హైదరాబాద్: తెలంగాణ భారీ నీటిపారుదలశాఖమంత్రి హరీష్ రావు తెలుగుదేశాన్ని ఆంధ్రోళ్ళపార్టీ అనటాన్ని ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు తప్పుబట్టారు. ఇవాళ ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, టీఆర్ఎస్ పార్టీలో 60 శాతంమంది ఎమ్మెల్యేలు తెలుగుదేశంవారేనని గుర్తు చేశారు. కడియం శ్రీహరి, ఇంద్రకరణ్ రెడ్డి, పోచారం శ్రీనివాసరెడ్డి, జోగు రామన్న, తుమ్మల నాగేశ్వరరావు, తలసాని శ్రీనివాస యాదవ్ వంటి వారందరూ టీడీపీవారేనని అన్నారు. కేసీఆర్ కూడా 1985, 89, 94, 99 సంవత్సరాలలో తెలుగుదేశంపార్టీ జెండాపైనే ఎమ్మెల్యేగా గెలిచారని, 95లో, 99లో మంత్రిగా చేసింది తెలుగుదేశం ప్రభుత్వంలోనే అన్న విషయాన్ని గుర్తు చేశారు. తెలుగుదేశం ఆంధ్రోళ్ళదికాదని, తెలుగువారిదని చెప్పారు. తెలుగువారి ఆత్మగౌరవంకోసం ఎన్టీఆర్ ఈ పార్టీని స్థాపించారని అన్నారు. తెలంగాణలో బడుగు, బలహీనవర్గాలకు పటేల్, పట్వారీ వ్యవస్థనుంచి రామారావు విముక్తి కల్పించారని గుర్తు చేశారు. నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డికి సొంత పార్టీనుంచే ముప్పు ఉందని గాలి చెప్పారు.