తెలుగు మీడియా గొంతు మూగబోయిందా?

తెలుగు రాష్ట్రాల్లో మీడియా వ్యవహార సరళిపై పలు విశ్లేషణలు , పలు సెటైర్లు , పలు వ్యాసాలు ఇదివరకే వ్రాయబడ్డాయి. అయితే నిన్న మొన్నటి ఒక వ్యవహారం తెలుగు ప్రేక్షకులని ఆశ్చర్యానికి లోనయ్యేలా చేసింది. ఎవరైనా అవతలివాళ్లు తనమీద నింద మోపితే, అది కూడా అకారణంగా నింద మోపి తే సాధారణంగా ఎవరైనా తిరగబడతారు. లేదా తమ వాదన వినిపిస్తారు. తెలుగు మీడియా పై ఎవరైనా చిన్న సినిమా ఆర్టిస్ట్ కానీ, కామెడీ ఆర్టిస్టు కానీ ఏదైనా వ్యాఖ్యలు చేస్తే ఆ వ్యాఖ్యలను మీడియా చీల్చి చెండాడుతాయి. కానీ ఆశ్చర్యకరంగా మీడియా మీద ఒక బలమైన నింద మోపి తే ఒక్క మీడియాకు కూడా దాన్ని ఖండించడానికి గొంతు పెగల లేకపోవడం తెలుగు ప్రజలను ఆశ్చర్యానికి గురిచేసింది.

వివరాల్లోకి వెళితే, పుష్కరాల సమయంలో తొక్కిసలాట కారణంగా 29 మంది చనిపోయారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రి విఐపి ఘాట్ కి వెళ్ళకుండా సాధారణ ఘాట్ కి రావడం వల్ల ఈ దుర్ఘటన జరిగిందని కొందరు, బోయపాటి శీను దర్శకత్వంలో పుష్కరాల పై ఒక షార్ట్ ఫిలిం తీసి దాన్ని ప్రచారానికి ఉపయోగించుకోవడానికి ప్రయత్నించడం వల్ల జరిగిందని కొందరు, అధికారుల నిర్వహణ మరియు పర్యవేక్షణ లోపాల వల్ల ఇది జరిగిందని ఇంకొందరు, పుష్కర సమయంలో నిర్వహణ ఏర్పాట్లపై చూపించాల్సిన శ్రద్ధ కాస్త ప్రభుత్వం ప్రచార ఆర్భాటాలు మీద చూపించడం వల్ల జరిగిందని కొందరు -ఇలా ఎవరికి తోచినట్లు వాళ్ళు ఈ దుర్ఘటన కి కారణాలను విశ్లేషించారు. ఏది ఏమైనా జరిగింది ఒక దుర్ఘటన. దీనిపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఇన్నాళ్ల తర్వాత అధికారికంగా దుర్ఘటనకు దారి తీసిన కారణాల మీద ఒక నివేదిక వచ్చింది. ఇంతకీ ఈ నివేదిక చెప్పిన కారణం ఏమిటంటే, కేవలం ఫలానా ముహూర్తం బాగుందని మీడియా అతిగా ప్రచారం చేయడం వల్లనే , ప్రజలందరూ ఆ ముహూర్తం కోసం ఎగబడడం వల్లనే ఈ దుర్ఘటన జరిగిందని అధికారిక నివేదిక తేల్చి వేసింది. మీడియా అంటూ ఒక” జనరిక్ ” పదాన్ని వాడడం వల్ల ఎవరి మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా ప్రభుత్వానికి లేకుండా పోయింది.

అయితే, అధికారిక నివేదిక మీడియా కారణంగానే 29 మంది ప్రాణాలు పోయాయని చెప్పినప్పుడు ఆ వ్యాఖ్యలను యథాతథంగా మీడియా చానళ్లు స్క్రోలింగ్ ఇచ్చాయి తప్పితే, “మీడియా తప్పేమీ లేదు ” అని గొంతు పెగిలి మాట్లాడే ధైర్యం ఏ మీడియా కూడా చేయలేక పోయింది. ఒక చిన్న జబర్దస్త్ కమెడియన్ తమ మీద వ్యాఖ్యలు చేస్తే వాటిని పట్టుకుని చీల్చి చెండాడి గంటల తరబడి డిబేట్ లు పెట్టి ఖండించే మీడియా చానళ్లు, 29 మంది మరణానికి మీడియానే కారణం అని తమ మీద ప్రభుత్వ నివేదిక వస్తే కిమ్మనకుండా ఎందుకు కూర్చున్నాయనేది ప్రశ్నార్థకంగా మారింది. గతంలో అధికార పార్టీతో కొన్ని చానళ్లు కుమ్మక్కయ్యాయని ఒక రాజకీయ నాయకుడు ఆరోపణలు చేస్తే, రోడ్డెక్కిన జర్నలిస్టు సంఘాలు, ముక్తకంఠంతో ఖండించిన మీడియా సంస్థలు ఇప్పుడు ఎందుకు మౌనం దాల్చాయి అన్నది ప్రజలకు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది.

బహుశా, అధికార పార్టీ లకు వ్యతిరేకంగా మాట్లాడే ధైర్యం తెలుగు రాష్ట్రాల్లో ఏ మీడియా ఛానల్ కు లేదేమోనని ప్రజలకు సందేహం వస్తే అది వారి తప్పు కాదు. గతంలో భారతదేశంలో ఇతర రాష్ట్రాలలో, అధికార పార్టీ లో ని లొసుగుల ని బయట పెడుతూ స్టింగ్ ఆపరేషన్లు జరిగేవి. ప్రజల పక్షాన నిలబడే కొన్ని సంస్థలు అధికారం లొ ఉన్నవారిపై ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేసి నిజాలను బయటపెట్టేవి. తెలుగు మీడియాలో అధికారంలో ఉన్న వారికి వ్యతిరేకంగా ఒక చిన్న స్టింగ్ ఆపరేషన్ జరిగి ఎన్నేళ్ళయిందో కనీసం గుర్తుకు కూడా రావడం లేదు. అలా ఇటువంటి స్టింగ్ ఆపరేషన్లు జరగడం లేదు అంటే దానర్థం- ఒకటి, రెండు తెలుగు రాష్ట్రాలలోనూ ప్రభుత్వాలు అత్యంత అద్భుతంగా, ఎటువంటి అవినీతి , అన్యాయం లేకుండా పరిపాలిస్తూ ఉండాలి. లేదంటే, రెండవ కారణం- మన తెలుగు మీడియా అధికార పార్టీల జోలికి ఎట్టిపరిస్థితుల్లోనూ వెళ్లకూడదని శపథం చేసుకుని ఉండాలి.

ఏది ఏమైనా, భవిష్యత్తులో జర్నలిస్టు సంఘాలన్నీ కానీ, మీడియా సంస్థలన్నీ కానీ ఏదైనా సమస్య పై సంఘటితంగా రోడ్డెక్కిన ప్పుడు, ఈ 29 మరణాల కు మీరే కారణం అని ఇచ్చిన అధికారిక నివేదిక పై మీ స్పందన ఏంటి అని ప్రజలు మీడియాని అడగాల్సిన అవసరం ఉంది.

– జురాన్ (@CriticZuran)

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com