు స్నానఘట్టాలతో సహా యాత్రికులుండే ప్రతీచోటునీ కలుపుతూ 33 కిలోమీటర్ల ఆప్టిక్ ఫైబర్ కేబుల్ వేశారు. 360 డిగ్రీలూతిరిగే కెమేరాలను అమరుస్తున్నారు. క్యూల నియంత్రణ, యాత్రికుల భద్రత లను 20 వేలమంది ఒళ్ళంతా కళ్ళు చేసుకునే పరిస్ధితికి మించిన ఈ టెక్నలాజికల్ సదుపాయం గత పుష్కరాల్లోలేదు. పుష్కరాలకాలంలో 4జి మొబైల్ సర్వీసులను కూడా రిలయన్స్ జియో అందిస్తోంది.
స్నానఘట్టం ఎక్కడ, పురోహితులు ఎక్కడ, వున్నచోటు చుట్టూ ఎంతెంత దూరాల్లో పార్కింగ్ స్పేస్ లూ, లాకర్లు, డార్మెటరీలు వున్నాయి మొదలైన వివరాలను సూచించే మొబైల్ యాప్స్ తయారౌతున్నాయి. జనంరద్దీ ప్రదేశాల్లో పెద్దవాళ్ళు పిల్లల్ని జాగ్రత్తగా పట్టుకుని, గమ్యస్ధానాలకు దారులెటు అని ఎదురైన వారిని అడిగే పరిస్ధితి ఇపుడులేదు. యువతీయువకులు స్మార్ట్ ఫోన్లలో దారులు చూస్తూ టెక్నాలజీ అండతో పెద్దవాళ్ళను నడిపించేస్థాయికి ఎప్పడో ఎదిగారు కాబట్టి దిగులులేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com