హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇవాళ ఒక చారిత్రక ఘట్టం చోటుచేసుకుంది. గోదావరి జలాలలు ఇవాళ కృష్ణానదిలో ప్రవేశిస్తున్నాయి. తాటిపూడి ఎత్తిపోతల పథకంనుంచి పోలవరం కుడికాల్వలోకి విడుదలైన 60 క్యూసెక్కుల గోదావరి జలాలు ఇవాళ ఉదయం పల్లెర్లమూడి గ్రామంవద్ద కృష్ణాజిల్లాలోకి ప్రవేశించాయి. ఈ జలాలు ఈ సాయంత్రంలోగా కృష్ణానదిలోకి ప్రవేశిస్తాయి. కృష్ణాజిల్లా నూజివీడు సమీపంలోని పల్లెర్లమూడివద్ద గోదావరిజలాలకు స్వాగతం పలికేందుకు ఏర్పాటుచేసిన కార్యక్రమానికి రైతులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. ఏపీ నీటిపారుదలశాఖమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, టీడీపీ ఎమ్మెల్యేలు చింతమనేని ప్రభాకర్, మాగంటిబాబు, వల్లభనేని వంశీ తదితరులు పూర్ణకుంభంతో గోదావరి జలాలకు స్వాగతం పలికారు. పూజల చేసి కొబ్బరికాయలుకొట్టి హారతి ఇచ్చారు.
గోదావరి, కృష్ణా నదుల అనుసంధానం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చిరకాల స్వప్నం అని దేవినేని ఉమా అన్నారు. పట్టిసీమ ప్రాజెక్ట్ పైప్ లైన్ పనులు ఇంకా పూర్తికాకపోవటంతో ఇప్పుడు తాటిపూడినుంచి పోలవరం కుడికాల్పలోకి నీటిని విడుదలచేశామని, ఈ నెల 15న సీఎమ్ పట్టిసీమనుంచి పోలవరం కుడికాల్పలోకి గోదావరి నీటిని ముఖ్యమంత్రి విడుదలచేసి అధికారికంగా నదుల అనుసంధానాన్ని ప్రకటిస్తారని ఉమా చెప్పారు. వృథాగా సముద్రంలో కలిసిపోతున్న గోదావరినీటిని కృష్ణాజిల్లాలోకి మళ్ళించి చంద్రబాబు చరిత్ర సృష్టించారని అన్నారు. ఇది వృథా ప్రాజెక్ట్ అని ప్రతిపక్షాలు చేసిన విమర్శలు గోదావరిజలాలలో కొట్టుకోపోతాయని చెప్పారు. నీళ్ళలో దిగిన తెలుగుదేశం నేతలు చిన్నపిల్లలైపోయి ఆనందంతో నీళ్ళలో తడిసిపోతూ కేరింతలు కొట్టారు.